కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చెట్టును నరికేస్తే అది మళ్లీ చిగురిస్తుందా?

చెట్టును నరికేస్తే అది మళ్లీ చిగురిస్తుందా?

లెబానోనులో పెరిగే ఎత్తైన దేవదారు చెట్లతో పోలిస్తే, మెలికలు తిరిగిపోయి, బుడిపెలు ఉన్న ఒలీవ చెట్లు అంత అందంగా కనిపించకపోవచ్చు. కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకోగల అసాధారణ సామర్థ్యం ఒలీవ చెట్ల సొంతం. ఇప్పుడున్న కొన్ని ఒలీవ చెట్ల వయసు దాదాపు 1,000 సంవత్సరాలని ఓ అంచనా. ఒలీవ చెట్టు వేర్లు భూమిలోపల బాగా వ్యాపించివుంటాయి, అందుకే కాండాన్ని పూర్తిగా నరికేసినా ఆ చెట్టు మళ్లీ చిగురించగలదు. వేర్లు బ్రతికున్నంతకాలం చెట్టు చిగురిస్తూనే ఉంటుంది.

పితరుడైన యోబు, తాను చనిపోయినా మళ్లీ బ్రతుకుతానని నమ్మాడు. (యోబు 14:13-15) దేవుడు తనను మళ్లీ బ్రతికించగలడనే నమ్మకం తనకు ఎంత ఉందో వివరించడానికి యోబు, ఓ చెట్టు ఉదాహరణను చెప్పాడు. బహుశా ఆయన ఒలీవ చెట్టు గురించే మాట్లాడుతుండవచ్చు. యోబు ఇలా అన్నాడు, “వృక్షము నరకబడినయెడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేతకొమ్మలు వేయుననియు నమ్మకము కలదు.” బాగా ఎండిపోయిన ఒలీవ చెట్టు మొద్దు కూడా వర్షాలు పడిన తర్వాత చిగురిస్తుంది, దాని నుండి లేత కొమ్మలు వస్తాయి.—యోబు 14:7-9.

నరికివేయబడిన ఒలీవ చెట్టు మళ్లీ చిగురించడం చూడాలని రైతు ఎంతో ఆశతో ఎదురుచూస్తాడు. అలాగే యెహోవా కూడా, చనిపోయిన తన నమ్మకమైన సేవకుల్నీ, ఎంతోమంది ఇతరుల్నీ మళ్లీ బ్రతికించాలని ఆత్రుతతో ఎదురుచూస్తున్నాడు. (మత్త. 22:31, 32; యోహా. 5:28, 29; అపొ. 24:14,15) చనిపోయిన మన ఆత్మీయులు మళ్లీ బ్రతికి, సంతోషంగా జీవించడం చూసినప్పుడు మన ఆనందానికి అవధులు ఉండవు.