రాజులు రెండో గ్రంథం 17:1-41
17 యూదా రాజైన ఆహాజు పరిపాలనలోని 12వ సంవత్సరంలో, ఏలా కుమారుడైన హోషేయ+ సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు; అతను తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు.
2 అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు, కానీ తనకు ముందున్న ఇశ్రాయేలు రాజులంత కాదు.
3 అష్షూరు రాజైన షల్మనేసెరు హోషేయ మీద దాడి చేశాడు,+ దాంతో హోషేయ అతనికి సేవకుడై అతనికి కప్పం చెల్లించడం మొదలుపెట్టాడు.+
4 అయితే, హోషేయ తన మీద కుట్ర పన్నుతున్నాడని అష్షూరు రాజుకు తెలిసింది. ఎందుకంటే హోషేయ ఐగుప్తు రాజైన సో దగ్గరికి సందేశకుల్ని పంపించాడు,+ పైగా ముందు సంవత్సరాల్లోలాగా అష్షూరు రాజుకు కప్పం చెల్లించలేదు. దాంతో అష్షూరు రాజు అతనికి సంకెళ్లు వేసి, చెరసాలలో వేశాడు.
5 అష్షూరు రాజు దేశం మొత్తం మీద దండెత్తాడు; అతను సమరయకు వచ్చి, మూడు సంవత్సరాలు దాన్ని ముట్టడించాడు.
6 హోషేయ పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరంలో, అష్షూరు రాజు సమరయను స్వాధీనం చేసుకున్నాడు.+ అతను ఇశ్రాయేలు ప్రజల్ని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లి+ హాలహులో, గోజాను నది+ దగ్గరున్న హాబోరులో, మాదీయుల నగరాల్లో నివసింపజేశాడు.
7 ఇశ్రాయేలీయులు, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి తమను విడిపించి, ఐగుప్తు దేశం నుండి తమను బయటికి తీసుకొచ్చిన తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి ఇలా జరిగింది. ఇశ్రాయేలీయులు వేరే దేవుళ్లను పూజించారు,+
8 యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొట్టిన దేశాల ఆచారాల్ని, ఇశ్రాయేలు రాజులు ప్రవేశపెట్టిన ఆచారాల్ని వాళ్లు పాటించారు.
9 ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా దృష్టికి సరైనవికాని వాటిని చేస్తూ వచ్చారు. వాళ్లు కావలిబురుజు మొదలుకొని ప్రాకారాలుగల నగరాల వరకు తమ నగరాలన్నిట్లో* ఉన్నత స్థలాల్ని కడుతూ వచ్చారు.+
10 వాళ్లు ఎత్తైన ప్రతీ కొండ మీద, ప్రతీ పచ్చని చెట్టు కింద పూజా స్తంభాల్ని, పూజా కర్రల్ని* నిలబెట్టుకుంటూ వచ్చారు;+
11 యెహోవా వాళ్ల ఎదుట నుండి వెళ్లగొట్టిన దేశాల ప్రజల్లా వాళ్లు ఉన్నత స్థలాలన్నిటి మీద బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేసేవాళ్లు.+ వాళ్లు చెడ్డపనులు చేస్తూ యెహోవాకు కోపం తెప్పించారు.
12 యెహోవా వేటి గురించైతే, “మీరు వాటిని పూజించకూడదు!” అని చెప్పాడో+ ఆ అసహ్యమైన విగ్రహాల్నే* వాళ్లు పూజిస్తూ వచ్చారు.+
13 యెహోవా తన ప్రవక్తలందరి ద్వారా, దర్శనాలు చూసేవాళ్లందరి ద్వారా, “మీ చెడు మార్గాల్ని మానుకోండి!+ నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించిన, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు ఇచ్చిన నా ఆజ్ఞల్ని, నా శాసనాల్ని, ధర్మశాస్త్రమంతటినీ పాటించండి” అని ఇశ్రాయేలును, యూదాను హెచ్చరిస్తూ వచ్చాడు.+
14 కానీ వాళ్లు వినలేదు, వాళ్లు తమ దేవుడైన యెహోవా మీద విశ్వాసం చూపించని తమ పూర్వీకుల్లాగే మొండిగా ప్రవర్తిస్తూ వచ్చారు.+
15 వాళ్లు ఆయన నియమాల్ని, వాళ్ల పూర్వీకులతో ఆయన చేసిన ఒప్పందాన్ని,+ వాళ్లను హెచ్చరించడానికి ఆయన ఇచ్చిన జ్ఞాపికల్ని తిరస్కరిస్తూ వచ్చారు;+ వాళ్లు, యెహోవా అనుకరించకూడదని ఆజ్ఞాపించిన చుట్టుపక్కల దేశాల ప్రజల్ని అనుకరిస్తూ,+ వ్యర్థమైన విగ్రహాల్ని పూజిస్తూ,+ వాళ్లు కూడా పనికిమాలినవాళ్లుగా తయారయ్యారు.+
16 వాళ్లు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ విడిచిపెడుతూ వచ్చారు; వాళ్లు పోతపోసిన రెండు దూడల విగ్రహాల్ని, పూజా కర్రను*+ చేసుకున్నారు, ఆకాశ సైన్యమంతటికీ మొక్కారు,+ బయలును పూజించారు.+
17 అంతేకాదు తమ కుమారుల్ని, కూతుళ్లను అగ్నిలో వేసి కాల్చారు;*+ సోదెను అభ్యసించారు,+ శకునాలు చూశారు, యెహోవాకు కోపం వచ్చేలా ఆయన దృష్టికి చెడు చేయడంలో మునిగిపోయారు.*
18 దాంతో యెహోవాకు ఇశ్రాయేలీయుల మీద చాలా కోపం వచ్చింది, ఆయన వాళ్లను తన కళ్లముందు నుండి తీసేశాడు.+ ఒక్క యూదా గోత్రాన్ని తప్ప ఎవర్నీ మిగలనివ్వలేదు.
