ధరలు పెరిగిపోతుంటే బ్రతికేదెలా?
ఉన్నంతలో తృప్తిగా జీవించండి
ఉన్నంతలో తృప్తిగా జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు వాళ్ల అవసరాల్ని మార్చుకుంటూ, వచ్చిన దాంట్లోనే హాయిగా బ్రతికేస్తారు.
ఉన్నంతలోనే ఎందుకు తృప్తిగా ఉండాలి?
జెస్సికా కోహ్లర్ అనే సైకాలజిస్ట్ ప్రకారం, తృప్తిగా ఉండేవాళ్లు జీవితాన్ని భారంగా ఈడ్చుకురారు, ఆశతో ముందుకెళ్తారు. వాళ్లు ఇతరుల్ని చూసి కుళ్లుకోరు కాబట్టి, ఏ చీకూచింతా లేకుండా సంతోషంగా ఉంటారు. కొంతమంది దగ్గర ఆస్తులు లేకపోయినా వాళ్ల ఇళ్లు ఆనందానికి చిరునామాలా ఉంటుంది. ఎందుకంటే, కోట్లు కుమ్మరించినా కొనలేని వాటిని వాళ్లు సంపాదించుకున్నారు. అవే, నా అనుకునే వాళ్లతో పెంచుకునే అనుబంధాలు, ఆప్యాయతలు.
మీరేం చేయవచ్చు?
పక్కవాళ్లతో పోల్చుకోకండి. తక్కువలో బ్రతుకుతున్న మీ జీవితాన్ని, బాగా దర్జాగా బ్రతికేవాళ్లతో పోల్చుకుంటే ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. మీకు వెలితిగా అనిపించి, ఇతరుల దగ్గర ఉన్నవి మా దగ్గర లేవే అని బాధపడతారు, ఈర్ష్య పడతారు. అయితే, కనిపించేవన్నీ నిజం కాకపోవచ్చు. పైకి డాబుగా కనిపించే వాళ్లకు ఎన్ని అప్పులున్నాయో ఎవరికి తెలుసు. సెనెగల్ అనే దేశంలో ఉంటున్న నికోల్ ఇలా చెప్తుంది: “అన్నీ ఉంటేనే సంతోషంగా ఉంటామని నేను అనుకోను. తృప్తిగా ఉంటే, వేరేవాళ్ల దగ్గర ఉన్నవి నా దగ్గర లేకపోయినా సంతోషంగానే ఉంటాను.”
ఇలా చేసి చూడండి: మీరు చాలా గొప్పగా బ్రతకొచ్చు అని చూపించే యాడ్‌లను, సోషల్ మీడియా పోస్ట్‌లను చూడకుండా ఉండడానికి ప్రయత్నించండి.
కృతజ్ఞతతో ఉండండి. కృతజ్ఞతతో ఉండేవాళ్లు ఎక్కువ సంతోషంగా ఉంటారు. తమకు ఇంకా ఏదో కావాలని ఆరాటపడరు. హయిటీ అనే దేశంలో ఉంటున్న రాబర్టన్ ఇలా అంటున్నాడు: “నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఎవరైనా మంచి చేస్తే, దాని గురించి సమయం తీసుకుని ఆలోచిస్తాను. వాళ్లు చేసిన దానికి నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్తాను. అలాగే, ఎవరు ఏది ఇచ్చినా థ్యాంక్యూ చెప్పమని మా ఎనిమిదేళ్ల అబ్బాయికి నేర్పిస్తాను.”
ఇలా చేసి చూడండి: మీరు “థ్యాంక్యూ” చెప్పాలని అనుకునే వాటి గురించి రోజూ డైరీలో రాసిపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉండడం, మంచి కుటుంబం-స్నేహితులు ఉండడం, ఒక అందమైన సూర్యాస్తమయం చూడడం . . . ఇలా దేని గురించైనా మీరు రాసుకోవచ్చు.
తృప్తిగా జీవించడం కొన్నిసార్లు మనందరికి కష్టంగానే అనిపిస్తుంది. కానీ మన కష్టం ఊరికే పోదు! సంతృప్తిగా ఉంటే సంతోషంగా ఉంటాం. సంతోషాన్ని డబ్బులు పెట్టి కొనగలమా చెప్పండి.

