సమూయేలు రెండో గ్రంథం 2:1-32

  • దావీదు యూదా మీద రాజవ్వడం (1-7)

  • ఇష్బోషెతు ఇశ్రాయేలు మీద రాజవ్వడం (8-11)

  • దావీదు ఇంటికీ, సౌలు ఇంటికీ యుద్ధం (12-32)

2  తర్వాత దావీదు, “నేను యూదా నగరాల్లో ఒకదానికి వెళ్లనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు.+ యెహోవా, “వెళ్లు” అని చెప్పాడు. అప్పుడు దావీదు, “ఏ నగరానికి వెళ్లాలి?” అని అడిగాడు. దానికి ఆయన, “హెబ్రోనుకు వెళ్లు”+ అని జవాబిచ్చాడు.  దాంతో దావీదు తన ఇద్దరు భార్యల్ని, అంటే యెజ్రెయేలుకు చెందిన అహీనోయమును, చనిపోయిన కర్మెలువాసి అయిన నాబాలు భార్య అబీగయీలును+ తీసుకొని అక్కడికి వెళ్లాడు.  దావీదు తనతోపాటు ఉన్న మనుషుల్ని+ వాళ్ల కుటుంబాలతో సహా అక్కడికి తీసుకెళ్లాడు. వాళ్లు హెబ్రోను చుట్టుపక్కల నగరాల్లో స్థిరపడ్డారు.  తర్వాత యూదావాళ్లు వచ్చి అక్కడ దావీదును యూదా వంశస్థుల మీద రాజుగా అభిషేకించారు.+ వాళ్లు దావీదుతో, “యాబేష్గిలాదు వాళ్లే సౌలును పాతిపెట్టారు” అని చెప్పారు.  అప్పుడు దావీదు యాబేష్గిలాదు వాళ్ల దగ్గరికి సందేశకుల ద్వారా ఈ కబురు పంపించాడు: “మీ ప్రభువైన సౌలును పాతిపెట్టి అతని​మీద మీరు విశ్వసనీయ ప్రేమ చూపించారు కాబట్టి యెహోవా మిమ్మల్ని దీవించాలి.+  యెహోవా మీ మీద విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం చూపించాలి. మీరు ఇలా చేసినందుకు నేను కూడా మీ మీద దయ చూపిస్తాను.+  ఇప్పుడు మీ చేతుల్ని బలపర్చుకుని, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే, మీ ప్రభువైన సౌలు చనిపోయాడు, యూదా వంశస్థులు నన్ను వాళ్లమీద రాజుగా అభిషేకించారు.”  కానీ నేరు కుమారుడూ సౌలు సైన్యాధిపతీ అయిన అబ్నేరు,+ సౌలు కుమారుడైన ఇష్బోషెతును+ మహనయీముకు+ తీసుకొచ్చి  గిలాదు+ మీద, ఆషేరీయుల మీద, యెజ్రెయేలు+ మీద, ఎఫ్రాయిము+ మీద, ​బెన్యామీను మీద, ఇశ్రాయేలు అంతటి మీద రాజును చేశాడు. 10  సౌలు కుమారుడైన ఇష్బోషెతు ఇశ్రాయేలు మీద రాజైనప్పుడు ​అతనికి 40 ఏళ్లు. అతను రెండు సంవత్సరాలు పరిపాలించాడు. కానీ యూదా వంశస్థులు మాత్రం దావీ​దుకు ​మద్దతిచ్చారు. 11  దావీదు హెబ్రోనులో యూదా వంశస్థుల మీద రాజుగా ఉన్న కాలం ఏడున్నర సంవత్సరాలు. 12  కొంతకాలానికి, నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్బోషెతు సేవకులు మహనయీము నుండి గిబియోనుకు+ వచ్చారు. 13  సెరూయా కుమారుడైన+ యోవాబు,+ దావీదు సేవకులు కూడా బయల్దేరి, గిబియోను కోనేరు దగ్గర వాళ్లను కలుసుకున్నారు; ఒక గుంపు కోనేరుకు ఇటువైపు కూర్చుంటే, ఇంకో గుంపు కోనేరుకు అటువైపు కూర్చుంది. 14  చివరికి అబ్నేరు యోవాబుతో, “యువకుల్ని లేచి మన ముందు పోరాడమందాం” అన్నాడు. దానికి యోవాబు, “సరే కానివ్వు” అన్నాడు. 15  దాంతో వాళ్లు, పోరాడడం కోసం సౌలు కుమారుడైన ఇష్బోషెతు గుంపు నుండి 12 మంది బెన్యామీనీయుల్ని, దావీదు సేవకుల్లో నుండి 12 మందిని ఎంచుకున్నారు. 16  వాళ్లలో ప్రతీ ఒక్కరు ఎదుటి వ్యక్తి తలను పట్టుకొని కత్తితో డొక్కలో పొడి​చారు, అలా వాళ్లందరూ ఒకేసారి చనిపోయారు. కాబట్టి గిబియోనులోని ఆ స్థలానికి హెల్కత్‌-హస్సూరీము అనే పేరు వచ్చింది. 