రాజులు రెండో గ్రంథం 4:1-44

  • ఎలీషా, విధవరాలి నూనెను ఎక్కువ చేయడం (1-7)

  • షూనేము స్త్రీ ఆతిథ్యం (8-16)

  • ఆమెకు కుమారుడు పుట్టడం; చనిపోవడం (17-31)

  • చనిపోయిన కుమారుణ్ణి ఎలీషా బ్రతికించడం (32-37)

  • ఎలీషా పులుసులో విషం తీసేయడం (38-41)

  • ఎలీషా రొట్టెల్ని ఎక్కువ చేయడం (42-44)

4  ప్రవక్తల కుమారుల+ భార్యల్లో ఒకామె ఎలీషా దగ్గరికి వచ్చి ఇలా వేడుకుంది: “నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతను యెహోవా పట్ల భయభక్తులతో జీవించేవాడని+ నీకు బాగా తెలుసు. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల్ని దాసులుగా తీసుకెళ్లడానికి అప్పులవాడు వచ్చాడు.”  అందుకు ఎలీషా ఆమెతో, “నీకు ఏ సహాయం కావాలి? మీ ఇంట్లో ఏమి ఉన్నాయో చెప్పు” అన్నాడు. ఆమె, “నీ సేవకురాలి దగ్గర ఒక జాడీ నూనె తప్ప ఏమీ లేదు” అంది.+  అప్పుడు అతను, “బయటికి వెళ్లి, నీ ఇరుగుపొరుగు వాళ్లందరి దగ్గర ఖాళీ పాత్రలు అడిగి తీసుకో. వీలైనన్ని ఎక్కువ పాత్రలు తీసుకో.  తర్వాత నువ్వు, నీ కుమారులు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోండి. ఆ పాత్రలన్నిట్లో నూనె నింపి, నిండినవాటిని పక్కన పెట్టండి” అన్నాడు.  దాంతో ఆమె అతని దగ్గర నుండి వెళ్లిపోయింది. ఆమె, ఆమె కుమారులు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వాళ్లు ఆమెకు పాత్రలు అందిస్తూ ఉంటే ఆమె వాటిలో నూనె పోస్తూ ఉంది.+  పాత్రలు నిండిపోయాక, ఆమె తన కుమారుల్లో ఒకరితో, “మరో పాత్రను నా దగ్గరికి తీసుకురా”+ అంది. కానీ అతను, “పాత్రలన్నీ అయిపోయాయి” అన్నాడు. అప్పుడు నూనె రావడం ఆగిపోయింది.+  ఆమె సత్యదేవుని సేవకుని దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పింది. అతను, “నువ్వు వెళ్లి నూనెను అమ్మి నీ అప్పులు తీర్చేసుకో. మిగిలినదానితో నువ్వు, నీ కుమారులు బ్రతకవచ్చు” అని చెప్పాడు.  ఒకరోజు ఎలీషా షూనేముకు+ వెళ్లినప్పుడు, ఆ ఊర్లోని ప్రముఖురాలైన ఒక స్త్రీ అతన్ని భోజనానికి రమ్మని బ్రతిమాలింది.+ కాబట్టి ఎలీషా ఆ దారిలో వెళ్లే ప్రతీసారి ఆమె ఇంట్లో భోజనం చేసేవాడు.  ఒకసారి ఆమె తన భర్తతో ఇలా అంది: “ఈ దారిలో ఎప్పుడూ వెళ్తుండే ఆ మనిషి దేవుని పవిత్ర సేవకుడని నాకు తెలుసు. 10  కాబట్టి మనం మేడ మీద ఒక చిన్న గది+ కట్టించి అతని కోసం అందులో ఒక మంచాన్ని, బల్లను, పీఠాన్ని, దీపస్తంభాన్ని పెడదాం. అతను మన దగ్గరికి వచ్చినప్పుడల్లా అందులో ఉంటాడు.”