తెలుగు
కమాల్‌ వీర్డీ: “నాకు అందర్నీ సమానంగా చూడాలని అనిపించేది”
https://cms-imgp.jw-cdn.org/img/p/502400119/univ/art/502400119_univ_sqr_xl.jpg
lfs ఆర్టికల్‌ 19

కమాల్‌ వీర్డీ | జీవిత కథ

“నాకు అందర్నీ సమానంగా చూడాలని అనిపించేది”

“నాకు అందర్నీ సమానంగా చూడాలని అనిపించేది”

 1973 ఆగస్టులో నేను, మా ఇద్దరు చెల్లెళ్లు ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌లో జరిగిన “డివైన్‌ విక్టరీ” అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యాం. అక్కడ మేము, 1926 నుండి ఇండియాలో మిషనరీగా సేవ చేస్తున్న బ్రదర్‌ ఎడ్విన్‌ స్కిన్నర్‌ని కలిశాం. మేము పంజాబీ భాష మాట్లాడతామని తెలిసినప్పుడు ఆయన, “మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇండియాకి రండి!” అన్నాడు. మేము అదే చేశాం. అలా పంజాబీ క్షేత్రంలో నా పరిచర్య మొదలైంది. అయితే ఆ సంఘటనకు ముందు ఏం జరిగిందో మీకు చెప్తాను.

 నేను 1951 ఏప్రిల్‌లో, కెన్యాలోని నైరోబిలో పుట్టాను. మా అమ్మానాన్నలు ఇండియా నుండి వచ్చి స్థిరపడిన సిక్కు మతస్థులు. మా నాన్నకు ఇద్దరు భార్యలు, మా అమ్మ మొదటి భార్య. మా నాన్న, చనిపోయిన తన అన్న భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడు, ఈ విషయంలో అమ్మ ఏం చేయలేకపోయింది. వాళ్లిద్దరూ దాదాపు ఒకే సమయంలో పిల్లల్ని కన్నారు. కాబట్టి నేను చాలామంది పిల్లల మధ్య పెరిగాను. చనిపోయిన మా పెదనాన్న కొడుకుతో సహా మేము మొత్తం ఏడుగురు పిల్లలం. 1964లో నాకు కేవలం 13 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు.

సమానత్వం కోసం తపించాను

 పెరిగి పెద్దౌతున్నప్పుడు నేను చాలా గొడవల్ని, పక్షపాతాన్ని చూశాను. మా కుటుంబం పరిస్థితి బైబిల్లోని రాహేలు-లేయాల పరిస్థితిలాగే ఉందని ఆ తర్వాత అనిపించింది. మా ఇంట్లోవాళ్లు కెన్యా పనివాళ్లతో దురుసుగా ప్రవర్తించేవాళ్లు, వాళ్లను తక్కువగా చూడాలని చెప్పేవాళ్లు. అయితే యూరప్‌కి చెందిన పొరుగువాళ్లతో స్నేహం చేయాలని, వాళ్ల నుండి ఏదోకటి నేర్చుకోవచ్చని మా నాన్న చెప్పేవాడు. కానీ ఆఫ్రికా దేశస్థుల దగ్గర నేర్చుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి వాళ్లకు దూరంగా ఉండమని అనేవాడు. అలాగే పాకిస్తాన్‌ వారసత్వానికి చెందినవాళ్లను శత్రువుల్లా చూడాలని, వాళ్లతో కూడా స్నేహం చేయకూడదని చెప్పేవాడు. అయితే నాకు అందర్నీ సమానంగా చూడాలని అనిపించేది, మా నాన్న ఆలోచన తప్పు అనిపించేది.

