కంటెంట్‌కు వెళ్లు

దక్షిణ కొరియాలో పిటిషన్‌ రాస్తున్న యెహోవాసాక్షుల కుటుంబం

మార్చి 1, 2018
దక్షిణ కొరియా

మనస్సాక్షి కారణంగా మిలిటరీ సేవను నిరాకరించే విషయంలో రాష్ట్రపతికి పిటిషన్‌ పెట్టుకున్న దక్షిణ కొరియాలోని యెహోవాసాక్షులు

మనస్సాక్షి కారణంగా మిలిటరీ సేవను నిరాకరించే విషయంలో రాష్ట్రపతికి పిటిషన్‌ పెట్టుకున్న దక్షిణ కొరియాలోని యెహోవాసాక్షులు

ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన సంఘటనల వల్ల, ఆ దేశ ప్రభుత్వం ప్రాథమిక మానవ హక్కులను గౌరవించే విషయంలో పెద్ద మార్పులను తీసుకురాబోతుందని చెప్పవచ్చు. 2017, డిసెంబరు 7న దక్షిణ కొరియా రాష్ట్రపతైన జె-ఇన్‌ మూన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) అధికారులతో ఒక మీటింగ్‌ పెట్టారు. మానవ హక్కుల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఆలోచించమని ఆయన చెప్పారు. ముఖ్యంగా, మనస్సాక్షి కారణంగా మిలిటరీలో చేరడానికి నిరాకరించేవాళ్లని జైల్లో వేసే పద్ధతికి ముగింపు పలకడానికి కొన్ని పరిష్కారాల్ని చెప్పమని రాష్ట్రపతి NHRCని అడిగారు.

ఆ మీటింగ్‌ గురించి మీడియాలో చాలా చర్చలు జరిగాయి. మనస్సాక్షి కారణంగా మిలిటరీలో చేరనందుకు జైలు శిక్ష వేసే ప్రభుత్వ పాలసీ వల్ల, యెహోవాసాక్షుల కుటుంబాలు కొన్ని తరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే దక్షిణ కొరియాలో ఉన్న యెహోవాసాక్షులు రాష్ట్రపతికి పంపించే పిటిషన్‌ల మీద సంతకాలను సేకరించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి జె-ఇన్‌ మూన్‌ దేశ ప్రజలు పెట్టుకునే పిటిషన్‌లకు స్పందించమని అధికారులను ఆదేశించారు, కాబట్టి 70 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించమని సాక్షులు పిటిషన్‌లలో రాష్ట్రపతిని విన్నవించుకున్నారు.

దక్షిణ కొరియాలోని యెహోవాసాక్షుల కార్యాలయం పిటిషన్‌లను సమకూర్చింది

ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాలుగు వారాలకే పిటిషన్‌లను తయారు చేసేశారు. మనస్సాక్షి కారణంగా జైల్లో వేయబడిన 14,000 కన్నా ఎక్కువ మంది పురుషులు దానిమీద సంతకాలు చేశారు. వాళ్లే కాదు ఆ శిక్ష వల్ల ఇబ్బందులు పడిన 26,000 కన్నా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు కూడా సంతకం చేశారు.

2018, జనవరి 15న పిటిషన్‌లను రాష్ట్రపతి కార్యాలయంలో ఇచ్చారు

41,275 మంది యెహోవాసాక్షులు పిటిషన్‌ల మీద సంతకాలు పెట్టారు. 2018, జనవరి 15న ఆ యెహోవాసాక్షుల తరఫున ఆరుగురు ప్రతినిధులు వాటిని రాష్ట్రపతి కార్యాలయానికి ఇచ్చారు. ఆ పిటిషన్‌లలో, రాష్ట్రపతి ఈ విషయంపై తీసుకుంటున్న ఆసక్తికి కృతజ్ఞతలు చెప్తూ, 70 ఏళ్లుగా మనస్సాక్షి కారణంగా మిలిటరీ సేవలో చేరనందుకు జైలు శిక్ష విధించడం వల్ల ఎన్ని చెడు ఫలితాలు వస్తున్నాయో వివరించారు. ఒకవేళ సమస్యని పరిష్కరిస్తే ఎన్ని ప్రయోజనాలు వస్తాయో కూడా చెప్పారు. 2018, జనవరి 16న ఆ పిటిషన్‌లను పరిశీలించమని కోరుతూ రాష్ట్రపతి కార్యాలయం వాటిని దేశ రక్షణ మంత్రిత్వ శాఖకు పంపించింది.

పిటిషన్‌లను రాస్తున్నప్పుడే యెహోవాసాక్షుల ప్రతినిధులు NHRC అధికారుల్ని కూడా కలిశారు. యెహోవాసాక్షులు మిలిటరీలో చేరకపోవడానికి గల లేఖనాధార కారణాన్ని వాళ్లకి చూపించారు. ఒకవేళ వేరే పౌరసేవ చేసే అవకాశం ఇస్తే, ఆ యౌవన సాక్షులు జైల్లో ఖాళీగా కూర్చోకుండా ప్రభుత్వానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేయగలుగుతారు. అప్పుడు NHRC అధికారులు మానవ హక్కులకు సంబంధించిన సమస్యల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని పరిష్కరించడమే 2018 లో తమ లక్ష్యమని సాక్షులకు చెప్పారు.

మనస్సాక్షి కారణంగా జైల్లో వేయబడిన వాళ్ల సంఖ్య మిగతా అన్ని దేశాల కన్నా దక్షిణ కొరియాలోనే చాలా ఎక్కువ. ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వం పాటిస్తున్న ఈ పాలసీ గురించి అధికారులు పునరాలోచన చేస్తుండగా, ఒక పరిష్కారాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మిలిటరీ సేవను నిరాకరించిన యౌవన సాక్షులందరూ జైల్లో గడిపిన సంవత్సరాల్ని మొత్తం కలిపి చూస్తే 36,700 కన్నా ఎక్కువే. ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఎదురుచూస్తున్నాం.