కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కడుపేదరికం ఎలా ఉంటుంది?

కడుపేదరికం ఎలా ఉంటుంది?

కడుపేదరికం ఎలా ఉంటుంది?

కడుపేదరికం ప్రాణాంతకమైనది. దానిలో మగ్గుతున్నవాళ్లకు సరిపడా ఆహారం, నీళ్లు, వంటచెరకు, కావాల్సిన వసతి, ఆరోగ్య సౌకర్యం, విద్య ఉండవు. వంద కోట్లమందిని అది పట్టిపీడిస్తోంది, ఆ సంఖ్య దాదాపు భారతదేశ జనాభాతో సమానం. అయితే, పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా లాంటి ప్రదేశాల్లోవున్న చాలామందికి కడు పేదరికంలో మగ్గుతున్నవాళ్ల గురించి అస్సలు తెలియదు. అలా మగ్గుతున్న కొంతమంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అంబారూషీమా భార్యాపిల్లలతో కలిసి ఆఫ్రికాలోని రువాండాలో నివసిస్తున్నాడు. ఆయన ఆరవ బిడ్డ మలేరియాతో చనిపోయాడు. ఆయనిలా చెబుతున్నాడు: “మా నాన్న భూమిని ఆరు భాగాలు చేయాల్సివచ్చింది. నాకు వచ్చిన భాగం చాలా చిన్నది, అందుకే భార్యాపిల్లలను తీసుకుని పట్టణానికి వచ్చేశాను. జీవనోపాధి కోసం నేనూ నా భార్యా ఇసుక బస్తాలు, రాళ్ల బస్తాలు మోస్తున్నాం. మా ఇంటికి కిటికీలు లేవు. పోలీస్‌స్టేషన్‌ దగ్గరున్న బావి నుండి మేము నీళ్లు తెచ్చుకుంటాం. సాధారణంగా ఒక్కపూటే తింటాం, పని లేనప్పుడైతే రోజంతా పస్తు ఉంటాం. పిల్లలు ఆకలి! ఆకలి! అని ఏడుస్తుంటే తట్టుకోలేను, అందుకే ఆ రోజు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లిపోతాను.”

బీక్టర్‌, కార్మెన్‌  జీవనోపాధి కోసం చెప్పులు కుడతారు. వాళ్లకు ఐదుగురు పిల్లలు. వాళ్లు బొలీవియాలోని ఒక మారుమూల పట్టణంలో నివసిస్తున్నారు. పచ్చి ఇటుకలతో కట్టిన పాత ఇంట్లోని ఒక గదిలో అద్దెకు ఉంటున్నారు, ఇంటి పైకప్పు రేకుతో చేసింది కాబట్టి వర్షం పడినప్పుడు అది కారుతుంది. విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. పాఠశాల ఎంత కిక్కిరిసి ఉంటుందంటే తన కూతురు కోసం తనే ఒక బల్ల తయారుచేసి ఇవ్వాల్సివచ్చింది. అలాగైతేనే ఆమె పాఠశాలకు వెళ్లి చదువుకోగలదు. వంట చేసుకోవడానికి, తాగే నీళ్లు కాచుకోవడానికి కట్టెల కోసం భార్యాభర్తలు పది కిలోమీటర్లు నడవాలి. కార్మెన్‌ ఇలా చెబుతోంది: “మాకు మరుగుదొడ్డి లేదు, అందుకే మేము నది పక్కకు వెళ్లాల్సివస్తుంది. అందరూ ఆ నదిలోనే స్నానాలు చేస్తారు, చెత్త పారేస్తారు. దానివల్ల మా పిల్లలు చాలాసార్లు రోగాల పాలౌతున్నారు.”

ఫ్రాన్సీస్కూ, ఈలీడ్యా మొజాంబిక్‌లోని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్లకు ఐదుగురు పిల్లలు. ఒక బాబుకు మలేరియా వచ్చింది, ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో వాడు చనిపోయాడు. వాళ్లు తమ చిన్న పొలంలో వరి, చిలగడ దుంపలు పండిస్తారు. అవి వాళ్లకు మూడు నెలలు వస్తాయి. ఫ్రాన్సీస్కూ ఇలా చెబుతున్నాడు: “కొన్నిసార్లు వర్షాలు పడవు, ఇంకొన్నిసార్లు చేతికొచ్చిన పంటను దొంగలు దోచుకుంటారు. అందుకే, నిర్మాణానికి ఉపయోగించే వెదురుకర్రలు కొట్టి, వాటిని అమ్మి కొంత డబ్బు సంపాదిస్తాను. రెండు గంటలు నడిచి వెళ్లి అడవి ప్రాంతం నుండి వంటచెరకు కూడా తెచ్చుకుంటాం. మా ఆవిడా నేనూ చెరొక మోపు మోసుకొస్తాం. ఒకదానితో వారమంతా వంట చేసుకుంటాం, మరో దాన్ని అమ్ముకుంటాం.”

ఒకవైపు కోట్లాదిమంది ముందెప్పుడూ లేనంత సంపన్న స్థితిలో ఉంటే, మరోవైపు ప్రతీ ఏడుగురిలో ఒకరు అంబారూషీమా, బీక్టర్‌, ఫ్రాన్సీస్కూలా కడుపేదరికంలో జీవిస్తున్నారు. అంటే ఎక్కడో ఘోరమైన తప్పు జరిగిందని, అన్యాయం జరిగిందని చాలామంది భావిస్తారు. కొంతమంది దీన్ని సరిచేయడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నాలేమిటో, వాళ్లు దేని కోసం ఎదురుచూశారో తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది. (w11-E 06/01)

[2, 3 పేజీల్లోని చిత్రం]

తన ఇద్దరు పిల్లలతో నదిలో నుండి నీళ్లు తీసుకువెళ్తున్న కార్మెన్‌