17  ఆ రోజు ఘోరంగా యుద్ధం జరిగింది; చివరికి అబ్నేరు, అతని మనుషులు దావీదు సేవకుల ముందు ఓడిపోయారు. 18  సెరూయా ముగ్గురు కుమారులైన+ యోవాబు,+ అబీషై,+ అశాహేలు+ కూడా అక్కడ ఉన్నారు; అశాహేలు కొండజింక అంత వేగంగా పరుగెత్తగలడు. 19  అశాహేలు అబ్నేరును తరమడం మొదలుపెట్టాడు. అతను కుడివైపుకు గానీ ఎడమ​వైపుకు గానీ తిరగకుండా అబ్నేరును తరుముతూ ఉన్నాడు. 20  అబ్నేరు వెనక్కి తిరిగి చూసి, “అశాహేలూ, నువ్వేనా?” అని అడిగాడు. దానికి అతను, “అవును, నేనే” అన్నాడు. 21  అప్పుడు అబ్నేరు, “నువ్వు నీ కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరిగి యువకుల్లో ఒకర్ని పట్టుకో, అతని దగ్గర ఉన్నవి దోచుకో” అని అతనితో అన్నాడు. కానీ అశాహేలు అతన్ని తరమడం ఆపలేదు. 22  దాంతో అబ్నేరు అశాహేలుతో మళ్లీ ఇలా అన్నాడు: “నన్ను తరమడం ఆపు. లేకపోతే, నేను నిన్ను చంపుతాను. అప్పుడు నేను నీ సహోదరుడైన యోవాబు ముఖాన్ని ఎలా చూడగలను?” 23  కానీ అశాహేలు అబ్నేరును తరమడం ఎంతకీ ఆపలేదు. అప్పుడు అబ్నేరు ఈటె వెనక భాగంతో అశా​హేలు పొత్తికడుపులో పొడిచాడు,+ దాంతో ఈటె అతని వెనక భాగం నుండి బయటికి వచ్చింది; అశా​హేలు ​అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. అశాహేలు కుప్పకూలి చనిపోయిన చోటికి వచ్చిన ప్రతీ ఒక్కరు అక్కడ కాసేపు ఆగారు. 24  తర్వాత యోవాబు, అబీషై అబ్నేరును తరమడం మొదలుపెట్టారు. సూర్యుడు అస్తమిస్తుండగా వాళ్లు అమ్మా అనే కొండ దగ్గరికి వచ్చారు, అది గిబియోను ఎడారికి* వెళ్లే దారిలో గీహకు ఎదురుగా ఉంది. 25  అక్కడ బెన్యా​మీనీయులు అబ్నేరు వెనక సమకూడి ఒక గుంపుగా ఏర్పడ్డారు. వాళ్లు ఒకానొక కొండ శిఖరం మీద నిలబడ్డారు. 26  అప్పుడు అబ్నేరు యోవాబుతో బిగ్గరగా ఇలా అన్నాడు: “మన కత్తుల రక్తదాహం ఎప్పటికీ తీరదా? దీనివల్ల చివరికి మిగిలేది తీవ్రమైన వేదన మాత్రమే అని నీకు తెలీదా? మరి, తమ సహోదరుల్ని తరమడం ఆపేయమని ప్రజలకు చెప్పడానికి నువ్వు ఇంకా ఎంత సమయం తీసుకుంటావు?” 27  దానికి యోవాబు ఇలా అన్నాడు: “సత్య​దేవుని జీవం తోడు, నువ్వు ఈ మాట అనకపోతే, రేపు ఉదయానికి గాని ప్రజలు తమ సహోదరుల్ని తరమడం ఆపేవాళ్లు కాదు.” 28  అప్పుడు యోవాబు బూర* ఊదడంతో అతని మనుషులు ఇశ్రాయేలు ప్రజల్ని తరమడం ఆపేశారు. పోరాటం ఆగిపోయింది. 29  తర్వాత అబ్నేరు, అతని మనుషులు ఆ రాత్రంతా అరాబా+ గుండా నడిచి యొర్దాను దాటారు. అక్కడి నుండి లోయ గుండా* నడిచి ​చివరికి మహనయీముకు+ చేరుకున్నారు. 30  యోవాబు అబ్నేరును తరమడం ఆపేసిన తర్వాత ప్రజలందర్నీ ఒక దగ్గర సమకూ​ర్చాడు. అశాహేలు కాకుండా దావీదు సేవకుల్లో 19 మంది తగ్గారు. 31  కానీ దావీదు సేవకులు బెన్యామీనీయుల్ని, అబ్నేరు మనుషుల్ని ఓడించారు, వాళ్ల మనుషుల్లో 360 మంది చనిపోయారు. 32  వాళ్లు అశాహేలును+ తీసుకెళ్లి బేత్లెహేములోని+ అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. యోవాబు, అతని మనుషులు రాత్రంతా నడిచి ఉదయానికి హెబ్రోనుకు+ చేరుకున్నారు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “కొమ్ము.”
లేదా “బిత్రోను అంతటి గుండా” అయ్యుంటుంది.