కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను కలగంటున్నానేమో అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది!”

“నేను కలగంటున్నానేమో అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది!”

“నేను కలగంటున్నానేమో అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది!”

లార్డెస్‌ తన అపార్టుమెంటు కిటికీలోంచి నగరం వైపు చూస్తోంది, వణుకుతున్న తన నోటిని ఆమె చేతివ్రేళ్ళు కప్పుతున్నాయి. ఆమె ఒక లాటిన్‌ అమెరికన్‌ స్త్రీ, దౌర్జన్యుడైన తన భర్త ఆల్ఫ్రెడో చేతిలో 20 సంవత్సరాలకు పైగా బాధలనుభవించింది. ఆల్ఫ్రెడో మారడానికి సుముఖత చూపించాడు. కానీ, లార్డెస్‌కు తను పడిన శారీరక, మానసిక బాధల గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ కష్టంగానే ఉంది.

“మా పెళ్ళయ్యాక కేవలం రెండు వారాలకే ఇది ప్రారంభమైంది” అని చిన్న గొంతుతో లార్డెస్‌ చెప్పింది. “ఒకసారి, కొడితే నా రెండు పళ్ళు ఊడిపోయాయి. మరొకసారి నేను తప్పించుకోవడానికి వంగేసరికి, ఆయన పిడికిలి వార్డ్‌రోబ్‌ను బద్దలు చేసింది. తిట్టే తిట్లు చాలా నొప్పించేవి. ఆయన నన్ను, ‘పనికిరాని చెత్త’ అని పిలిచేవాడు, నేను తెలివిలేని దాన్ని అన్నట్లు నాతో ప్రవర్తించాడు. నేను విడిచి పెడదామనుకున్నాను, కానీ ముగ్గురు పిల్లలతో ఎలా విడిచిపెట్టగలను?”

ఆల్ఫ్రెడో మృదువుగా లార్డెస్‌ భుజాలపై చెయ్యివేసి ఇలా అన్నాడు: “నేను సీనియర్‌ ప్రొఫెషనల్‌ను, నన్ను కోర్టుకు పిలిపించి, నా చేతికి రక్షణ ఉత్తరువు (ప్రొటెక్షన్‌ ఆర్డర్‌) ఇచ్చినప్పుడు, నన్ను అవమానపరచినట్లుగా భావించాను. నేను మారడానికి ప్రయత్నించాను, కాని మళ్ళీ కొంత కాలానికి అదే ధోరణిలో ప్రవర్తించేవాడిని.”

మరి పరిస్థితులు ఎలా మారాయి? “వీధి చివర్లో ఉండే దుకాణంలో ఒక యెహోవాసాక్షి ఉండేది” అంటూ లార్డెస్‌ చెప్పడం ప్రారంభించింది, ఇప్పుడు ఆమె బాగా ప్రశాంతంగా కనబడుతోంది. “బైబిలు అర్థం చేసుకోవడానికి సహాయపడతానని ఆమె నాతో చెప్పింది. యెహోవా స్త్రీలను విలువైనవారిగా దృష్టిస్తాడని నేను తెలుసుకున్నాను. మొదట్లో ఆల్ఫ్రెడో చాలా కోపగించుకున్నప్పటికీ, నేను యెహోవాసాక్షుల కూటాలకు హాజరవడం ప్రారంభించాను. రాజ్య మందిరములో స్నేహితులతో గడపడం నాకు ఒక కొత్త అనుభవం. నాకంటూ సొంతగా నమ్మకాలు ఉంటాయని, వాటిని నేను స్వేచ్ఛగా వెలిబుచ్చడమే కాక ఇతరులకు కూడా నేర్పించవచ్చని తెలుసుకుని నేను చాలా ఆశ్చర్యపోయాను. దేవుడు నాకు విలువిచ్చాడని నేను గ్రహించాను. అది నాకెంతో ధైర్యాన్నిచ్చింది.

