సమూయేలు రెండో గ్రంథం 7:1-29

  • దావీదు ఆలయాన్ని కట్టడు (1-7)

  • రాజ్యం గురించి దావీదుతో ఒప్పందం (8-17)

  • దావీదు కృతజ్ఞతా ప్రార్థన (18-29)

7  రాజు తన రాజభవనంలో స్థిరపడి,+ చుట్టుపక్కల శత్రువులందరి నుండి యెహోవా అతనికి విశ్రాంతి ఇచ్చాక,  రాజు నాతాను+ ప్రవక్తతో ఇలా అన్నాడు: “నేను ఇక్కడ దేవదారు మ్రానులతో+ చేసిన ఇంట్లో నివసిస్తుంటే సత్యదేవుని మందసమేమో డేరాలో ఉంది.”+  దానికి నాతాను, “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నువ్వు వెళ్లి నీ మనసులో ఏముంటే అది చేయి” అని దావీదు రాజుతో అన్నాడు.+  ఆ రాత్రే యెహోవా వాక్యం నాతాను దగ్గ​రికి వచ్చి ఇలా చెప్పింది:  “నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నివసించడానికి నా కోసం ఒక మందిరం కడతావా?+  ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు* నుండి బయటికి తీసుకొచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నేను ఒక మందిరంలో నివసించలేదు;+ నేను ఒక డేరాలో, ఒక గుడారంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను.+  నేను ఇశ్రాయేలీయులందరితో* ప్రయాణించిన కాలమంతటిలో, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కాయడానికి నేను నియమించిన ఇశ్రాయేలు గోత్ర పెద్దల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, ‘మీరు నా కోసం దేవదారు మ్రానులతో మందిరం ఎందుకు కట్టలేదు?’ అని ఒక్కమాటైనా అన్నానా?” ’  ఇప్పుడు నా సేవకుడైన దావీదుకు ఇలా చెప్పు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను గొర్రెల్ని కాసే నిన్ను+ పచ్చికబయళ్లలో నుండి తీసు​కొచ్చి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద ​నాయకుణ్ణి చేశాను.+  నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీకు తోడు ఉంటాను,+ నీ ఎదుట నుండి నీ శత్రువులందర్నీ నాశనం చేస్తాను;+ నేను నీ పేరును గొప్ప చేస్తాను,+ నువ్వు భూమ్మీదున్న గొప్పవాళ్లలో ఒకడివి అవుతావు. 10  నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలం నియమించి వాళ్లు అందులో స్థిరపడేలా చేస్తాను, వాళ్లు ఏ ఇబ్బందీ లేకుండా అక్కడ నివసిస్తారు; గతంలో జరిగినట్టుగా దుష్టులు ఇక వాళ్లను అణచివేయరు.+ 11  నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతుల్ని నియమించిన+ రోజు నుండి దుష్టులు వాళ్లను అణచివేస్తూ వచ్చారు. నేను నీ శత్రువులందరి నుండి నీకు విశ్రాంతినిస్తాను.+ “ ‘ “అంతేకాదు, యెహోవా నీ కోసం ఒక రాజవంశాన్ని కడతాడని యెహోవా నీకు చెప్పాడు.+ 12  నీ రోజులు ముగిసిపోయి నువ్వు చనిపోయాక,* నీ సంతానాన్ని,* అంటే నీ సొంత కుమారుణ్ణి రాజును చేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.+ 13  అతనే నా పేరు కోసం ఒక మందిరం కడతాడు,+ నేను అతని రాజ్య సింహాసనాన్ని ఎప్పటికీ స్థిరపరుస్తాను.+ 14  నేను అతనికి తండ్రిని అవుతాను, అతను నాకు కుమారుడు అవుతాడు.+ అతను తప్పు చేస్తే నేను అతన్ని సరిదిద్దుతాను,* మనుషులు చేసినట్టు నేను అతన్ని దెబ్బలతో శిక్షిస్తాను.+ 15  నీ ఎదుట నుండి నేను తొలగించిన సౌలు నుండి దూరం చేసినట్టు, అతని నుండి నా విశ్వసనీయ ప్రేమను దూరం చేయను.