 సిక్కు మతం అనేది గురునానక్‌ ద్వారా 15వ శతాబ్దం చివర్లో స్థాపించబడింది. ఒకే దేవుడు ఉన్నాడనే బోధతో సహా నానక్‌ బోధలన్నీ నేను స్వీకరించాను. అయితే సిక్కులు ఒకరితో ఒకరు అన్యాయంగా ప్రవర్తించడం చూసినప్పుడు, ఆ మతంలో ఏదైనా సమస్య ఉందేమో అని అనుమానం వచ్చింది.

 అది మాత్రమే నా సమస్య కాదు. సిక్కు మతం కేవలం కొన్ని వందల ఏళ్ల క్రితమే మొదలైంది, ‘మరి దానికన్నా ముందు ఏముండేది? దేవుడు ఒప్పుకున్న మొట్టమొదటి ఆరాధన పద్ధతి ఏంటి?’ అని అనిపించేది. మా ఇంట్లో పదిమంది సిక్కు మతగురువుల ఫొటోలు తగిలించి ఉండేవి. నేను అనుకునేదాన్ని, ‘అసలు వాళ్లు ఎలా ఉండేవాళ్లో మనకెలా తెలుసు? స్వయంగా ఆ గురువులే ఒకేఒక్క సత్యదేవున్ని ఆరాధించమని చెప్పినప్పుడు, మా ఇంట్లోవాళ్లు-ఇతరులు చేసినట్టు వాళ్ల ఫోటోలకు ఎందుకు దండం పెట్టాలి?’

 1965లో నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మేము ఇండియాకు వచ్చాం. మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉండేవికాదు కాబట్టి జీవితం కష్టంగా సాగేది. ఒక సంవత్సరం తర్వాత మేము మెల్లమెల్లగా ఇంగ్లాండ్‌కి వెళ్లిపోవడం మొదలుపెట్టాం. ఇద్దరిద్దరు చొప్పున వెళ్లి లీసెస్టర్‌లో స్థిరపడ్డాం.

 నాకు 16 ఏళ్లు వచ్చినప్పుడు వేర్వేరు పనులు చేస్తూ నైట్‌ స్కూల్‌కి వెళ్తూ ఆగిపోయిన చదువును కొనసాగించాను. నేను పనిచేసే చోట కొందర్ని తక్కువగా చూడడం గమనించాను. ఉదాహరణకు, వలసవచ్చిన వాళ్లతో పోలిస్తే ఇంగ్లీష్‌ పనివాళ్లకు ఎక్కువ జీతం ఇచ్చేవాళ్లు. అందర్నీ సమానంగా చూడాలనే నా కోరిక వల్ల యువ కార్మిక సంఘ కార్యకర్త అయ్యాను. సమాన జీతం ఇచ్చేవరకు పనిచేయం అని ధర్నా చేసేలా వలసవచ్చిన స్త్రీలను ప్రేరేపించాను. నేను సమానత్వాన్ని కోరుకున్నాను.

జవాబు దొరికింది

 1968లో మా ఇంటికి యెహోవాసాక్షులైన ఇద్దరు పురుషులు వచ్చారు, అదే నేను సాక్షుల్ని మొదటిసారి కలవడం. దేవుని రాజ్యం సమానత్వాన్ని తీసుకొస్తుందనే వాగ్దానం నన్ను వెంటనే ఆకట్టుకుంది. ఆ సాక్షుల్లో ఒకతను తన భార్యతో కలిసి మళ్లీ మా ఇంటికి వచ్చాడు. నేను, మా చెల్లి జస్విందర్‌, మా పినతల్లి కూతురు చాని బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాం. కేవలం ఆరు పాఠాలు పూర్తయ్యే సరికి, యెహోవాయే నిజమైన దేవుడని, బైబిలు ఆయన వాక్యమని, దేవుని రాజ్యం మాత్రమే అందరికీ సరైన న్యాయం చేస్తుందని మాకు నమ్మకం కలిగింది.

