కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యం కోసం అన్వేషణ

సత్యం కోసం అన్వేషణ

సత్యం తెలుసుకోవడం వల్ల మన ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. ఉదాహరణకు, అంటురోగాలు ఎలా వ్యాపిస్తాయి అనే ప్రశ్నకు సంబంధించిన సత్యం తెలుసుకోవడం మన జీవితాల్ని ఎలా మార్చేసిందో గమనించండి.

వేల సంవత్సరాలపాటు ఆ ప్రశ్నకు జవాబు ఎవ్వరికీ తెలియలేదు. ఈలోగా, రకరకాల అంటువ్యాధులు లక్షలమందిని పొట్టనబెట్టుకున్నాయి. కాలం గడుస్తుండగా శాస్త్రవేత్తలు దానికి సంబంధించిన సత్యాన్ని తెలుసుకున్నారు. చాలామట్టుకు రోగాలు క్రిముల వల్ల అంటే బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి సూక్ష్మజీవుల వల్ల వ్యాపిస్తాయని వాళ్లు కనుక్కున్నారు. ఆ ఒక్క సత్యం ప్రజల్ని అనేక రోగాల నుండి కాపాడింది, వాటికి చికిత్సలు కనుక్కోవడానికి సహాయం చేసింది; దానివల్ల కోట్లాదిమంది మరింత ఆరోగ్యంగా, ఎక్కువకాలం బ్రతకడం సాధ్యమైంది.

ముఖ్యమైన ఇంకొన్ని ప్రశ్నల మాటేమిటి? ఈ కింది వాటిగురించి ఒకసారి ఆలోచించండి:

  • దేవుడు ఎవరు?

  • యేసుక్రీస్తు ఎవరు?

  • దేవుని రాజ్యం అంటే ఏంటి?

  • రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి?

ఈ ప్రశ్నలకు సంబంధించిన సత్యాన్ని కనుక్కోవడం వల్ల లక్షలాదిమంది తమ జీవితాల్ని చక్కదిద్దుకున్నారు. వీటికి జవాబులు తెలుసుకుంటే మీ జీవితం కూడా బాగుంటుంది.

మీరు సత్యాన్ని కనుక్కోవడం సాధ్యమేనా?

‘అసలు దేని గురించైనా సత్యాన్ని కనుక్కోవడం సాధ్యమేనా?’ అని మీకనిపించవచ్చు. నిజంగానే, చాలావాటికి సంబంధించిన సత్యాన్ని కనుక్కోవడం రానురాను ఇంకా కష్టమౌతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకు?

ప్రభుత్వాలు, కంపెనీలు, లేదా మీడియా నిజం చెప్తాయంటే చాలామంది నమ్మరు. ఇతరులు తమ అభిప్రాయం చెప్తున్నారా, కొంత సమాచారాన్ని దాస్తున్నారా, పచ్చి అబద్ధాలాడుతున్నారా లేక నిజం చెప్తున్నారా అనేది గుర్తుపట్టడం కష్టం. అటు అపనమ్మకం, ఇటు తప్పుడు సమాచారాలు వ్యాపించి ఉన్న ఈ ప్రపంచంలో అసలు వాస్తవాలు ఏంటి, వాటిని ఎలా అర్థంచేసుకోవాలి అనే విషయాల్లో ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి.

పరిస్థితి అలా ఉన్నా, జీవితానికి సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబులు తెలుసుకోవడం సాధ్యమే. దానికోసం ఏం చేయాలి? రోజువారీ జీవితంలో మీకు వచ్చే మామూలు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి మీరేం చేస్తారో అది చేస్తే చాలు.

సత్యం కోసం మీ అన్వేషణ

చెప్పాలంటే మీరు ప్రతీరోజు ఏదోకవిధంగా సత్యం కోసం వెదుకుతూనే ఉంటారు. ఉదాహరణకు, జెస్సికా పరిస్థితినే తీసుకోండి. ఆమె ఇలా అంటోంది, “నా కూతురికి పల్లీలు అస్సలు పడవు, దాని మాంసకృత్తులు లేదా ప్రోటీన్‌లు ఏ కొంచెం నోటికి తగిలినా ఆమె ప్రాణాలకే ప్రమాదం.” అందుకే తన కూతురికి తినేవి ఏవైనా కొనేటప్పుడు, అవి ఆమె ఆరోగ్యానికి మంచివో కావో జెస్సికా తెలుసుకుంటుంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “మొదటిగా నేనేమి చేస్తానంటే, ఫలానా ఆహారంలో ఏయే పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వాటి లేబుల్స్‌ని జాగ్రత్తగా చూస్తాను. తర్వాత నేను ఇంకొంత పరిశోధన చేస్తాను, అలాగే దాని తయారీదారునితో కూడా మాట్లాడి, అందులో అనుకోకుండా పల్లీల ప్రోటీన్‌లు ఏవైనా కలిశాయేమో కనుక్కుంటాను. ఆహారాన్ని తయారుచేస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలూ పాటిస్తారనే పేరు ఆ కంపెనీకి ఉందనే నమ్మకం కుదరడానికి నేను వెబ్‌సైట్లను, నమ్మదగిన ఇతర సమాచారాన్ని కూడా చూస్తాను.”

మీ రోజువారీ జీవితంలో వచ్చే ప్రశ్నలు జెస్సికా పరిస్థితంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ మీరు జెస్సికాలా, మీకొచ్చే ప్రశ్నలకు జవాబులు కనుక్కోవడానికి ఈ కింది పద్ధతి పాటించవచ్చు:

  • వాస్తవాల్ని తెలుసుకోండి.

  • మరింత పరిశోధన చేయండి.

  • సమాచారం కోసం వెతికే వెబ్‌సైట్లు, మరితరమైనవి నమ్మదగినవో కావో చూసుకోండి.

జీవితంలో వచ్చే పెద్దపెద్ద ప్రశ్నలకు సరైన జవాబులు కనుక్కోవడానికి కూడా అదే పద్ధతి పాటించవచ్చు. ఎలా?

సత్యాన్ని తెలియజేసే సాటిలేని పుస్తకం

జెస్సికా తన కూతురి ఆహారం విషయంలో పరిశోధన చేస్తున్నప్పుడు ఎలాంటి పద్ధతి పాటించిందో, బైబిలు సత్యాన్ని వెతుకుతున్నప్పుడు కూడా అలాంటి పద్ధతినే పాటించింది. ఆమె ఇలా అంటోంది: “జాగ్రత్తగా చదవడం వల్ల, శ్రద్ధగా పరిశోధన చేయడం వల్ల నేను బైబిల్లో ఉన్న సత్యాన్ని కనుక్కోగలిగాను.” జెస్సికాలాగే, లక్షలాదిమంది ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు తెలుసుకున్నారు:

  • మన జీవితానికి అర్థం ఏంటి?

  • చనిపోయాక ఏం జరుగుతుంది?

  • ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి?

  • బాధలన్నిటినీ తీసేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు?

  • మన కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

మీరు బైబిలు చదవడం ద్వారా, www.jw.org వెబ్‌సైట్లో మరింత పరిశోధన చేయడం ద్వారా ఇలాంటి ప్రశ్నలకు సరైన జవాబులు తెలుసుకోవచ్చు.