సమూయేలు రెండో గ్రంథం 17:1-29
17 తర్వాత అహీతోపెలు అబ్షాలోముతో ఇలా అన్నాడు: “దయచేసి నాకు అనుమతి ఇవ్వు. నేను 12,000 మంది మనుషుల్ని ఎంచుకుని, లేచి ఈ రోజు రాత్రి దావీదును తరుముతాను.
2 అతను అలసిపోయి, బలహీనంగా ఉన్నప్పుడు+ నేను అతని మీద దాడిచేసి అతన్ని భయాందోళనలకు గురిచేస్తాను; అప్పుడు అతనితో ఉన్న ప్రజలందరూ పారిపోతారు, నేను రాజును మాత్రమే చంపుతాను.+
3 తర్వాత నేను ప్రజలందర్నీ వెనక్కి నీ దగ్గరికి తీసుకొస్తాను, నువ్వు వెతుకుతున్న వ్యక్తికి ఏమి జరుగుతుందనే దానిమీదే ప్రజలందరూ తిరిగిరావడం అనేది ఆధారపడివుంది. అప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు.”
4 ఆ సలహా అబ్షాలోము దృష్టికి, ఇశ్రాయేలు పెద్దలందరి దృష్టికి ఎంతో సరైనదిగా అనిపించింది.
5 అయితే అబ్షాలోము, “దయచేసి అర్కీయుడైన హూషైను+ కూడా పిలవండి, అతను ఏమి చెప్తాడో విందాం” అన్నాడు.
6 దాంతో హూషై అబ్షాలోము దగ్గరికి వచ్చాడు. అబ్షాలోము అతనితో, “అహీతోపెలు ఈ సలహా ఇచ్చాడు. మనం అతని సలహా ప్రకారం చేద్దామా? లేకపోతే, నీ సలహా ఏంటో చెప్పు” అన్నాడు.
7 అప్పుడు హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు: “అహీతోపెలు ఇచ్చిన సలహా ఈ సందర్భంలో మంచిదికాదు!”+
8 హూషై ఇంకా ఇలా అన్నాడు: “నీ తండ్రి, అతని మనుషులు బలవంతులని+ నీకు బాగా తెలుసు. పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిలా వాళ్లు ఎంతో తెగించి ఉన్నారు.+ అదీగాక, నీ తండ్రి యోధుడు,+ అతను రాత్రిపూట ప్రజలతో గడపడు.
9 ఈ క్షణంలో అతను ఏదో ఒక గుహలో* గానీ వేరే స్థలంలో గానీ దాక్కొని ఉంటాడు;+ అతనే గనుక ముందు దాడిచేస్తే, దాని గురించి వినేవాళ్లు, ‘అబ్షాలోమును అనుసరిస్తున్నవాళ్లు ఓడిపోయారు!’ అని అంటారు.
10 అప్పుడు సింహం గుండె లాంటి+ గుండె ఉన్న ధైర్యవంతుడు కూడా భయంతో ఖచ్చితంగా నీరుగారిపోతాడు. ఎందుకంటే నీ తండ్రి బలవంతుడని,+ అతనితో ఉన్న మనుషులు ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికీ తెలుసు.
11 నేను ఇచ్చే సలహా ఏమిటంటే, దాను నుండి బెయేర్షెబా వరకు+ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలీయులందర్నీ+ నీ దగ్గరికి సమకూర్చుకో, నువ్వే వాళ్లను యుద్ధంలో నడిపించు.
12 అతను ఎక్కడ కనబడినా, నేలమీద పడే మంచులా మనం అతని మీద పడదాం; అప్పుడు అతను గానీ అతనితో ఉన్న మనుషులు గానీ ఏ ఒక్కరూ తప్పించుకోలేరు.
13 ఒకవేళ అతను నగరంలోకి పారిపోతే, ఇశ్రాయేలీయులందరూ తాళ్లు తీసుకొని ఆ నగరానికి వెళ్తారు; ఒక్క రాయి కూడా మిగలకుండా మనం ఆ నగరాన్ని తాళ్లతో లోయలోకి లాగుదాం.”
14 అప్పుడు అబ్షాలోము, అతనితోపాటు ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ, “అహీతోపెలు సలహా కన్నా అర్కీయుడైన హూషై సలహా బాగుంది!”+ అన్నారు. యెహోవా అబ్షాలోము మీదికి విపత్తు తీసుకొచ్చేలా,+ అహీతోపెలు ఇచ్చిన తెలివైన సలహాను పాడుచేయాలని యెహోవా నిశ్చయించుకున్నాడు.*+
15 తర్వాత హూషై యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు+ ఇలా చెప్పాడు: “అబ్షాలోముకు, ఇశ్రాయేలు పెద్దలకు అహీతోపెలు ఇలా సలహా ఇచ్చాడు, నేను ఇలా సలహా ఇచ్చాను.
