రాజులు రెండో గ్రంథం 1:1-18

  • అహజ్యా చనిపోతాడని ఏలీయా చెప్పడం (1-18)

1  అహాబు చనిపోయిన తర్వాత మోయాబు+ ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసింది.  ఒకరోజు అహజ్యా సమరయలోని తన మేడగదికి ఉన్న జాలీ నుండి కింద పడి గాయపడ్డాడు. దాంతో అతను సందేశకుల్ని పంపించి, “మీరు ఎక్రోను+ దేవుడైన బయల్జెబూబు దగ్గరికి వెళ్లి, నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో విచారణ చేయండి” అని చెప్పాడు.  అప్పుడు యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాకు*+ ఇలా చెప్పాడు: “నువ్వు లేచి, సమరయ రాజు పంపించిన సందేశకుల్ని కలుసుకొని వాళ్లతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని మీరు ఎక్రోను దేవుడైన ​బయల్జెబూబు దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా?+  అందుకే, యెహోవా రాజుతో ఇలా చెప్తు​న్నాడు: “నువ్వు పడుకొనివున్న పరుపు మీద నుండి లేవవు, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు.” ’ ” ఏలీయా ఆ మాటలు చెప్పి వెళ్లిపోయాడు.  సందేశకులు రాజు దగ్గరికి తిరిగి రాగానే రాజు, “మీరు వెనక్కి ఎందుకు వచ్చారు?” అని వాళ్లను అడిగాడు.  వాళ్లు అతనితో ఇలా చెప్పారు: “మమ్మల్ని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు, అతను మాతో ఇలా అన్నాడు, ‘మిమ్మల్ని పంపించిన రాజు దగ్గరికి తిరిగెళ్లి ​అతనితో ఇలా చెప్పండి, “యెహోవా ఏమంటున్నాడంటే: ‘ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని నువ్వు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గర విచారణ చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నావా? అందుకే, నువ్వు పడుకొనివున్న పరుపు మీద నుండి లేవవు, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు.’ ” ’ ”+  అప్పుడు రాజు, “మీ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పిన వ్యక్తి చూడడానికి ఎలా ఉంటాడు?” అని అడిగాడు.  వాళ్లు రాజుతో, “అతను వెంట్రుకలతో నేసిన వస్త్రం+ వేసుకున్నాడు, అతని నడుముకు తోలు దట్టీ ఉంది”+ అని చెప్పారు. వెంటనే రాజు, “అతను తిష్బీయుడైన ఏలీయానే” అన్నాడు.  అప్పుడు రాజు ఏలీయా దగ్గరికి, 50 మంది మీద అధిపతిగా ఉన్న వ్యక్తిని, అతని 50 మంది సైనికుల్ని పంపించాడు. అతను ఏలీయా దగ్గరికి వచ్చినప్పుడు, ఏలీయా కొండ శిఖరం మీద కూర్చొని ఉన్నాడు. ఆ అధిపతి ఏలీయాతో, “సత్యదేవుని సేవకుడా,+ కిందికి రమ్మని రాజు చెప్తున్నాడు” అని అన్నాడు. 10  అయితే, ఏలీయా 50 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్న ఆ వ్యక్తితో, “నేను దేవుని సేవకుడినైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి,+ నిన్నూ నీ 50 మంది మనుషుల్నీ దహించాలి” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అతన్ని, అతని 50 మందిని దహించేసింది. 11  దాంతో రాజు మళ్లీ ఏలీయా దగ్గరికి, 50 మంది మీద అధిపతిగా ఉన్న ఇంకో వ్యక్తిని, అతని 50 మంది సైనికుల్ని పంపించాడు. అతను ఏలీయా దగ్గరికి వెళ్లి, “సత్యదేవుని సేవకుడా, త్వరగా కిందికి రమ్మని రాజు చెప్తున్నాడు” అని అన్నాడు. 12  ఏలీయా వాళ్లతో, “నేను సత్య​దేవుని సేవకుడినైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి, నిన్నూ నీ 50 మంది మనుషుల్నీ దహించాలి” అన్నాడు. అప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి అతన్ని, అతని 50 మందిని ​దహించేసింది. 13  తర్వాత రాజు మళ్లీ ఏలీయా దగ్గరికి, 50 మంది మీద అధిపతిగా ఉన్న మూడో వ్యక్తిని, అతని 50 మంది సైనికుల్ని పంపించాడు. అయితే ఆ మూడో అధిపతి ఏలీయా దగ్గరికి వెళ్లి అతని ముందు మోకాళ్లూని, దయ చూపించమని వేడుకుంటూ ఇలా అన్నాడు: “సత్యదేవుని సేవకుడా, దయచేసి నా ప్రాణం, నీ సేవకులైన ఈ 50 మంది మనుషుల ప్రాణం నీ దృష్టికి విలువైన​దిగా ఉండాలి. 14  ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ఇప్పటికే 50 మంది సైనికుల మీద అధిపతులుగా ఉన్న ఆ ఇద్దర్నీ, వాళ్ల 50 మందినీ దహించేసింది. కాబట్టి నా మీద కరుణ చూపించి నన్ను  బ్రతకనివ్వు.” 15  అప్పుడు యెహోవా దూత ఏలీయాతో, “నువ్వు దిగి అతనితోపాటు వెళ్లు, అతనికి భయపడకు” అని చెప్పాడు. దాంతో అతను లేచి ఆ అధిపతితోపాటు రాజు దగ్గరికి వెళ్లాడు. 16  ఏలీయా రాజుతో ఇలా అన్నాడు, “యెహోవా ఏమి చెప్తున్నాడంటే: ‘నువ్వు ఎక్రోను+ దేవుడైన బయల్జెబూబు దగ్గర విచా​రణ చేయడానికి సందేశకుల్ని పంపించావు. ​ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని అలా పంపించావా?+ నువ్వు ఆయన దగ్గర ఎందుకు విచారణ చేయలేదు? కాబట్టి, నువ్వు ​పడుకొనివున్న పరుపు మీద నుండి లేవవు, నువ్వు ఖచ్చి​తంగా చనిపోతావు.’ ” 17  ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్టే అతను చనిపోయాడు; అతనికి కుమారుడు లేడు కాబట్టి అతని స్థానంలో యెహోరాము*+ రాజయ్యాడు. అతను యూదా రాజైన యెహోషాపాతు కుమారుడు యెహోరాము+ పరిపాలనలోని రెండో సంవత్సరంలో రాజయ్యాడు. 18  అహజ్యా+ మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి.

అధస్సూచీలు

“నా దేవుడు యెహోవా” అని అర్థం.
అంటే, అహజ్యా సహోదరుడు.