మూడో యోహాను 1:1-14
1 ప్రియమైన గాయియుకు వృద్ధుడు* రాస్తున్న ఉత్తరం. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను.
2 ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఉన్నట్టే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
3 నీలో ఉన్న సత్యం గురించి సహోదరులు వచ్చి చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను. నువ్వు సత్యంలో నడుస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది.+
4 నా పిల్లలు సత్యంలో నడుస్తున్నారని+ వినడం కన్నా నాకు సంతోషకరమైన విషయం* ఇంకొకటి లేదు.
5 ప్రియ సహోదరుడా, నీకు సహోదరులు పరిచయం లేకపోయినా, నువ్వు వాళ్లకోసం చేసేవన్నీ నమ్మకంగా చేస్తున్నావు.+
6 నీ ప్రేమ గురించి వాళ్లు సంఘం ముందు సాక్ష్యం ఇచ్చారు. దయచేసి దేవుడు ఇష్టపడే విధంగా వాళ్లను సాగనంపు.+
7 ఎందుకంటే, వాళ్లు అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోకుండా+ దేవుని పేరున బయల్దేరారు.
8 అలాంటివాళ్లకు అతిథిమర్యాదలు చేయాల్సిన బాధ్యత మనమీద ఉంది.+ అలా చేసినప్పుడు, సత్యాన్ని వ్యాప్తిచేసే విషయంలో మనం వాళ్ల తోటి పనివాళ్లం అవుతాం.+
9 నేను సంఘానికి ఒక విషయం రాశాను. కానీ వాళ్లలో ప్రముఖుడిగా ఉండాలని కోరుకునే దియొత్రెఫే+ మేము చెప్పే ఏ మాటనూ లెక్కచేయట్లేదు.+
10 అందుకే, నేను అక్కడికి వస్తే అతని పనుల్ని జ్ఞాపకం చేస్తాను. అతను మా గురించి చెడు ప్రచారం చేస్తున్నాడు.+ అది చాలదన్నట్టు అతను సహోదరుల్ని+ గౌరవంతో స్వీకరించట్లేదు; పైగా వాళ్లను స్వీకరించాలని అనుకునేవాళ్లను అడ్డుకోవడానికి, వాళ్లను సంఘం నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
11 ప్రియ సహోదరుడా, చెడ్డవాళ్లను కాదుగానీ మంచివాళ్లను ఆదర్శంగా తీసుకో.+ మంచి చేసేవాళ్లు దేవునివైపు ఉన్నారు.+ చెడు చేసేవాళ్లు దేవుణ్ణి చూడలేదు.+
12 దేమేత్రి గురించి సహోదరులందరూ మంచిగా చెప్పారు, సత్యానికి తగ్గట్టు అతను జీవిస్తున్న విధానం కూడా దాన్ని రుజువుచేస్తోంది. నిజానికి, మేము కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాం. మేము ఇచ్చే సాక్ష్యం నిజమని నీకు తెలుసు.
13 నీకు రాయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇలా సిరాతో, కలంతో రాయాలనుకోవట్లేదు.
14 త్వరలో నిన్ను కలుస్తానని అనుకుంటున్నాను, అప్పుడు మనం ముఖాముఖిగా మాట్లాడుకుందాం.
నీకు శాంతి కలగాలి.
మన స్నేహితులు నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు. అక్కడ ఉన్న మన స్నేహితులకు పేరుపేరున నా శుభాకాంక్షలు చెప్పు.