రాజులు రెండో గ్రంథం 6:1-33

  • ఎలీషా గొడ్డలిని పైకి తేలేలా చేయడం (1-7)

  • ఎలీషా, సిరియన్లు (8-23)

    • ఎలీషా పరిచారకుని కళ్లు తెరవబడడం (16, 17)

    • సిరియన్లకు గుడ్డితనం కలగడం (18, 19)

  • ముట్టడి కింద ఉన్న సమరయలో కరువు (24-33)

6  తర్వాత, ప్రవక్తల కుమారులు+ ఎలీషాతో ఇలా అన్నారు: “చూడు! మేము ఉంటున్న స్థలం మాకు బాగా ఇరుకైపోయింది.  దయచేసి మమ్మల్ని యొర్దానుకు వెళ్లనివ్వు. అక్కడి నుండి ఒక్కొక్కరం ఒక్కో మ్రాను తెచ్చుకొని మా కోసం నివాస స్థలాన్ని కట్టుకుంటాం.” దానికి అతను, “వెళ్లండి” అన్నాడు.  అప్పుడు వాళ్లలో ఒకతను, “నీ సేవకులమైన మాతోపాటు నువ్వు కూడా వస్తావా?” అని అడిగాడు. అతను, “వస్తాను” అన్నాడు.  ఎలీషా వాళ్ల వెంట వెళ్లాడు. వాళ్లు యొర్దాను దగ్గరికి వచ్చి, చెట్లు నరకడం మొదలుపెట్టారు.  వాళ్లలో ఒకతను చెట్టు నరుకుతుంటే గొడ్డలి* ఊడి నీళ్లలో పడింది. అప్పుడు అతను, “అయ్యో, నా యజమానీ, నేను దాన్ని అరువు తెచ్చుకున్నాను!” అన్నాడు.  సత్యదేవుని సేవకుడు, “అది ఎక్కడ పడింది?” అని అడిగాడు. అతను గొడ్డలి పడిన చోటును ​ఎలీషాకు చూపించాడు. అప్పుడు ఎలీషా ఒక చెక్క ముక్కను నరికి అక్కడ పడేసి ఆ గొడ్డలి తేలేలా చేశాడు.  దాన్ని పైకి తీయమని ఎలీషా చెప్పాడు. ఆ వ్యక్తి తన చెయ్యి చాపి ఆ ​గొడ్డలిని తీశాడు.  సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్లాడు.+ అతను తన సేవకులతో చర్చించిన తర్వాత, “నేను ​మీతోపాటు ఫలానా స్థలంలో మకాం వేస్తాను” అన్నాడు.  అప్పుడు సత్యదేవుని సేవకుడు,+ “ఫలానా స్థలానికి వెళ్లొద్దు, సిరియన్లు అక్కడికి వస్తు​న్నారు” అని ఇశ్రాయేలు రాజుకు కబురు పంపించాడు. 10  కాబట్టి ఇశ్రాయేలు రాజు, సత్యదేవుని సేవకుడు తనను హెచ్చరించిన స్థలంలో ఉన్న తన ప్రజల్ని అప్రమత్తం చేశాడు. సత్యదేవుని సేవకుడు హెచ్చరిస్తూ ఉండడంతో రాజు ఆ స్థలానికి దూరంగా ఉన్నాడు. ఇలా చాలాసార్లు జరిగింది.+ 11  దాంతో సిరియా రాజుకు చాలా కోపం వచ్చింది. అతను తన సేవకుల్ని పిలిపించి, “మనలో ఇశ్రాయేలు రాజు వైపు ఉన్నదెవరు? చెప్పండి” అని అడిగాడు. 12  అప్పుడు అతని సేవకుల్లో ఒకడు, “నా ప్రభువైన రాజా! మాలో ఎవ్వరూ లేరు. ఇశ్రాయేలులో ఉన్న ఎలీషా ప్రవక్తే నువ్వు నీ పడకగదిలో మాట్లాడే ​విషయాల్ని ​ఇశ్రాయేలు రాజుకు చెప్తున్నాడు”+ అని అన్నాడు. 13  అప్పుడు సిరియా రాజు, “మీరు వెళ్లి అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి. నేను అతన్ని పట్టుకోవడానికి మనుషుల్ని పంపిస్తాను” అన్నాడు. తర్వాత రాజుకు, “అతను దోతానులో+ ఉన్నాడు” అనే వార్త అందింది. 