 అయితే మా ఇంట్లోవాళ్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మా నాన్న చనిపోయాక మా పిన్ని కొడుకు కుటుంబ పెద్ద అయ్యాడు. ఆమె రెచ్చగొట్టడంతో అతను మమ్మల్ని హింసించేవాడు. మా చెల్లెళ్లు జస్విందర్‌ని, చానిని కొట్టేవాడు, బూటుకాళ్లతో తన్నేవాడు. అయితే నాకు 18 ఏళ్లు వచ్చాయి, చట్టం ప్రకారం నాకు హక్కులు ఉంటాయి కాబట్టి నన్ను చెయ్యి చేసుకునేవాడు కాదు. మా చెల్లెళ్లను మాత్రం ఏమైనా చేయొచ్చని అనుకునేవాడు. ఒకసారి అతను బైబిలు తీసుకొని, తెరిచి, పేజీలకు నిప్పు అంటించి, వాళ్ల ముఖాలకు దాన్ని దగ్గరగా పెట్టి, “మీ యెహోవాను ఈ మంట ఆర్పమని చెప్పండి!” అన్నాడు. ఆ సమయానికి మేము రెండుమూడు సార్లే మీటింగ్స్‌కి వెళ్లాం, అది కూడా రహస్యంగా. అయితే మేము ఒకేఒక్క నిజమైన దేవుడైన యెహోవా సేవ చేయాలనుకున్నాం. కానీ మేమున్న పరిస్థితుల్లో అది అసాధ్యం అనిపించింది. కాబట్టి మేము ఇంటినుండి పారిపోయి ఏదైనా సురక్షితమైన చోటుకు వెళ్లాలని ప్లాన్‌ వేయడం మొదలుపెట్టాం. మేము ఏం చేశాం?

 మేము మా లంచ్‌ డబ్బుల్ని, బస్‌ ఛార్జీల్ని, మా పిన్నికి ఇవ్వాల్సిన నా జీతం డబ్బులో కొంతభాగాన్ని రహస్యంగా దాచడం మొదలుపెట్టాం. మేము మూడు సూట్‌కేస్‌లు కొని, వాటిని ఇంట్లో కాకుండా వేరే చోట దాచిపెట్టి మెల్లమెల్లగా అందులో మా బట్టలు నింపాం. 1972 మే నెలలో జస్విందర్‌కి దాదాపు 18 ఏళ్లు, మా దగ్గర 100 పౌండ్లు (260 అమెరికన్‌ డాలర్లు) ఉన్నప్పుడు మేము ఇంగ్లాండ్‌కి నైరుతి వైపున ఉన్న పెన్జాన్స్‌కి వెళ్లడానికి ట్రెయిన్‌ ఎక్కాం. అక్కడికి చేరుకున్నాక, ఒక టెలిఫోన్‌ బూత్‌ నుండి అక్కడి యెహోవాసాక్షులకు కాల్‌ చేశాం. వాళ్లు మమ్మల్ని ఆప్యాయంగా స్వాగతించారు. అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడం కోసం రకరకాల పనులు చేశాం, చేపల్ని శుభ్రం చేసే పనితో సహా.

 హ్యారీ బ్రిగ్జ్‌, బెట్టీ అనే వృద్ధ జంట దగ్గర మేము బైబిలు స్టడీ కొనసాగించాం. 1972 సెప్టెంబరులో ఇంకా రహస్యంగా జీవిస్తున్నప్పుడే, మేము ట్రూరో రాజ్యమందిరం వద్ద ఉన్న ఒక చిన్న పూల్‌లో బాప్తిస్మం తీసుకున్నాం. చాని పయినీరు సేవ మొదలుపెట్టింది, నేనూ జస్విందర్‌ ఆమెకు ఆర్థికంగా మద్దతు ఇచ్చాం.

