కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈజిప్టులోని ఓ ప్రాచీన గోడ బైబిల్లోని ఒక వృత్తాంతం నిజమని రుజువుచేస్తోంది

ఈజిప్టులోని ఓ ప్రాచీన గోడ బైబిల్లోని ఒక వృత్తాంతం నిజమని రుజువుచేస్తోంది

 ఎనిమిది మీటర్ల (26 అడుగుల) పొడవున్న ఈ గోడ, కార్నక్‌లో ఐగుప్తీయుల దేవుడైన ఆమూన్‌ కోసం కట్టిన ప్రాచీన ఆలయం ప్రవేశ ద్వారం దగ్గర ఉంది. ఫరో షీషకు ఈజిప్టు దేశానికి ఈశాన్యంలో ఉన్న దేశాల్ని జయించడం గురించిన వివరాలు ఈ గోడ మీద చెక్కి ఉన్నాయని విద్యావేత్తలు అంటారు. ఆయన జయించిన దేశాల్లో యూదా, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు కూడా ఉన్నాయి.

కార్నక్‌ గోడ; బంధించబడిన ఖైదీల చిత్రం

 ఆ గోడ మీద, ఆమూన్‌ దేవుడు 150 మంది ఖైదీలను షీషకుకు లేదా షెషోంకుకు a సమర్పిస్తున్నట్టు ఉంది. ఒక్కో ఖైదీ బొమ్మ ఆయన జయించిన ఒక్కో నగరానికి లేదా జనానికి సూచనగా ఉంది. ప్రతీ ఖైదీ బొమ్మ మీద, కోడిగుడ్డు ఆకారంలో ఆ నగరాల పేర్లు చెక్కి ఉన్నాయి. వాటిలో చాలా పేర్లు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. ఆ పేర్లలో కొన్ని బైబిలు చదివేవాళ్లకు బాగా తెలుసు. ఉదాహరణకు, బేత్షెయాను, గిబియోను, మెగిద్దో, షూనేము.

 యూదా దేశంపై ఈజిప్టు చేసిన యుద్ధం గురించి బైబిల్లో ఉంది. (1 రాజులు 14:25, 26) షీషకు చేసిన దాడి గురించి బైబిల్లో ఖచ్చితమైన వివరాలు ఉన్నాయి. బైబిల్లో ఇలా ఉంది: “రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువది వేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను. అతనితో కూడ ఐగుప్తునుండి వచ్చిన ... వారు లెక్కకు మించియుండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా.”—2 దినవృత్తాంతాలు 12:2-4.

 షీషకు ఇశ్రాయేలు ప్రాంతాలపై దాడిచేశాడని చెప్పడానికి కార్నక్‌లో ఉన్న ఈ గోడ ఒక్కటే ఆధారం కాదు. బైబిలు కాలాల్లో మెగిద్దో అని పిలవబడిన ప్రాంతంలో స్మారక స్తంభపు రాతి ముక్క ఒకటి దొరికింది. దాని మీద కూడా “షెషోంక్‌” అనే పేరు ఉంది.

 యూదా దేశంపై షీషకు చేసిన దాడి గురించిన ఖచ్చితమైన వివరాలు బైబిలు రచయితల నిజాయితీని తెలియజేస్తున్నాయి. వాళ్లు తమ దేశం సాధించిన విజయాల గురించే కాదు ఓటముల గురించి కూడా ఉన్నదున్నట్టు రాశారు. ప్రాచీన కాలంలో జీవించిన ఇతర రచయితల్లో ఇలాంటి నిజాయితీ కనిపించదు.

a హీబ్రూ భాషలో ఈ పేరును “షీషకు” అని పలుకుతారు.