కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 8వ పాఠం

దేవుడు చెడుతనాన్ని, బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

దేవుడు చెడుతనాన్ని, బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

1. చెడుతనం ఎలా మొదలైంది?

దేవుడు మనుషుల్ని పరిపాలించుకోనిచ్చాడు, వాళ్లు తమ సమస్యల్ని పరిష్కరించుకోలేరని రుజువయ్యేవరకు అలా చేశాడు

సాతాను మొదటి అబద్ధం చెప్పిన తర్వాత భూమ్మీద చెడుతనం మొదలైంది. మొదట్లో సాతాను ఒక పరిపూర్ణ దేవదూత. కానీ అతను “సత్యంలో స్థిరంగా నిలబడలేదు.” (యోహాను 8:44) న్యాయంగా దేవునికి మాత్రమే చెందాల్సిన ఆరాధనను తాను పొందాలని సాతాను కోరుకున్నాడు. అతను మొదటి స్త్రీ అయిన హవ్వకు అబద్ధం చెప్పి, దేవుని మాట కాకుండా తన మాట వినేలా ఆమెను ఒప్పించాడు. ఆదాము కూడా ఆమెలాగే దేవుని మాట వినలేదు. ఆదాము తీసుకున్న నిర్ణయం వల్ల బాధలు, మరణం వచ్చాయి.ఆదికాండం 3:1-6, 19 చదవండి.

దేవుని మాట వినొద్దని హవ్వకు చెప్పడం ద్వారా సాతాను నిజానికి దేవుని పరిపాలనా హక్కు మీద తిరుగుబాటు మొదలుపెట్టాడు. మనుషుల్లో ఎక్కువశాతం మంది సాతానుతో చేరి, దేవుని పరిపాలన తమకు వద్దని చూపించారు. అలా సాతాను “ఈ లోక పరిపాలకుడు” అయ్యాడు.యోహాను 14:30; 1 యోహాను 5:19 చదవండి.

2. దేవుని సృష్టిలో లోపం ఉందా?

దేవుని సృష్టి పరిపూర్ణమైనది, అందులో ఏ లోపం లేదు. కాబట్టి ఆయన చేసిన మనుషులు, దేవదూతలు ఆయన ఆజ్ఞల్ని పూర్తిగా పాటించగలరు. (ద్వితీయోపదేశకాండం 32:4, 5) అయితే మంచి చేయాలో, చెడు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయన మనకు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ వల్ల, దేవుని మీద మనకున్న ప్రేమను చూపించే అవకాశం దొరుకుతుంది.యాకోబు 1:13-15; 1 యోహాను 5:3 చదవండి.

3. దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

తన పరిపాలనా హక్కు మీద లేవదీసిన తిరుగుబాటును యెహోవా కొంతకాలం అనుమతించాడు. ఎందుకు? తన సహాయం లేకుండా మనుషులు తమను తాము సరిగ్గా పరిపాలించుకోలేరని నిరూపించడానికి ఆయన అలా చేశాడు. (ప్రసంగి 7:29; 8:9) 6,000 సంవత్సరాల మానవ పరిపాలన ఆ విషయాన్ని రుజువు  చేసింది. వాళ్ల పరిపాలన యుద్ధాల్ని, నేరాల్ని, అన్యాయాల్ని, రోగాల్ని తీసేయలేకపోయింది.యిర్మీయా 10:23; రోమీయులు 9:17 చదవండి.

కానీ, దేవుని పరిపాలన దాన్ని కోరుకునేవాళ్లకు ఎన్నో ప్రయోజనాలు తెస్తుంది. (యెషయా 48:17, 18) యెహోవా త్వరలోనే మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసేస్తాడు. అప్పుడు, దేవుని పరిపాలనను కోరుకునేవాళ్లే భూమ్మీద జీవిస్తారు.—యెషయా 11:9; దానియేలు 2:44 చదవండి.

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు? వీడియో చూడండి.

4. దేవుడు ఇంతకాలం ఓపిక పట్టడం వల్ల మనకు ఏ అవకాశం దొరికింది?

మనుషులు స్వార్థంతోనే యెహోవాను ఆరాధిస్తారని సాతాను నిందించాడు. అది అబద్ధమని మీరు నిరూపించాలనుకుంటున్నారా? మీరు తప్పకుండా నిరూపించగలరు! దేవుడు ఇంతకాలం ఓపిక పట్టడం వల్ల, మనుషుల పరిపాలన కావాలో లేక దేవుని పరిపాలన కావాలో నిర్ణయించుకునే అవకాశం మనందరికీ దొరికింది. మన నిర్ణయం ఏంటో మన జీవన విధానం చూపిస్తుంది.యోబు 1:8-12; సామెతలు 27:11 చదవండి.

5. మనం దేవుని పరిపాలనను కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?

మనం దేవుని పరిపాలనను కోరుకుంటున్నామో లేదో మన నిర్ణయాలు చూపిస్తాయి

సరైన ఆరాధన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకుని, దాన్ని పాటించడం ద్వారా మనం దేవుని పరిపాలనను కోరుకుంటున్నామని చూపించవచ్చు. (యోహాను 4:23) యేసులాగే రాజకీయాల్లో, యుద్ధాల్లో పాల్గొనకుండా ఉండడం ద్వారా మనకు సాతాను పరిపాలన వద్దని చూపించవచ్చు.యోహాను 17:14 చదవండి.

సాతాను తన శక్తిని ఉపయోగించి అనైతికమైన, హానికరమైన పనులు తప్పుకాదు అన్నట్టు చూపిస్తాడు. అలాంటి పనులకు దూరంగా ఉన్నప్పుడు మన స్నేహితుల్లో, బంధువుల్లో కొంతమంది మనల్ని ఎగతాళి చేయవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. (1 పేతురు 4:3, 4) మనం దేవున్ని ప్రేమించే ప్రజలతో సహవసిస్తామా? ఆయనిచ్చే తెలివైన, ప్రేమపూర్వకమైన నియమాలు పాటిస్తామా? అనేది మనమే నిర్ణయించుకోవాలి. అలా పాటిస్తే, కష్టాలు వచ్చినప్పుడు మనుషులు దేవునికి లోబడరని సాతాను వేసిన నింద అబద్ధమని నిరూపిస్తాం.1 కొరింథీయులు 6:9, 10; 15:33 చదవండి.

దేవునికి మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన చెడుతనాన్ని, బాధల్ని తప్పకుండా తీసేస్తాడని నమ్మవచ్చు. అలా నమ్ముతున్నామని చూపించేవాళ్లు భూమ్మీద నిరంతరం సంతోషంగా జీవిస్తారు.యోహాను 3:16 చదవండి.