“నేను ఎన్నటికీ మరచిపోలేనటువంటి విధంగా నా జీవితం మలుపు తిరిగింది. అప్పటికి ఇంకా ఆల్ఫ్రెడో క్యాథలిక్‌ మాస్‌లకు ప్రతి ఆదివారం హాజరవుతున్నాడు, నేను యెహోవాసాక్షులతో కలిసి చేసే పనులకు అసమ్మతిని తెలిపాడు. నేను ఆయన కళ్ళలోకి సూటిగా చూస్తూ, ‘ఆల్ఫ్రెడో, నీ అభిప్రాయాలు, నా అభిప్రాయాలు ఒక్కటి కాదు’ అని నెమ్మదిగానే అయినా దృఢంగా అన్నాను. ఆయన నన్ను కొట్టలేదు! ఆ తర్వాత కొద్ది రోజులకు నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఇప్పటికి అయిదు సంవత్సరాలు అయింది, ఆయన నామీద చెయ్యి చేసుకోలేదు.”

ఇంకా గొప్ప మార్పులు ముందు ముందు రానైవున్నాయి. ఆల్ఫ్రెడో ఇలా చెబుతున్నాడు: “లార్డెస్‌ బాప్తిస్మం తీసుకున్నాక దాదాపు మూడు సంవత్సరాలకు, యెహోవాసాక్షి అయిన నా కొలీగ్‌ ఒకాయన వాళ్ళింటికి నన్ను ఆహ్వానించాడు, అక్కడ ఆయన బైబిల్లోంచి చాలా ఆసక్తికరమైన విషయాలను వివరించి చెప్పాడు. నా భార్యకు చెప్పకుండానే నేను ఆయనతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాను. త్వరలోనే నేను లార్డెస్‌తో కలిసి కూటాలకు వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడ విన్న అనేక ప్రసంగాలు కుటుంబానికి సంబంధించినవే, అవి విని నేను చాలా సిగ్గుపడేవాణ్ణి.”

కూటాలు అయిపోయిన తర్వాత సంఘ సభ్యులందరు, మగవాళ్ళతో సహా ఊడ్వడం చూసి ఆల్ఫ్రెడో చాలా ముగ్ధుడయ్యాడు. వాళ్ళ ఇండ్లకు వెళ్ళినప్పుడు, భర్తలు అంట్లు కడగడంలో తమ భార్యలకు ఎలా సహాయపడేవారో చూశాడు. నిజమైన ప్రేమ ఎలా ప్రవర్తింపజేస్తుందో, ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే ఆల్ఫ్రెడోకు తెలియజేశాయి.

తర్వాత కొద్దికాలానికి, ఆల్ఫ్రెడో బాప్తిస్మం తీసుకున్నాడు, ఇప్పుడు ఆయనా, ఆయన భార్యా పూర్తికాల సేవకులు. “భోజనం చేసిన తర్వాత బల్లను శుభ్రం చేయడానికి, పక్క సర్దడానికి ఆయన తరచుగా నాకు సహాయం చేస్తున్నాడు” అని లార్డెస్‌ చెబుతోంది. “ఆయన నా వంటను మెచ్చుకుంటున్నాడు, నేను ఎలాంటి సంగీతం వినాలి, ఇంట్లోకి ఎలాంటి వస్తువులు కొనాలి అనే విషయాల్లో ఆయన నాకు ఎంపిక చేసుకునే అవకాశాన్నిస్తున్నాడు. ఆల్ఫ్రెడో ఇంతకుముందు ఇవన్నీ అస్సలు చేయలేదు! ఇటీవలే, మొదటిసారిగా, ఆయన నాకోసం పూలు కొనుక్కొచ్చాడు. నేను కలగంటున్నానేమో అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది!” (g01 11/8)

[10వ పేజీలోని చిత్రం]

“దేవుని దృష్టిలో నాకు విలువుందని గ్రహించాను. అది నాకు ధైర్యాన్నిచ్చింది”

[10వ పేజీలోని చిత్రం]

కూటాల తర్వాత సంఘ సభ్యులు, పురుషులు కూడా, ఊడవడం చూసి ఆల్ఫ్రెడో చాలా ముగ్ధుడయ్యాడు

[10వ పేజీలోని చిత్రం]

వంటపాత్రలు కడగడంలో తమ భార్యలకు సహాయపడుతున్న భర్తలను ఆయన చూశాడు

[10వ పేజీలోని చిత్రం]

“ఇటీవలే, మొదటిసారిగా, ఆయన నా కోసం పూలు కొనుక్కొచ్చాడు”