+ 16  నీ రాజవంశం, నీ రాజ్యం నీ ఎదుట ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయి; నీ సింహాసనం ఎల్లప్పుడూ స్థిరపర్చబడుతుంది.” ’ ”+ 17  నాతాను ఆ మాటలన్నిటినీ, ఆ దర్శనమంతటినీ దావీదుకు చెప్పాడు. 18  అప్పుడు దావీదు రాజు వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలా అన్నాడు: “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వు నా కోసం ఇంత చేయడానికి నేను ఎంతటివాణ్ణి? నా కుటుంబం ఎంతటిది? 19  సర్వోన్నత ప్రభువైన యెహోవా, అది చాలదన్నట్టు, నీ సేవకుని రాజవంశం సుదూర భవిష్యత్తు వరకు నిలుస్తుందని కూడా చెప్పావు; సర్వోన్నత ప్రభువైన యెహోవా, మనుషులందరికీ ఇది ఒక ఉపదేశం.* 20  సర్వోన్నత ప్రభువైన యెహోవా, నీ సేవకుడైన దావీదు నీతో ఇంకేమి అనగలడు? నేను నీకు బాగా తెలుసు.+ 21  నీ మాటను బట్టి, నీ ఇష్టప్రకారం* నువ్వు ఈ గొప్ప పనులన్నిటినీ చేసి వాటిని నీ సేవకునికి తెలియజేశావు.+ 22  అందుకే, సర్వోన్నత ప్రభువైన యెహోవా నువ్వు నిజంగా గొప్పవాడివి.+ నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+ నువ్వు తప్ప వేరే దేవుడు లేడు; మా చెవులతో విన్నవన్నీ ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. 23  నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లా భూమ్మీద ఇంకే ప్రజలు ఉన్నారు? దేవా, నువ్వు వెళ్లి వాళ్లను విడిపించి, నీ ప్రజలుగా చేసుకున్నావు.+ నువ్వు వాళ్ల కోసం ఎంతో ఆశ్చర్యకరమైన గొప్ప పనులు చేసి, నీ కోసం ఒక పేరు సంపాదించుకున్నావు.+ ఐగుప్తు నుండి నీ దగ్గరికి విడిపించుకున్న నీ ప్రజల కోసం నువ్వు దేశాల్ని, వాళ్ల దేవుళ్లను వెళ్లగొట్టావు. 24  నువ్వు ఇశ్రాయేలీయుల్ని శాశ్వతంగా నీ ​ప్రజలుగా చేసుకున్నావు;+ యెహోవా, నువ్వు వాళ్లకు దేవుడివి అయ్యావు. 25  “ఇప్పుడు యెహోవా దేవా, నీ ​సేవకుని విషయంలో, అతని రాజవంశం విషయంలో నువ్వు చేసిన వాగ్దానాన్ని శాశ్వతకాలం నెరవేర్చు, నువ్వు మాటిచ్చినట్టే చేయి.+ 26  ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడు’ అని ప్రజలు అనేలా నీ పేరు ​ఎప్పటికీ హెచ్చించబడాలి.+ నీ సేవకుడైన దావీదు రాజవంశం నీ ఎదుట స్థిరపర్చబడాలి.+ 27  సైన్యాలకు అధిపతైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, ‘నీ కోసం నేను ఒక రాజవంశాన్ని కడతాను’ అని నువ్వే నీ సేవకునికి తెలియజేశావు. అందుకే నీ సేవకుడు నీకు ఇలా ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. 28  సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వే ​సత్యదేవుడివి. నీ మాటలు సత్యం,+ నువ్వు ఈ మంచి విషయాల్ని నీ సేవకునికి వాగ్దానం చేశావు. 29  కాబట్టి నీ సేవకుని రాజవంశం ఎప్పటికీ నీ ఎదుట ఉండేలా నువ్వు దాన్ని దీవిస్తూ ఉండాలి;+ ఎందుకంటే, సర్వోన్నత ​ప్రభువైన యెహోవా, వాగ్దానం చేసింది నువ్వే. నీ ​దీవెనతో నీ సేవకుని రాజవంశం ఎప్పటికీ ​దీవించబడాలి.”+

అధస్సూచీలు

లేదా “ఈజిప్టు.”
అక్ష., “ఇశ్రాయేలు కుమారులందరితో.”
అక్ష., “నీ పూర్వీకులతో నిద్రించాక.”
అక్ష., “విత్తనాన్ని.”
అక్ష., “మనుషుల కర్రతో నేను అతన్ని గద్దిస్తాను.”
లేదా “నియమం.”
లేదా “నీ హృదయానికి అంగీకారమైన విధంగా.”