అవసరం ఎక్కువున్న చోట సేవచేయడం

 హ్యారీ, బెట్టీ 90 ఏళ్లకి దగ్గర్లో ఉన్నా, ప్రీచింగ్‌ చేయడానికి తరచూ స్కిల్లీ దీవులకు వెళ్తుండేవాళ్లు. అది ఇంగ్లాండ్‌ నైరుతి తీరానికి దగ్గర్లో ఉంటుంది. వాళ్లను చూసినప్పుడు మాకు కూడా అలాంటిది ఏదైనా చేయాలని అనిపించేది. కాబట్టి పరిచయ మాటల్లో చెప్పినట్టు, 1973లో బ్రదర్‌ స్కిన్నర్‌తో మాట్లాడిన తర్వాత ఏంచేయాలో మాకు అర్థమైంది.

 1974 జనవరిలో మేము ఇండియాలోని న్యూ ఢిల్లీకి వెళ్లడానికి టిక్కెట్లు తీసుకున్నాం. అక్కడ బ్రదర్‌ డిక్‌ కాటరిల్‌ మమ్మల్ని ఒక మిషనరీ హోమ్‌లో అతిథులుగా ఉండనిచ్చాడు. చాని క్రమ పయినీరు సేవ చేసేది, నేనూ జస్విందర్‌ ముందుకన్నా చాలా ఎక్కువ సమయం పరిచర్యలో గడిపేవాళ్లం.

 మెల్లమెల్లగా మా అడుగులు ఇండియాలో వాయవ్య దిశలో ఉన్న పంజాబ్‌ వైపు సాగాయి. అక్కడ కొంతకాలం చండీగఢ్‌ నగరంలోని మిషనరీ హోమ్‌లో, తర్వాత ఒక అద్దె అపార్ట్‌మెంట్లో ఉన్నాం. 1974 సెప్టెంబరులో నేను క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాను, 1975లో నన్ను ప్రత్యేక పయినీరుగా నియమించారు. ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు, పంజాబీ భాషలో ఇంకా చాలా ప్రచురణల అవసరం ఉందని అర్థంచేసుకున్నాను. అప్పుడే యెహోవా ప్రేమ, న్యాయం గురించి ఎక్కువమంది తెలుసుకోగలుగుతారు. 1976లో ఇండియా బ్రాంచి పంజాబీ భాషలోకి మన ప్రచురణల్ని అనువదించడంలో సహాయం చేయమని మా ముగ్గుర్ని ఆహ్వానించింది. అప్పట్లో టైప్‌రైటర్లు, కంప్యూటర్లు ఉండేవి కాదు కాబట్టి చాలా కష్టపడాల్సి వచ్చేది. మేము అనువదించిన సమాచారాన్ని చేత్తో రాసి అనువాద దోషాల్ని, వ్యాకరణ దోషాల్ని స్వయంగా కనిపెట్టాల్సి వచ్చేది. తర్వాత పాతకాలపు యంత్రాలతో తయారైన స్థానిక ప్రింటర్‌తో ముద్రించడానికి ఒక్కో అక్షరాన్ని చేత్తో పేరుస్తూ సమాచారాన్ని టైప్‌సెట్‌ చేసేవాళ్లం.