+ 11  తర్వాత ఒకరోజు ఎలీషా అక్కడికి వచ్చి, పడుకోవడానికి ఆ మేడగదిలోకి వెళ్లాడు. 12  అప్పుడు అతను తన సేవకుడైన గేహజీతో,+ “ఆ షూనేము+ స్త్రీని పిలువు” అన్నాడు. అతను ఆమెను పిలిచాడు, ఆమె వచ్చి ఎలీషా ముందు నిలబడింది. 13  అతను గేహజీతో ఇలా చెప్పాడు: “దయచేసి ఆమెను ఇలా అడుగు, ‘నువ్వు మా కోసం ఇంత శ్రమ తీసుకున్నావు.+ నేను నీ కోసం ఏమి చేయాలి?+ నేను నీ గురించి రాజుతో గానీ సైన్యాధిపతితో గానీ మాట్లాడాలా?’ ”+ అందుకు ఆమె, “నాకు ఏ ఇబ్బందీ లేదు. నా ప్రజల మధ్య క్షేమంగానే ఉన్నాను” అంది. 14  ఎలీషా, “అలాగైతే, నేను ఆమె కోసం ఏమి చేయాలి?” అని అడిగాడు. అప్పుడు గేహజీ, “ఆమెకు కుమారుడు లేడు,+ ఆమె భర్త ముసలివాడు” అని చెప్పాడు. 15  వెంటనే ఎలీషా, “ఆమెను పిలువు” అన్నాడు. గేహజీ ఆమెను పిలిచాడు, ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది. 16  ఎలీషా ఆమెతో, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నువ్వు కుమారుణ్ణి ఎత్తుకుంటావు”+ అన్నాడు. కానీ ఆమె, “నా యజమానీ, నువ్వు సత్యదేవుని సేవకుడివి. నీ సేవకురాలితో అబద్ధాలు చెప్పకు” అంది. 17  ఎలీషా చెప్పినట్టే ఆ స్త్రీ గర్భవతి అయ్యి, తర్వాతి సంవత్సరం అదే సమయానికి ఒక కుమారుణ్ణి కన్నది. 18  ఆ బాబు కాస్త పెద్దవాడయ్యాడు; ఒకరోజు అతను, కోత కోసేవాళ్లతోపాటు ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్లాడు. 19  ఆ పిల్లవాడు తన తండ్రితో, “అయ్యో! నా తల చాలా నొప్పిగా ఉంది!” అని అంటూ ఉన్నాడు. అప్పుడు అతని తండ్రి ఒక సేవకుడితో, “బాబును ఎత్తుకొని వాళ్లమ్మ దగ్గరికి తీసుకెళ్లు” అని చెప్పాడు. 20  ఆ సేవకుడు ఆ బాబును వాళ్ల అమ్మ దగ్గరికి తీసుకెళ్లాడు, బాబు మధ్యాహ్నం వరకు ఆమె ఒడిలో కూర్చొని చనిపోయాడు.+ 21  అప్పుడు ఆమె బాబును మేడ గదిలోకి తీసుకెళ్లి, సత్యదేవుని సేవకుని మంచం+ మీద పడుకోబెట్టి, తలుపులు మూసేసి వచ్చేసింది. 22  తర్వాత ఆమె తన భర్తను పిలిచి, “దయచేసి నా దగ్గరికి ఒక సేవకుణ్ణి, ఒక గాడిదను పంపించు, నేను సత్యదేవుని సేవకుని దగ్గరికి త్వరగా వెళ్లి వస్తాను” అంది. 23  అయితే అతను, “ఈ రోజు అమావాస్య గానీ+ విశ్రాంతి రోజు* గానీ కాదే, అయినా ఈరోజు అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు?” అన్నాడు. అందుకు ఆమె, “కంగారేమీ లేదు, అంతా బాగానే ఉంది” అని చెప్పింది. 