రాజులు రెండో గ్రంథం 10:1-36

  • యెహూ అహాబు ఇంటివాళ్లను చంపడం (1-17)

    • యెహోనాదాబు యెహూతో చేతులు కలపడం (15-17)

  • యెహూ బయలును పూజించేవాళ్లను చంపడం (18-27)

  • యెహూ పరిపాలన (28-36)

10  అహాబుకు+ సమరయలో 70 మంది కుమారులు ఉన్నారు. యెహూ ఉత్తరాలు రాసి సమరయలోని యెజ్రెయేలు అధిపతులకు, పెద్దలకు, అహాబు పిల్లల సంరక్షకులకు పంపించాడు.+ ఆ ఉత్తరాల్లో ఇలా ఉంది:  “మీ ప్రభువు కుమారులు మీ దగ్గర ఉన్నారు; యుద్ధ రథాలు, గుర్రాలు, ప్రాకారంగల ఒక నగరం, ఆయుధాలు కూడా మీకు ఉన్నాయి. ఈ ఉత్తరం మీకు అందగానే  మీ ప్రభువు కుమారుల్లో ఎంతో ఉత్తముడైన, యోగ్యుడైన* ఒకతన్ని ఎంపిక చేసి, అతన్ని అతని తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టండి. తర్వాత మీ ప్రభువు ఇంటివాళ్ల కోసం పోరాడండి.”  అయితే వాళ్లు భయపడిపోయి, “ఇద్దరు రాజులు అతని ముందు నిలవలేకపోయారు,+ మనం ఎలా నిలవగలం?” అని అనుకున్నారు  కాబట్టి రాజభవన పర్యవేక్షకుడు, ఆ నగర అధిపతి, పెద్దలు, పిల్లల సంరక్షకులు యెహూకు, “మేము నీ సేవకులం, నువ్వు మాకు చెప్పే ప్రతీది చేస్తాం. మేము ఎవర్నీ రాజును చేయం. నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది చేయి” అని సందేశం పంపించారు.  తర్వాత యెహూ వాళ్లకు రెండో ఉత్తరం పంపించాడు, అందులో ఇలా ఉంది: “మీరు నావైపు ఉండి నాకు లోబడడానికి ఇష్టపడితే, మీ ప్రభువు కుమారుల తలలు ​తీసుకొని రేపు ఈ సమయానికి యెజ్రెయేలులో నా దగ్గరికి రండి.” రాజు 70 మంది కుమారులు ఆ నగర ప్రముఖుల దగ్గర ఉన్నారు. వాళ్లు ఆ పిల్లల్ని పెంచుతున్నారు.  ఆ ఉత్తరం అందగానే, వాళ్లు ఆ 70 మంది రాకుమారుల్ని చంపారు;+ వాళ్ల తలల్ని గంపల్లో పెట్టి, యెజ్రెయేలులో యెహూ దగ్గరికి పంపించారు.  అప్పుడు సందేశకుడు వచ్చి, “వాళ్లు రాకుమారుల తలల్ని తీసుకొచ్చారు” అని యెహూతో చెప్పాడు. దానికి యెహూ, “వాటిని నగర ప్రవేశ ద్వారం దగ్గర రెండు కుప్పలుగా పోసి, ఉదయం వరకు అలాగే ఉంచండి” అని చెప్పాడు.  తర్వాతి రోజు ఉదయం, యెహూ బయటికి వెళ్లి ప్రజలందరి ముందు నిలబడి ఇలా అన్నాడు: “మీరు నిర్దోషులు.* నేనే నా ప్రభువు మీద కుట్రపన్ని అతన్ని చంపాను,+ మరి వీళ్లందర్నీ ఎవరు చంపారు? 10  కాబట్టి యెహోవా అహాబు ఇంటికి వ్యతిరేకంగా చెప్పిన యెహోవా మాటల్లో ఒక్కమాట కూడా నెరవేరకుండా పోదని తెలుసుకోండి;+ యెహోవా తన సేవకుడైన ఏలీయా ద్వారా చెప్పింది నెరవేర్చాడు.”+ 11  అంతేకాదు, యెహూ యెజ్రెయేలులో మిగిలిన అహాబు ఇంటివాళ్లందర్నీ, అతని ప్రముఖులందర్నీ, అతని స్నేహితులం​దర్నీ, అతని పూజారులందర్నీ చంపాడు;+ అహాబుకు చెందినవాళ్లలో ఏ ఒక్కర్నీ అతను ప్రాణాలతో ​విడిచిపెట్టలేదు.+ 12  తర్వాత యెహూ సమరయకు బయల్దేరాడు. దారిలో కాపరులకు చెందిన గొర్రెబొచ్చు కత్తిరించే ఇల్లు ఒకటి ఉంది. 