ఇండియాలో పంజాబ్‌ రాష్ట్రంలో ఉన్న చండీగఢ్‌లో మా సంఘం

ఆరోగ్యం బాలేకపోయినా సంతోషంగా ఉన్నాను

 మా పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి. జస్విందర్‌ ఒక బ్రదర్‌ని కలిసింది, తర్వాత వాళ్లిద్దరు పెళ్లిచేసుకొని కెనడాలో సెటిల్‌ అయ్యారు. చాని అమెరికా నుండి సందర్శించడానికి వచ్చిన ఒక జర్మన్‌ బ్రదర్‌ని పెళ్లిచేసుకొని అక్కడికి వెళ్లిపోయింది. నా ఆరోగ్యం బాగా క్షీణించడంతో నేను 1976 అక్టోబరులో ఇంగ్లాండ్‌కి తిరిగివెళ్లిపోయాను. లీసెస్టర్‌లో ఉంటున్న, సత్యాన్ని వ్యతిరేకించని మా అమ్మ, తమ్ముడు దయతో నన్ను వాళ్లతోపాటు ఉండనిచ్చారు. నాకు ఎవాన్స్‌ సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధి ఉందని పరీక్షల్లో తేలింది. దీనిలో, రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని రక్త కణాలపై దాడి చేస్తుంది. దానికి చాలారకాల చికిత్సలు తీసుకున్నాను, అలాగే నా ప్లీహము (Spleen) తొలగించారు. దానివల్ల నేను పయినీరు సేవ ఆపేయాల్సి వచ్చింది.

 నా ఆరోగ్యం తగినంతగా బాగైతే పూర్తికాల సేవ మళ్లీ మొదలుపెడతానని యెహోవాకు చాలా ప్రార్థించాను. అలాగే మొదలుపెట్టాను కూడా! నా అనారోగ్యం అప్పుడప్పుడూ తిరగబెట్టినా సరే, 1978లో వొల్వర్‌ హాంప్టన్‌కి తరలివెళ్లి పంజాబీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతంలో పయినీరు సేవ చేశాను. కొత్తవాళ్లను మీటింగ్స్‌కి పిలవడానికి, చేతితో రాసిన ఆహ్వానపత్రాలు తయారుచేసి స్థానిక షాప్‌లలో కాపీలు తీయించాం. తర్వాత వాటిని పంజాబీ మాట్లాడే ప్రజలకు ఇచ్చి, బహిరంగ ప్రసంగానికి ఆహ్వానించాం. ఇప్పుడు బ్రిటన్‌లో ఐదు పంజాబీ సంఘాలు, మూడు గ్రూపులు ఉన్నాయి.

 నేను ఇండియా బ్రాంచిలో, పంజాబీ భాషలోకి అనువదించే పని చేశానని బ్రిటన్‌ బ్రాంచి వాళ్లకు తెలుసు. దాంతో 1980ల చివర్లో వాళ్లు నన్ను సంప్రదించారు. నేను లండన్‌ బ్రాంచికి కమ్యూటింగ్‌ చేస్తూ ఫాంట్లు, సాఫ్ట్‌వేర్‌ తయారుచేయడంలో, గురుముఖి లిపి కోసం ప్రచురణ ప్రమాణాలు రూపొందించడంలో సహాయం చేశాను. ఒకవైపు జీవనోపాధి కోసం కష్టపడుతూ, కాస్త దూరంలో ఉంటున్న మా అమ్మను చూసుకుంటూ, బెతెల్‌కి కమ్యూటింగ్‌ చేస్తూ చాలా బిజీగా ఉండేదాన్ని, అలసిపోయేదాన్ని. కానీ బెతెల్‌లో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉండేది.

1980ల చివర్లో లండన్‌ బెతెల్‌లో ట్రెయినింగ్‌ తీసుకోవడం

 1991 సెప్టెంబరులో, బెతెల్‌ కుటుంబ సభ్యురాలు అవ్వమని నాకు ఆహ్వానం వచ్చింది. బైబిలు ప్రచురణల్ని పంజాబీ భాషలోకి అనువదించడంలో నేను సహాయం చేయాలి. అది నేను అస్సలు ఊహించలేదు. నాకు అర్హత లేదని అనిపించింది, నా ఆరోగ్యం బాలేదు, పైగా కొత్త బెతెల్‌ సభ్యులకు ఉండాల్సిన వయసు కూడా దాటిపోయింది. అయినాసరే యెహోవా నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. బెతెల్‌లో సంతోషంగా సేవ చేస్తున్నా సరే, నా ఆరోగ్య పరిస్థితి మాత్రం అలాగే ఉంది. కీమోథెరపీ అలాగే ఇతర చికిత్సలు తీసుకుంటున్నప్పుడు చాలాసార్లు రక్తం సరిపోని పరిస్థితి ఏర్పడింది. నేను కోలుకోవడం చూసి మా హెమటాలజిస్టులు ఎంతగా సంతోషించారంటే, ఒకసారి లండన్‌లోని ఒక పెద్ద హాస్పిటల్‌లో దాదాపు 40 మంది వైద్య నిపుణులు హాజరైన సెమినార్‌కి నన్ను ఆహ్వానించారు. నేను రక్తం ఎక్కించుకోకూడదు అనే నా నిర్ణయం గురించి 10 నిమిషాల పాటు మాట్లాడాను, తర్వాత ఆసుపత్రి సమాచార విభాగానికి చెందిన ఒక సహోదరునితో ప్రశ్నాజవాబుల చర్చ నిర్వహించారు.