24  ఆమె గాడిద మీద జీను* వేసి, తన సేవకునితో, “త్వరగా పోనివ్వు. నేను చెప్తే తప్ప నెమ్మదిగా పోనివ్వద్దు” అంది. 25  ఆమె కర్మెలు పర్వతం దగ్గర ఉన్న సత్యదేవుని సేవకుని దగ్గరికి వెళ్లింది. సత్యదేవుని సేవకుడు ఆమెను దూరం నుండి చూడగానే, తన సేవకుడైన గేహజీతో ఇలా అన్నాడు: “చూడు! ఆ షూనేము స్త్రీ వచ్చింది. 26  దయచేసి ఆమె దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి, ‘నువ్వు, నీ భర్త క్షేమమేనా? మీ అబ్బాయి క్షేమమేనా?’ అని అడుగు.” దానికి ఆమె, “అంతా క్షేమమే” అంది. 27  ఆమె పర్వతం దగ్గర ఉన్న సత్యదేవుని సేవకుని దగ్గరికి రాగానే అతని పాదాలు పట్టుకుంది.+ అప్పుడు గేహజీ ఆమెను పక్కకు నెట్టాలని ఆమె దగ్గరికి వచ్చాడు; అయితే సత్యదేవుని సేవకుడు, “ఆమెను వదిలేయి, ఆమె తీవ్రమైన వేదనలో ఉంది; కారణమేమిటో నాకు తెలీదు, యెహోవా నాకు చెప్పలేదు” అన్నాడు. 28  అప్పుడు ఆమె, “నాకు ఒక కుమారుడు కావాలని నా ప్రభువైన నిన్ను నేను అడిగానా? నాకు లేనిపోని ఆశలు పెట్టొద్దని నేను చెప్పలేదా?” అంది.+ 29  వెంటనే ఎలీషా గేహజీతో, “నీ బట్టల్ని నడుము చుట్టూ గట్టిగా కట్టుకొని+ నా కర్రను చేతితో పట్టుకొని వెళ్లు. దారిలో ఎవరైనా ఎదురైతే పలకరించొద్దు, నిన్ను ఎవరైనా పలకరిస్తే జవాబివ్వొద్దు. వెళ్లి నా కర్రను ఆ అబ్బాయి ముఖం మీద పెట్టు” అని చెప్పాడు. 30  అప్పుడు ఆ అబ్బాయి తల్లి, “యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నువ్వు వస్తే తప్ప నేను ఇక్కడి నుండి వెళ్లను” అంది.+ దాంతో ఎలీషా లేచి ఆమెతోపాటు వెళ్లాడు. 31  గేహజీ వాళ్లకు ముందుగా వెళ్లి కర్రను అబ్బాయి ముఖం మీద పెట్టాడు, కానీ ఆ అబ్బాయి ఏమీ మాట్లాడలేదు, అతనిలో ఏ స్పందనా లేదు.+ గేహజీ ఎలీషా దగ్గరికి వచ్చి, “అబ్బాయి లేవలేదు” అని చెప్పాడు. 32  ఎలీషా ఇంట్లోకి వచ్చినప్పుడు, అతను బాబు చనిపోయి తన మంచం మీద పడివుండడం చూశాడు.+ 33  ఎలీషా గదిలోకి వెళ్లి, తలుపులు మూసేశాడు, లోపల వాళ్లిద్దరే ఉన్నారు. అతను యెహోవాకు ప్రార్థించడం మొదలుపెట్టాడు.+ 34  తర్వాత అతను మంచం ఎక్కి బాబు నోరు మీద తన నోటిని, బాబు కళ్ల మీద తన కళ్లను, బాబు అరచేతుల మీద తన అరచేతుల్ని ఉంచి అతని మీద చాచుకొని పడుకున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడి శరీరం వేడెక్కడం మొదలైంది.