16 మీరు వెంటనే దావీదుకు కబురు పంపించి ఇలా హెచ్చరిక చేయండి: ‘ఈ రోజు రాత్రి ఎడారిలో ఉన్న రేవుల* దగ్గర ఉండకండి. తప్పకుండా నది దాటి వెళ్లండి. లేకపోతే రాజు, అతనితో ఉన్న ప్రజలందరూ తుడిచిపెట్టుకుపోవచ్చు.’ ”+
17 యోనాతాను,+ అహిమయస్సు+ తమను ఎవరూ చూడకూడదని నగరం బయట ఏన్రోగేలులో+ ఉంటున్నారు; అప్పుడు ఒక సేవకురాలు వెళ్లి, విషయమంతా వాళ్లకు చెప్పింది, వాళ్లు దాని గురించి దావీదు రాజుకు చెప్పడానికి వెళ్లారు.
18 అయితే, ఒక యువకుడు వాళ్లను చూసి ఆ విషయం అబ్షాలోముకు చెప్పాడు. దాంతో వాళ్లిద్దరూ అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయి బహూరీములోని+ ఒక వ్యక్తి ఇంటికి వచ్చారు, అతని ఇంటి ఆవరణలో ఒక బావి ఉంది, వాళ్లు దానిలోకి దిగారు,
19 అతని భార్య ఆ బావి పైన ఒక బట్ట కప్పి, దానిమీద దంచిన ధాన్యాన్ని ఆరబోసింది; ఆ విషయం ఎవ్వరికీ తెలీదు.
20 అబ్షాలోము సేవకులు ఆమె ఇంటికి వచ్చి, “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ?” అని ఆమెను అడిగారు. దానికి ఆ స్త్రీ, “వాళ్లు నదివైపు వెళ్లారు” అని చెప్పింది.+ ఆ మనుషులు వాళ్లకోసం వెదికారు కానీ వాళ్లు దొరకలేదు. దాంతో ఆ మనుషులు యెరూషలేముకు తిరిగెళ్లారు.
21 ఆ మనుషులు వెళ్లిపోయిన తర్వాత, వాళ్లు బావిలో నుండి బయటికి వచ్చారు, వాళ్లు వెళ్లి దావీదు రాజుకు విషయం చెప్పారు. వాళ్లు అతనితో ఇలా అన్నారు: “మీరు లేచి వెంటనే నది దాటండి, ఎందుకంటే అహీతోపెలు మీకు వ్యతిరేకంగా ఇలా సలహా ఇచ్చాడు.”
22 వెంటనే దావీదు, అతనితో ఉన్న ప్రజలందరూ లేచి యొర్దాను నది దాటారు. తెల్లారేలోగా, ఒక్కరు కూడా మిగలకుండా అందరూ యొర్దాను నది దాటేశారు.
23 తాను ఇచ్చిన సలహాను పాటించకపోవడం చూసి అహీతోపెలు ఒక గాడిదకు జీను వేసి తన సొంతూరులో+ తన ఇంటికి వెళ్లాడు. తన ఇంటివాళ్లకు సూచనలు ఇచ్చిన తర్వాత+ అతను ఉరేసుకున్నాడు.+ అలా అతను చనిపోయాడు, అతని పూర్వీకుల సమాధిలో అతన్ని పాతిపెట్టారు.
24 ఈలోగా, దావీదు మహనయీముకు+ వెళ్లాడు, అబ్షాలోము ఇశ్రాయేలీయులందరితో కలిసి యొర్దాను నది దాటాడు.
25 అబ్షాలోము యోవాబు+ స్థానంలో అమాశాను+ సైన్యాధిపతిగా చేశాడు; ఈ అమాశా, నాహాషు కూతురైన అబీగయీలుతో+ సంబంధం పెట్టుకున్న ఇత్రా అనే ఇశ్రాయేలీయుని కుమారుడు. ఆమె యోవాబు తల్లి సెరూయాకు సహోదరి.
26 ఇశ్రాయేలు ప్రజలు, అలాగే అబ్షాలోము గిలాదు ప్రాంతంలో+ మకాం వేశారు.
27 దావీదు మహనయీముకు రాగానే, అమ్మోనీయుల రబ్బా+ నగరం నుండి నాహాషు కుమారుడైన షోబీ, లోదెబారు నుండి అమ్మీయేలు కుమారుడైన మాకీరు,+ రోగెలీము నుండి గిలాదీయుడైన బర్జిల్లయి+
28 పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, బార్లీ, పిండి, వేయించిన ధాన్యం, పెద్ద చిక్కుళ్లు, చిక్కుడు గింజలు, ఎండబెట్టిన ధాన్యం తీసుకొచ్చారు;
29 అలాగే తేనె, వెన్న, గొర్రెలు, జున్ను* తీసుకొచ్చారు. వాళ్లు, “ఎడారిలో ప్రజలు అలసిపోయుంటారు, వాళ్లు ఆకలితో, దాహంతో ఉంటారు”+ అని అనుకొని దావీదు కోసం, అతనితో ఉన్న మనుషుల కోసం అవన్నీ తీసుకొచ్చారు.+
అధస్సూచీలు
^ లేదా “గుంటల్లో; కనుమల్లో.”
^ లేదా “ఆజ్ఞాపించాడు.”
^ లేదా “ఎడారి మైదానాల” అయ్యుంటుంది.
^ అక్ష., “పశువుల పెరుగు.”