 ఆ కష్ట సమయాల్లో నా చెల్లెళ్లు జస్విందర్‌, చాని ప్రేమతో నాకు అండగా నిలబడ్డారు. అలాగే బెతెల్‌ కుటుంబం, ఇతర స్నేహితులు ఇచ్చిన మద్దతుకు చూపించిన ప్రేమకు చాలా కృతజ్ఞురాలిని. నా కష్టాలన్నిటిలో యెహోవా నాకు శక్తినిచ్చి నా నియామకంలో కొనసాగేలా సహాయం చేశాడు.—కీర్తన 73:26.

యెహోవా ఆశీర్వాదమే ధనవంతుల్ని చేస్తుంది

 బెతెల్‌లో గడిపిన ఈ 33 ఏళ్లలో నేను “యెహోవా మంచివాడని రుచిచూసి” తెలుసుకోగలిగాను. (కీర్తన 34:8; సామెతలు 10:22) నమ్మకంగా సేవచేస్తున్న వృద్ధుల్ని చూసి ఎంతో ప్రోత్సాహం పొందుతుంటాను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను బైబిలు స్టడీ ఇచ్చిన చాలామంది పంజాబీ విద్యార్థులు నమ్మకంగా యెహోవా సేవచేయడం చూసి ఎంతో సంతోషించాను. నా కుటుంబ సభ్యులతో నాకు మంచి అనుబంధం ఉంది. మా అమ్మ, తమ్ముడు యెహోవాసాక్షులు కాదు. కానీ అమ్మ నాతో తరచూ ఇలా అంటుంది: “నువ్వు నిజంగా దేవునికి అంకితమైపోయావు.” వయసు పైబడిన అమ్మను చూసుకోవడానికి బెతెల్‌ నుండి వచ్చేస్తానని చెప్పినప్పుడు మా తమ్ముడు, “నువ్వు మంచి పని చేస్తున్నావు. అక్కడే ఉండు” అన్నాడు. మా అమ్మ బెతెల్‌కి దూరంగా ఉన్న ఒక నర్సింగ్‌ హోమ్‌లో ఉంటున్నా, ఆమెను చూడడానికి వీలైనంత తరచుగా వెళ్తుంటాను.

 నా జీవితంలో ఎప్పుడు పెద్ద కష్టం వచ్చినా, మనసులో ఇలా అనుకుంటాను: ‘భయపడకు కమాల్‌. యెహోవా నీకు డాలుగా ఉంటాడు. నీ ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది.’ (ఆదికాండం 15:1) నేను చిన్నగా ఉన్నప్పుడే నన్ను గమనించి, నా జీవితమంతా చేయడానికి అర్థవంతమైన పనిని ఇచ్చిన “న్యాయవంతుడైన దేవుడు” యెహోవాకు కృతజ్ఞతలు. (యెషయా 30:18) ఎవ్వరూ ‘“నాకు ఒంట్లో బాలేదు” అని అనని’ రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను.—యెషయా 33:24.

చెమ్స్‌ఫోర్డ్‌ బెతెల్‌ దగ్గర