1,65,000 కన్నా ఎక్కువ లిటరేచర్ కార్టులు
ఇంటింటి పరిచర్యకు పేరుగాంచిన యెహోవాసాక్షులు ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో పెటివున్న ఆకర్షణీయమైన లిటరేచర్ కార్టుల పక్కన నిలబడి కనిపిస్తున్నారు.
వాళ్లు ఈ మధ్య ప్రకటనా పనిని ఈ పద్ధతిలో కూడా ఎక్కువగా చేస్తున్నారు. 2011 నవంబరులో, న్యూయార్క్ పట్టణంలో కొంతమంది యెహోవాసాక్షులు టేబుళ్లు, కార్టుల మీద పుస్తకాలూ పత్రికలూ పెట్టి ప్రజలకు బైబిలు సందేశాన్ని తెలియజేశారు. ఈ పద్ధతిలో సాక్ష్యమివ్వడం వల్ల ఎంత మంచి ఫలితాలు వచ్చాయంటే దీని గురించి ఇతర పట్టణాల్లోని వాళ్లకు కూడా ఇట్టే తెలిసిపోయింది.
2015 మార్చి నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాలకు 1,65,390 కార్టులను సంస్థ ఇచ్చింది. వేల స్టాండులు, టేబుళ్లు, స్టాల్స్‌ను కూడా ఇచ్చింది.
ప్రజలకు బైబిలు సత్యాలను తెలియజేయడానికి ఇప్పటికీ సాక్షులు ఉపయోగిస్తున్న ముఖ్యమైన పద్ధతి ఇంటింటి పరిచర్యే అయినా లిటరేచర్ కార్టులు మాత్రం చాలా ఉపయోగపడుతున్నాయి. కొన్ని అనుభవాలు పరిశీలించండి:
పెరూలో రామాల్ అనే ఒకాయన ఒక కార్టు దగ్గరున్న సాక్షులను కలిసి ఇలా అన్నాడు, “మీరు ఎక్కడున్నారు? నేను సాక్షుల కోసం మూడు సంవత్సరాలుగా వెతుకున్నాను. మీ కార్టు చూడగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పాను.”
రామాల్ ఉండే ప్రాంతానికి యెహోవాసాక్షులు చాలాసార్లు వెళ్లినా ఆయన వారాంతాల్లో ఎప్పుడూ ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఆయన ఇంతకుముందు యెహోవాసాక్షులతో కలసి బైబిలు అధ్యాయనం చేశాడని, ఇప్పుడు మళ్లీ దాన్ని కొనసాగించాలనుకుంటున్నాడని చెప్పాడు. అప్పుడు దానికోసం ఏర్పాట్లు చేశారు.
బల్గేరియాలో పెట్టిన కార్టు దగ్గరికి ఓ యువ జంట వచ్చి, కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని తీసుకుంది. ఆ తర్వాతి వారం వాళ్లు మళ్లీ వచ్చి, నా బైబిలు కథల పుస్తకం అలాగే గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి అనే మరో రెండు పుస్తకాలు తీసుకున్నారు. అయితే ఆ కార్టు దగ్గరున్న సాక్షులు ఆ జంటకు ఎంతమంది పిల్లలు ఉన్నారని అడిగారు. “మాకింకా పిల్లలు పుట్టలేదు. కానీ పుట్టినప్పుడు మాత్రం వాళ్లకు దేవుని గురించి నేర్పించడానికి ప్రణాళిక వేసుకుంటాం. మాకు కావాల్సిన పుస్తకాలు సరిగ్గా ఇవే” అని వాళ్లు జవాబిచ్చారు.
యుక్రెయిన్‌లో కార్టు పెట్టినప్పుడు మిలటరీ బట్టల్లో ఉన్న ఒకాయన కార్టు పక్కన నిలబడివున్న సాక్షుల దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “అమ్మాయిలు, హార్మెగిద్దోను ఎప్పుడు వస్తాదో చెప్పండి.” ఆ వ్యక్తి ఆమధ్యే జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నప్పుడు హార్మెగిద్దోను త్వరలో వస్తుందని ఆయనకు నమ్మకం కుదిరిందని, మరి దేవుడు ఎందుకు త్వరగా చర్య తీసుకోవట్లేదని ఆయన ఆలోచించేవాడు. అయితే ప్రచారకులు బైబిలు తీసి, దేవుడు మనుషుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడానికి మంచి కారణం ఉందని చెప్తూ ఆయన దుష్టులను త్వరలోనే నాశనం చేస్తాడని వివరించారు. అప్పుడాయన కావలికోట, తేజరిల్లు! పత్రికలతోపాటు ఈజ్ దేర్ ఎ క్రియేటర్ హు కేర్స్ ఎబౌట్ యు? అనే పుస్తకాన్ని కూడా తీసుకున్నాడు.
మాసిడోనియాలో ఒక కార్టు పక్కన నిలబడిన సాక్షులతో ఒక యువకుడు మాట్లాడుతూ ఆయన వాళ్ల పత్రికలు చదువుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం తీసుకుంటానని చెప్పాడు. అంతేకాదు ఆయన ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టడానికి నేరుగా గ్రంథాలయానికి వెళ్తున్నట్లు చెప్పాడు.
రెండు గంటల తర్వాత ఆయన మళ్లీ వచ్చాడు, ఈ లోపు 79 పేజీలు చదివేశాడు. ఆయన ఇలా అన్నాడు, “ఈ పుస్తకం జీవితాలను మారుస్తుంది. నా నమ్మకాలు చాలావరకు తప్పని నాకు అర్థమైంది. ఆ పుస్తకంలో ఉన్న వివరణంతా నమ్మదగినదిగా ఉంది. జీవం గురించి నాకున్న ఆలోచనని అది పూర్తిగా మారుస్తుంది.”