13  అక్కడ యెహూకు యూదా రాజైన అహజ్యా+ సహోదరులు ఎదురయ్యారు. అతను వాళ్లను, “మీరు ఎవరు?” అని అడిగాడు. వాళ్లు, “మేము అహజ్యా సహోదరులం; రాకుమారుల బాగోగుల్ని, రాజమాత కుమారుల బాగోగుల్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాం” అన్నారు. 14  వెంటనే యెహూ తన మనుషులతో, “వాళ్లను ప్రాణాలతో పట్టుకోండి!” అన్నాడు. వాళ్లు అహజ్యా సహోదరుల్ని ప్రాణాలతో పట్టుకొని, గొర్రెబొచ్చు కత్తిరించే ఇంటి దగ్గరున్న బావి వద్ద వాళ్లను చంపారు. మొత్తం 42 మందిని చంపారు. యెహూ వాళ్లలో ఎవ్వర్నీ ప్రాణాలతో వదల్లేదు.+ 15  యెహూ అక్కడి నుండి వెళ్తుండగా, రేకాబు+ కుమారుడైన యెహోనాదాబు+ అతనికి ఎదురయ్యాడు, అతను యెహూను కలవడానికి వస్తున్నాడు. అతను పలకరించినప్పుడు* యెహూ అతన్ని, “నా హృదయం నీ హృదయం పట్ల విశ్వసనీయంగా ఉన్నట్టు నీ హృదయం నా హృదయం పట్ల విశ్వసనీయంగా ఉందా?” అని అడిగాడు. దానికి యెహోనాదాబు, “ఉంది” అన్నాడు. “అలాగైతే, నీ చెయ్యి అందివ్వు” అని యెహూ అన్నాడు. అతను యెహూకు చెయ్యి అందించాడు, యెహూ అతన్ని తన రథంలోకి ఎక్కించుకున్నాడు. 16  అప్పుడు యెహూ, “యెహోవా విషయంలో నాకెంత రోషం* ఉందో+ నాతోపాటు వచ్చి చూడు” అన్నాడు. యెహూ అతన్ని తన యుద్ధ రథంలో తీసుకెళ్లాడు. 17  తర్వాత యెహూ సమరయకు వచ్చి, ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్టు,+ సమరయలో మిగిలివున్న అహాబు ఇంటివాళ్లందర్నీ చంపి, వాళ్లను పూర్తిగా నాశనం చేశాడు.+ 18  తర్వాత, యెహూ ప్రజలందర్నీ సమకూర్చి వాళ్లతో ఇలా అన్నాడు: “అహాబు బయలును కొద్దిగానే పూజించాడు,+ కానీ యెహూ అతన్ని ఇంకా ఎక్కువగా పూజిస్తాడు. 19  కాబట్టి బయలు ప్రవక్తలందర్నీ,+ అతన్ని పూజించే వాళ్లందర్నీ, అతని పూజారులందర్నీ+ నా దగ్గరికి పిలిపించండి. ఒక్కరు కూడా తప్పిపోకూడదు. ఎందుకంటే నేను బయలుకు ఒక గొప్ప బలి అర్పించబోతున్నాను. ఎవరైనా రాకపోతే వాళ్లు ప్రాణాలతో ఉండరు.” అయితే బయలును పూజించేవాళ్లను నాశనం చేయాలని యెహూ యుక్తిగా అలా చేశాడు. 20  యెహూ ఇంకా ఇలా అన్నాడు: “బయలు కోసం ఒక ప్రత్యేక సమావేశాన్ని చాటించండి.” వాళ్లు అతను చెప్పినట్టే చాటించారు. 21  తర్వాత యెహూ ఇశ్రాయేలు అంతటికీ కబురు పంపించడంతో బయలును పూజించే వాళ్లందరూ వచ్చారు. వాళ్లలో అక్కడికి రాని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. వాళ్లు బయలు గుడిలోకి+ వచ్చారు, బయలు గుడి ఆ చివర నుండి ఈ చివర వరకు వాళ్లతో నిండిపోయింది. 22  అప్పుడు యెహూ బట్టల గది అధికారితో, “బయలును పూజించే వాళ్లందరికీ బట్టలు తెప్పించు” అన్నాడు. అతను వాళ్ల కోసం బట్టలు తెప్పించాడు. 23  తర్వాత యెహూ, రేకాబు కుమారుడైన యెహోనాదాబు+ బయలు గుడిలోకి వెళ్లారు. యెహూ బయలును పూజించేవాళ్లతో, “జాగ్రత్తగా వెదకండి, ఇక్కడ బయలును పూజించేవాళ్లు తప్ప యెహోవా ఆరాధకులెవ్వరూ ఉండకూడదు” అన్నాడు. 