కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లల హృదయాలను చేరుకోవడం

మీ పిల్లల హృదయాలను చేరుకోవడం

మీ పిల్లల హృదయాలను చేరుకోవడం

పిల్లలు హింసాత్మకమైన ఆటలు ఆడడం చూసి మీకెప్పుడైనా బాధనిపించిందా? ఈ లోక వినోదాన్ని దౌర్జన్యం ఆవరించింది కాబట్టి, చిన్నపిల్లలు కూడా అలాంటి ఆటలు ఆడడం సర్వసాధారణమైపోయింది. పిల్లలు హింసాత్మకమైన ఆటవస్తువులకు బదులు శాంతియుతమైన ఆటవస్తువులను ఎన్నుకోవడానికి మీరెలా సహాయం చేస్తారు? చాలాకాలంగా ఆఫ్రికాలో యెహోవాసాక్షుల మిషనరీగా సేవ చేస్తున్న వాల్‌ట్రాట్‌, ఓ అబ్బాయికి అలా చేసేందుకు సహాయం చేయడానికి మార్గాన్ని కనుక్కుంది.

తన దేశంలో జరుగుతున్న యుద్ధం కారణంగా, వాల్‌ట్రాట్‌ తాను నివసిస్తున్న దేశాన్ని వదిలి ఆఫ్రికాలోని మరో దేశానికి వెళ్ళిపోవాల్సివచ్చింది. అక్కడ ఆమె, ఐదు సంవత్సరాల అబ్బాయి ఉన్న తల్లితో బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించింది. వాల్‌ట్రాట్‌ ఆ తల్లిని కలిసినప్పుడల్లా, ఆ అబ్బాయి తనకున్న ఒకే ఒక ఆటవస్తువైన చిన్న ప్లాస్టిక్‌ తుపాకీతో ఆడుతూ ఉండేవాడు. ఆ అబ్బాయి తన తుపాకీని ఏదో ఒక వస్తువుపైకి గురిపెట్టడం వాల్‌ట్రాట్‌ ఎప్పుడూ గమనించలేదు, కానీ దాన్ని పదేపదే తెరుస్తూ మూస్తూ, దాన్ని మళ్ళీ గుళ్ళతో నింపుతున్నట్లుగా ఆడుతుండేవాడు.

వాల్‌ట్రాట్‌ ఆ అబ్బాయితో ఇలా అంది: “వెర్నర్‌, నేను మీ దేశంలో ఎందుకుంటున్నానో తెలుసా? యుద్ధంవల్ల, నీ దగ్గర ఉన్నదానిలాగే కనిపించే తుపాకులతో ప్రజలను కాల్చే ప్రమాదకరమైన మనుష్యులనుండి తప్పించుకోవడానికి నేను నా స్వదేశంనుండి పారిపోవాల్సి వచ్చింది. అలా కాల్చడం మంచిదేనంటావా?”

“మంచిది కాదు” అంటూ వెర్నర్‌ నిరాశగా జవాబిచ్చాడు.

“సరిగ్గా చెప్పావు” అని, ఆ తర్వాత వాల్‌ట్రాట్‌ ఇలా అడిగింది: “నేను ప్రతీ వారం నిన్నూ, మీ అమ్మనూ కలవడానికి ఎందుకు వస్తున్నానో తెలుసా? ఎందుకంటే, దేవునితో, తమ పొరుగువారితో శాంతియుతంగా ఉండేందుకు ఇతరులకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.” వెర్నర్‌ తల్లి అనుమతి తీసుకుని, వాల్‌ట్రాట్‌ ఆ అబ్బాయికి ఇలా చెప్పింది: “నువ్వు నీ తుపాకీ నాకిచ్చేస్తే, నేను దాన్ని పడేసి, దానికి బదులు, నాలుగు చక్రాలున్న ట్రక్కు బొమ్మ నీకు తప్పకుండా తెచ్చిస్తాను.”

వెర్నర్‌ తన బొమ్మ తుపాకీని ఆమెకు ఇచ్చేశాడు. ఆ తర్వాత నాలుగు వారాలు ఆలస్యమైనా, చివరికి చెక్కతో చేసిన ట్రక్కు బొమ్మ ఆయనకు లభించింది. ముఖంపై పెద్ద చిరునవ్వుతో వెర్నర్‌ దాన్ని స్వీకరించాడు.

మీ పిల్లలు యుద్ధాయుధాలను పోలిన ఆటవస్తువులను విడిచిపెట్టేందుకు కదిలించబడేలా వారి హృదయాల్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ మీరు మీ పిల్లలతో మాట్లాడేందుకు సమయం తీసుకుంటున్నారా? అలా చేస్తే మీరు వారికి జీవితాంతం ప్రయోజనం చేకూర్చే ఒక పాఠాన్ని నేర్పిస్తారు.