14  వెంటనే అతను గుర్రాల్ని, యుద్ధ రథాల్ని, ఒక పెద్ద సైన్యాన్ని అక్కడికి పంపించాడు; వాళ్లు రాత్రి​పూట వచ్చి ఆ నగరాన్ని చుట్టుముట్టారు. 15  సత్యదేవుని సేవకుని పరిచారకుడు ఉదయాన్నే లేచి బయటికి వెళ్లినప్పుడు, గుర్రాలు, యుద్ధ రథాలు నగరాన్ని చుట్టుముట్టడం చూశాడు. ఆ పరిచారకుడు వెంటనే ఎలీషాతో, “అయ్యో, నా యజమానీ! మనం ఇప్పుడు ఏమి చేద్దాం?” అన్నాడు. 16  అందుకు ఎలీషా, “భయపడకు!+ వాళ్ల దగ్గర ఉన్నవాళ్ల కన్నా మన దగ్గర ఉన్నవాళ్లే ఎక్కువ”+ అన్నాడు. 17  అప్పుడు ఎలీషా, “యెహోవా, అతను చూసేలా దయచేసి అతని కళ్లు తెరువు”+ అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. వెంటనే యెహోవా ఆ పరిచారకుని కళ్లు తెరిచాడు, దాంతో అతను చూడగలిగాడు; ఎలీషా చుట్టూరా పర్వత ప్రాంతమంతా అగ్ని గుర్రాలతో, అగ్ని యుద్ధ రథాలతో+ నిండివుండడం+ అతనికి కనిపించింది. 18  సిరియన్లు తన దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా యెహోవాకు, “దయచేసి ఈ ప్రజలకు గుడ్డితనం కలుగజేయి” అని ప్రార్థించాడు.+ ఎలీషా ప్రార్థించినట్టే ఆయన వాళ్లకు గుడ్డితనం కలుగజేశాడు. 19  అప్పుడు ఎలీషా వాళ్లతో, “మీరు వెళ్లాల్సిన దారి ఇది కాదు, మీరు వెళ్లా​ల్సిన నగరం ఇది కాదు. నా వెంట రండి, మీరు వెదుకుతున్న వ్యక్తి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను” అన్నాడు. కానీ అతను వాళ్లను సమరయకు+ తీసుకెళ్లాడు. 20  వాళ్లు సమరయకు వచ్చినప్పుడు ఎలీషా, “యెహోవా, వాళ్లు చూసేలా వాళ్ల కళ్లు తెరువు” అని ప్రార్థించాడు. యెహోవా వాళ్ల కళ్లు తెరిచాడు. అప్పుడు వాళ్లకు తాము సమరయ మధ్యలో ఉన్నామని అర్థమైంది. 21  ఇశ్రాయేలు రాజు వాళ్లను చూసినప్పుడు ఎలీషాను, “నా తండ్రీ, నేను వాళ్లను చంపనా? వాళ్లను చంపనా?” అని అడిగాడు. 22  కానీ ఎలీషా, “నువ్వు వాళ్లను చంపకూడదు. నువ్వు యుద్ధంలో* చెరపట్టినవాళ్లను చంపుతావా? వాళ్లకు ఆహారం, నీళ్లు ఇవ్వు; వాళ్లు తిని, తాగి+ తమ ప్రభువు దగ్గరికి తిరిగెళ్తారు” అని చెప్పాడు. 23  దాంతో రాజు వాళ్ల కోసం ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు; వాళ్లు తిన్నారు, తాగారు; తర్వాత రాజు వాళ్లను వాళ్ల ప్రభువు దగ్గరికి తిరిగి పంపించాడు. అప్పటి నుండి సిరియా దోపిడీ ముఠాలు+ మళ్లీ ఎప్పుడూ ఇశ్రాయేలు దేశంలోకి రాలేదు. 