19 అయితే, యూదావాళ్లు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞల్ని పాటించలేదు;+ వాళ్లు కూడా ఇశ్రాయేలు ప్రజల ఆచారాల్నే అనుసరించారు.+
20 యెహోవా ఇశ్రాయేలు వంశస్థులందర్నీ తిరస్కరించి వాళ్లను అవమానించాడు, వాళ్లను దోపిడీదారుల చేతులకు అప్పగించాడు. ఆయన వాళ్లను పూర్తిగా తన ఎదుట నుండి వెళ్లగొట్టేంతవరకు అలా చేశాడు.
21 ఆయన దావీదు ఇంటివాళ్ల నుండి ఇశ్రాయేలువాళ్లను వేరు చేశాడు, వాళ్లు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసుకున్నారు.+ కానీ యరొబాము ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించడం మానేయడానికి, ఘోరమైన పాపం చేయడానికి కారకుడయ్యాడు.
22 ఇశ్రాయేలు ప్రజలు యరొబాము చేసిన పాపాలన్నీ చేస్తూ వచ్చారు.+ వాళ్లు వాటిని విడిచిపెట్టలేదు,
23 యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా ప్రకటించినట్టే, ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని తన కళ్లముందు నుండి తీసేసేంత వరకు అలా జరిగింది.+ కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అష్షూరు దేశానికి బందీలుగా తీసుకెళ్లబడ్డారు;+ వాళ్లు ఈ రోజు వరకు అక్కడే ఉన్నారు.
24 తర్వాత అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము+ నుండి ప్రజల్ని తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు బదులు వాళ్లను సమరయ నగరాల్లో నివసింపజేశాడు; వాళ్లు సమరయను స్వాధీనం చేసుకొని దాని నగరాల్లో నివసించారు.
25 వాళ్లు అక్కడ నివసించడం మొదలుపెట్టినప్పుడు యెహోవాను ఆరాధించలేదు.* అందుకే యెహోవా వాళ్ల మధ్యకు సింహాల్ని పంపించాడు,+ అవి వాళ్లలో కొంతమందిని చంపాయి.
26 అప్పుడు అష్షూరు రాజుకు, “నువ్వు బందీలుగా తీసుకెళ్లి సమరయ నగరాల్లో ఉంచిన ప్రజలకు ఆ దేశపు మతం,* ఆ దేశపు దేవుడు తెలీదు. కాబట్టి ఆయన వాళ్ల మధ్యకు సింహాల్ని పంపిస్తున్నాడు, అవి వాళ్లను చంపుతున్నాయి; ఎందుకంటే వాళ్లలో ఎవరికీ ఆ దేశపు మతం, ఆ దేశపు దేవుడు తెలీదు” అనే వార్త అందింది.
27 కాబట్టి అష్షూరు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “అక్కడి నుండి బందీలుగా తీసుకెళ్లబడిన యాజకుల్లో ఒకర్ని వెనక్కి తీసుకురండి. అతను అక్కడ నివసించి వాళ్లకు ఆ దేశపు మతం గురించి, ఆ దేశపు దేవుని గురించి బోధిస్తాడు.”