24  చివరికి, వాళ్లు బలులు, దహనబలులు అర్పించడానికి లోపలికి వచ్చారు. యెహూ ముందుగానే తన మనుషుల్లో 80 మందిని బయట ఉంచి, “నేను మీ చేతికి అప్పగించేవాళ్లలో ఎవరైనా తప్పించుకుంటే, వాళ్ల ప్రాణాలకు బదులు మీ ప్రాణాలు పోతాయి” అన్నాడు. 25  దహనబలి అర్పించడం పూర్తైన తర్వాత, యెహూ తన కాపలావాళ్లకు,* సహాయాధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు లోపలికి వచ్చి వాళ్లను చంపండి! ఒక్కర్ని కూడా తప్పించుకోనివ్వకండి!”+ దాంతో కాపలావాళ్లు, సహాయాధికారులు వాళ్లను కత్తితో చంపి బయట పడేశారు, అలా వాళ్లు చంపుకుంటూ బయలు గుడిలోని గర్భాలయం* వరకు వెళ్లారు. 26  తర్వాత వాళ్లు బయలు గుడిలోని పూజా స్తంభాల్ని+ బయటికి తీసుకొచ్చి, ప్రతీదాన్ని తగలబెట్టారు.+ 27  వాళ్లు బయలు పూజా స్తంభాన్ని పడగొట్టారు,+ బయలు గుడిని+ కూలగొట్టి దాన్ని మరుగుదొడ్డిగా మార్చారు. అది ఈ రోజు వరకు అలాగే ఉంది. 28  అలా యెహూ ఇశ్రాయేలులో బయలు పూజను పూర్తిగా నిర్మూలించాడు. 29  అయితే, యెహూ నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాల్ని విడిచిపెట్టలేదు. యెహూ బేతేలులో, దానులో బంగారు దూడల్ని అలాగే ఉండనిచ్చాడు.+ 30  కాబట్టి యెహోవా యెహూతో ఇలా అన్నాడు: “నువ్వు అహాబు ఇంటికి వ్యతిరేకంగా నేను చేయాలనుకున్నవన్నీ+ చేసి చక్కగా ప్రవ​ర్తించావు, నా దృష్టికి సరైనది చేశావు; అందుకే, నీ కుమారులు నాలుగు తరాల వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు.”+ 31  అయితే యెహూ తన నిండు హృదయంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే విషయంలో జాగ్రత్తపడలేదు.+ యరొబాము ఇశ్రాయేలుతో చేయించిన పాపాల్ని+ యెహూ విడిచిపెట్టలేదు. 32  ఆ రోజుల్లో యెహోవా ఇశ్రాయేలు ప్రాంతాల్ని ఒక్కొక్కటిగా వేరేవాళ్ల అధీనంలోకి వెళ్లనిచ్చాడు. హజాయేలు ఇశ్రాయేలు ప్రాంతమంతటి మీద దాడి చేస్తూ ఉన్నాడు.+ 33  యొర్దాను తూర్పు వైపున్న ప్రాంతం మొదలుకొని, గాదీయులు, రూబేనీయులు, మనష్షీయులు నివసించే గిలాదు ప్రాంతమంతటి+ మీద అతను దాడిచేశాడు. దానిలో అర్నోను లోయ* దగ్గర ఉన్న అరోయేరు నుండి గిలాదు, బాషాను వరకు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.+ 34  యెహూ మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నిటి గురించి, అతని బలమంతటి గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివుంది. 35  తర్వాత యెహూ చనిపోయాడు,* అతన్ని సమరయలో పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు యెహోయాహాజు+ రాజయ్యాడు. 36  యెహూ సమరయలో ఇశ్రాయేలు మీద పరిపాలించిన కాలం మొత్తం 28 సంవత్సరాలు.

అధస్సూచీలు

లేదా “నిజాయితీపరుడైన.”
లేదా “నీతిమంతులు.”
లేదా “దీవించినప్పుడు.”
లేదా “ఆసక్తి.”
అక్ష., “పరుగెత్తేవాళ్లకు.”
అక్ష., “నగరం,” బహుశా ఒక దుర్గం లాంటి నిర్మాణం కావచ్చు.
లేదా “అర్నోను వాగు.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”