కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ విరాళాలను ఎలా ఉపయోగిస్తామంటే ...

‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశాన్ని అనువదించడం

‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశాన్ని అనువదించడం

జూలై 10, 2020

 చరిత్రలో మొట్ట మొదటిసారి 2020 జూలై, ఆగస్టు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదర సహోదరీలు ఒకే ప్రాదేశిక సమావేశాన్ని ఒకే సమయంలో చూస్తారు. దీన్ని సాధ్యం చేయాలంటే, రికార్డ్‌ చేసిన సమావేశ కార్యక్రమాన్ని 500 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించాలి. సమావేశంలో ఆనందించే ప్రసంగాలు, వీడియోల కోసం ప్రణాళిక వేసి, వాటిని రికార్డ్‌ చేసి, అనువదించాలంటే సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువకాలం పడుతుంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా, ‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశాన్ని అనువాదకులు నాలుగు నెలలకన్నా తక్కువ సమయంలో అనువదించాల్సి వచ్చింది.

 యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో ఉన్న అనువాద సేవల విభాగం, గ్లోబల్‌ పర్చేసింగ్‌ విభాగం ఈ భారీ ప్రాజెక్టుకు మద్దతిచ్చాయి. ఈ పనిని పూర్తిచేయడానికి చాలా అనువాద టీమ్‌లకు ఎన్నో పరికరాలు, ముఖ్యంగా ఎంతో నాణ్యమైన మైక్రోఫోన్‌లు అవసరమౌతాయని అనువాద సేవల వాళ్లు గుర్తించారు. గ్లోబల్‌ పర్చేసింగ్‌ వాళ్లు 1,000 మైక్రోఫోన్‌లు కొని, వాటిని దాదాపు 200 ప్రాంతాలకు చేరవేయడానికి ఏర్పాట్లు చేశారు.

 డబ్బు ఆదా చేయడం కోసం పెద్ద మొత్తంలో మైక్రోఫోన్‌లను కొని, వాటిని ఒక చోటికి రప్పించి, తర్వాత అనువాదకులకు పంపించారు. అలా పెద్ద మొత్తంలో కొనడం వల్ల ఒక్కో మైక్రోఫోన్‌ డెలివరీ ఛార్జీలతో కలిపి 12,750 రూపాయలకే (170 యూ.ఎస్‌. డాలర్లు) వచ్చింది. ఒకవేళ వాటిని విడివిడిగా కొనుంటే, చాలా ఖర్చు అయ్యేది.

 గ్లోబల్‌ పర్చేసింగ్‌ విభాగం వాటిని కొని, అనువాద టీమ్‌లకు చేరవేసే పని 2020 ఏప్రిల్‌, మే నెలల్లో చేయాల్సి వచ్చింది. నిజానికి ఆ నెలల్లో కరోనా వల్ల చాలా వ్యాపారాలు అంతగా సాగట్లేదు. అయినాసరే మే నెలాఖరు కల్లా, చాలావరకు రిమోట్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసులకు, బ్రాంచి కార్యాలయాలకు, ఇతర అనువాద ప్రాంతాలకు అవసరమైన పరికరాలు చేరుకున్నాయి.

 గ్లోబల్‌ పర్చేసింగ్‌ని పర్యవేక్షిస్తున్న సహోదరుడు జే స్విన్నే ఇలా అంటున్నాడు: “ఈ పని పూర్తయ్యే వరకూ బెతెల్‌ విభాగాలు, వ్యాపారులు ఒకరికొకరు చక్కగా సహకరించుకున్నారు. ఇంత త్వరగా, ఇంత తక్కువ ఖర్చుతో సహోదర సహోదరీలకు సహాయం చేయగలిగామంటే, అది కేవలం యెహోవా పవిత్రశక్తి వల్లే సాధ్యమైంది.”

 అనువాద విభాగంతో కలిసి పనిచేసే సహోదరుడు నికోలాస్‌ అల్లాడిస్‌ ఇలా అన్నాడు: “ఆ సమయంలో లాక్‌డౌన్‌లో ఉన్న అనువాదకులు ఈ పరికరాల్ని అందుకొని ఎంతో సంతోషించారు. వాళ్లు అనువాద టీమ్‌లోని ఇతరులకు దూరంగా ఉన్నా, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ ప్రసంగాల్ని, డ్రామాల్ని, పాటల్ని 500 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించారు, రికార్డ్‌ చేశారు.”

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరుల కోసం ‘ఎల్లప్పుడూ ఆనందించండి’! అనే 2020 ప్రాదేశిక సమావేశాన్ని సిద్ధంచేయడంలో భాగంగా పూర్తిచేసిన అనేక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి మాత్రమే. మీరు donate.jw.org ద్వారా, ఇంకా ఇతర పద్ధతుల్లో ఉదారంగా ఇచ్చిన విరాళాల వల్లే అవసరమైన ఈ వస్తువుల్ని కొనగలిగాం.