28 దాంతో వాళ్లు సమరయ నుండి బందీలుగా తీసుకెళ్లిన యాజకుల్లో ఒకతను వెనక్కి వచ్చి బేతేలులో+ నివసించాడు. యెహోవాను ఎలా ఆరాధించాలో* అతను ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు.+
29 అయితే, ప్రతీ దేశంవాళ్లు తమ సొంత దేవుళ్లను చేసుకున్నారు, వాళ్లు వాటిని సమరయులు ఉన్నత స్థలాల మీద కట్టిన గుళ్లలో ఉంచారు; ప్రతీ దేశంవాళ్లు తాము నివసిస్తున్న నగరాల్లో అలా చేశారు.
30 బబులోనువాళ్లు సుక్కోత్బెనోతును చేసుకున్నారు, కూతా మనుషులు నెర్గలును చేసుకున్నారు, హమాతు+ మనుషులు అషీమాను చేసుకున్నారు,
31 ఆవీయులు నిబ్హజును, తర్తాకును చేసుకున్నారు. సెపర్వీయులు తమ కుమారుల్ని సెపర్వయీము దేవుళ్లు+ అయిన అద్రమ్మెలెకు, అనెమ్మెలెకు కోసం మంటల్లో కాల్చేవాళ్లు.
32 ఆ ప్రజలు యెహోవాను ఆరాధించినా, ఉన్నత స్థలాల కోసం సాధారణ ప్రజల్ని పూజారులుగా నియమించేవాళ్లు; ఆ పూజారులు ఉన్నత స్థలాల మీదున్న గుళ్లలో ప్రజల కోసం సేవచేసేవాళ్లు.+
33 అలా వాళ్లు యెహోవాను ఆరాధించినా, తాము ఏ దేశాల నుండి వచ్చారో ఆ దేశాల మతాన్ని* బట్టి తమ సొంత దేవుళ్లను పూజించారు.+
34 ఈ రోజు వరకు వాళ్లు తమ పాత మతాల్నే* అనుసరిస్తున్నారు. వాళ్లలో ఎవ్వరూ యెహోవాను ఆరాధించడం లేదు;* ఆయన శాసనాల్ని, ఆయన తీర్పుల్ని, యెహోవా ఎవరి పేరునైతే ఇశ్రాయేలుగా మార్చాడో ఆ యాకోబు+ కుమారులకు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞల్ని పాటించడం లేదు.
35 యెహోవా ఇశ్రాయేలీయులతో ఒప్పందం చేసినప్పుడు+ వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వేరే దేవుళ్లను పూజించకూడదు, మీరు వాళ్లకు మొక్కడం గానీ సేవించడం గానీ బలులు అర్పించడం గానీ చేయకూడదు.+
36 గొప్ప శక్తితో, చాచిన బాహువుతో మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన యెహోవానే+ మీరు ఆరాధించాలి,+ ఆయనకే మీరు వంగి నమస్కారం చేయాలి, ఆయనకే మీరు బలులు అర్పించాలి.
37 ఆయన మీ కోసం రాయించిన శాసనాల్ని, తీర్పుల్ని, ధర్మశాస్త్రాన్ని,+ ఆజ్ఞల్ని మీరు ఎప్పుడూ జాగ్రత్తగా పాటించాలి, మీరు వేరే దేవుళ్లను పూజించకూడదు.
38 నేను మీతో చేసిన ఒప్పందాన్ని మీరు మర్చిపోకూడదు,+ మీరు వేరే దేవుళ్లను పూజించకూడదు.
39 మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు.”
40 అయితే వాళ్లు దాన్ని పాటించకుండా తమ పాత మతాన్ని* అనుసరించారు.+
41 అలా ఆ దేశాలవాళ్లు యెహోవా పట్ల భయభక్తులు చూపిస్తూనే+ తమ చెక్కుడు విగ్రహాల్ని కూడా పూజిస్తూ వచ్చారు. ఈ రోజు వరకు వాళ్ల కుమారులు, మనవళ్లు తమ పూర్వీకుల్లాగే చేస్తున్నారు.
అధస్సూచీలు
^ అంటే, తక్కువ జనాభా, ఎక్కువ జనాభా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో.
^ ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
^ అక్ష., “తమను తాము అమ్ముకుంటూ ఉన్నారు.”
^ అక్ష., “అగ్ని గుండా దాటించారు.”
^ లేదా “యెహోవాకు భయపడలేదు.”
^ లేదా “మతాచారాలు.”
^ లేదా “యెహోవాకు ఎలా భయపడాలో.”
^ లేదా “మతాచారాల్ని.”
^ లేదా “మతాచారాల్నే.”
^ లేదా “యెహోవాకు భయపడడం లేదు.”
^ లేదా “మతాచారాల్ని.”