24  తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యాన్నంతా పోగుచేసుకొని, సమరయ మీదికి వెళ్లి ముట్టడించాడు.+ 25  దానివల్ల సమరయలో తీవ్రమైన కరువు ​ఏర్పడింది.+ వాళ్లు ​ఎక్కువకాలం ముట్టడించడంతో గాడిద తల+ 80 వెండి రూకలు, ఒక క్యాబ్‌ కొలతలో* నాలుగో వంతు పావురం రెట్ట 5 వెండి రూకలు పలికే పరిస్థితి వచ్చింది. 26  ఒక రోజు ఇశ్రాయేలు రాజు ప్రాకారం మీద నడుస్తుంటే ఒక స్త్రీ, “నా ప్రభువైన రాజా! మాకు సహాయం చేయి” అని కేకలు వేసింది. 27  అప్పుడు అతను, “యెహోవా నీకు సహాయం చేయకపోతే నేను ఎలా నీకు సహాయం చేయగలను? నేను ధాన్యాన్ని గానీ, ద్రాక్షార​సాన్ని గానీ, నూనెను గానీ నీకు ఇవ్వగలనా?” అన్నాడు. 28  తర్వాత రాజు ఆమెను, “నీ సమస్య ఏమిటి?” అని అడిగాడు. ఆమె ఇలా చెప్పింది: “ఈమె నాతో, ‘నీ కుమారుణ్ణి ఇవ్వు, ఈ రోజు వాణ్ణి తిందాం, రేపు నా కుమారుణ్ణి తిందాం’ అని అంది.+ 29  కాబట్టి మేము నా కుమారుణ్ణి ఉడికించి తిన్నాం.+ మరుసటి రోజు నేను ఆమెతో, ‘నీ ​కుమారుణ్ణి ఇవ్వు, మనం వాణ్ణి తిందాం’ అన్నాను. కానీ ఆమె తన కుమారుణ్ణి దాచిపెట్టింది.” 30  ఆమె మాటలు వినగానే రాజు తన బట్టలు చింపుకున్నాడు.+ అతను ప్రాకారం మీద నుండి వెళ్తున్నప్పుడు, అతను తన బట్టల లోపల* గోనెపట్ట కట్టుకుని ఉండడం ప్రజలు గమనించారు. 31  తర్వాత రాజు ఇలా అన్నాడు: “నేను షాపాతు కుమారుడైన ఎలీషా తలను ఈ రోజు తీయించకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించాలి!”+ 32  ఎలీషా తన ఇంట్లో కూర్చొని ఉన్నాడు, పెద్దలు అతనితో కూర్చొని ఉన్నారు. రాజు తనకు ముందుగా ఒక సందేశకుణ్ణి పంపించాడు. ఆ ​సందేశకుడు రాకముందే ఎలీషా ఆ పెద్దలతో ఇలా అన్నాడు: “నా తల తీయించడానికి హంతకుని కుమారుడు+ ఎలా ఒక మనిషిని పంపించాడో చూడండి. మీరు గమనిస్తూ ఉండండి, ఆ సందేశకుడు రాగానే తలుపు మూసేసి అతను లోపలికి రాకుండా తలుపును గట్టిగా పట్టుకోండి. అతని వెనకాలే అతని ప్రభువు అడుగుల చప్పుడు మీకు వినిపిస్తుంది.” 33  ఎలీషా వాళ్లతో అలా మాట్లాడుతూ ఉండగానే, ఆ సందేశకుడు ఎలీషా దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు, “ఈ విపత్తు యెహోవా వల్లే వచ్చింది. అలాంటప్పుడు నేను ఇంకా ఎందుకు యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండాలి?” అన్నాడు.

అధస్సూచీలు

లేదా “గొడ్డలి ఇనుప భాగం.”
లేదా “నీ ఖడ్గంతో, నీ వింటితో.”
అప్పట్లో ఒక క్యాబ్‌ 1.22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “ఒంటి మీద.”