+ 35  ఎలీషా ఇంట్లో* అటూఇటూ తిరుగుతూ మళ్లీ మంచం ఎక్కి ఆ బాబు మీద చాచుకొని పడుకున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏడుసార్లు తుమ్మి, తర్వాత కళ్లు తెరిచాడు.+ 36  అప్పుడు ఎలీషా గేహజీని పిలిచి, “ఆ షూనేము స్త్రీని పిలువు” అన్నాడు. గేహజీ ఆమెను పిలిచాడు, ఆమె ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా ఆమెతో, “నీ కుమారుణ్ణి ఎత్తుకో”+ అన్నాడు. 37  ఆమె లోపలికి వచ్చి అతని పాదాల దగ్గర పడి అతనికి సాష్టాంగ నమస్కారం చేసింది, తర్వాత తన పిల్లవాణ్ణి ఎత్తుకొని బయటికి వెళ్లింది. 38  ఎలీషా గిల్గాలుకు తిరిగొచ్చినప్పుడు, దేశంలో కరువు ఉంది.+ ప్రవక్తల కుమారులు+ అతని ఎదుట కూర్చొని ఉన్నారు; అప్పుడు అతను తన సేవకునితో,+ “నువ్వు పొయ్యి మీద పెద్ద పాత్రను పెట్టి, ప్రవక్తల కుమారుల కోసం పులుసు తయారుచేయి” అన్నాడు. 39  కాబట్టి వాళ్లలో ఒకతను కూరగాయలు ఏరుకోవడానికి పొలానికి వెళ్లాడు, అతను ఒక పిచ్చి చెట్టును చూసి దాని కాయల్ని కోసి వాటిని తన వస్త్రంలో నింపుకున్నాడు; తర్వాత వెనక్కి వచ్చి వాటిని తరిగి, పులుసు పాత్రలో వేశాడు. అవి ఏం కాయలో అతనికి తెలీదు. 40  వాళ్లు దాన్ని ప్రవక్తల కుమారులకు వడ్డించారు, వాళ్లు ఆ పులుసును తినగానే, “సత్యదేవుని సేవకుడా, పాత్రలో విషం* ఉంది” అని కేకలు వేశారు. వాళ్లు దాన్ని తినలేకపోయారు. 41  అప్పుడు ఎలీషా, “కొంచెం పిండి తీసుకురండి” అన్నాడు. అతను దాన్ని పాత్రలో వేసి, “ప్రవక్తల కుమారులకు వడ్డించండి” అన్నాడు. ఆ తర్వాత పాత్రలో హానికరమైనది ఏదీ లేదు.+ 42  బయల్షాలిషా+ నుండి ఒక వ్యక్తి వచ్చాడు. అతను మొదటి పంటతో చేసిన 20 బార్లీ రొట్టెల్ని,+ ఒక సంచిలో కొత్త ధాన్యాన్ని సత్యదేవుని సేవకుని దగ్గరికి తీసుకొచ్చాడు.+ అప్పుడు ఎలీషా, “వాటిని ప్రజలకు వడ్డించు, వాళ్లు తింటారు” అన్నాడు. 43  అయితే అతని సేవకుడు, “వీటిని 100 మందికి ఎలా వడ్డించాలి?” అని అడిగాడు.+ దానికి ఎలీషా ఇలా అన్నాడు: “వాటిని ప్రజలకు వడ్డించు, వాళ్లు తింటారు; ఎందుకంటే యెహోవా ఇలా చెప్తున్నాడు, ‘వాళ్లు తింటారు, కొంత ఆహారం మిగులుతుంది కూడా.’ ”+ 44  అప్పుడు అతను ప్రజలకు వడ్డించాడు. యెహోవా చెప్పినట్టే వాళ్లు తిన్నారు, కొంత ఆహారం మిగిలింది కూడా.+

అధస్సూచీలు

లేదా “సబ్బాతు.”
ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.
లేదా “ఆ గదిలో.”
అక్ష., “మరణం.”