దినవృత్తాంతాలు రెండో గ్రంథం 8:1-18

  • సొలొమోను ఇతర నిర్మాణాలు (1-11)

  • ఆలయంలో ఆరాధన సంస్థీకరించబడడం (12-16)

  • సొలొమోను నౌకాదళం (17, 18)

8  సొలొమోను 20 సంవత్సరాల్లో యెహోవా మందిరాన్ని, తన రాజభవనాన్ని కట్టించడం పూర్తిచేశాడు.+  ఆ తర్వాత అతను హీరాము+ ఇచ్చిన నగరాల్ని మళ్లీ కట్టించి, ఇశ్రాయేలీయులు* అక్కడ స్థిరపడేలా చేశాడు.  అంతేకాదు, సొలొమోను హమాతు-సొబాకు వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.  తర్వాత అతను ఎడారిలో ఉన్న తద్మోరును, అలాగే హమాతులో తాను కట్టించిన గోదాముల నగరాలన్నిటినీ+ పటిష్ఠం చేశాడు.  అంతేకాదు ఎగువ బేత్‌-హోరోను, దిగువ బేత్‌-హోరోను+ నగరాలకు ప్రాకారాలు కట్టించి, ద్వారాలు, అడ్డగడియలు అమర్చి వాటిని పటిష్ఠం చేశాడు,  అలాగే బాలాతును,+ తన గోదాముల నగరాలన్నిటినీ, రథాల నగరాలన్నిటినీ,+ గుర్రపురౌతుల నగరాల్ని కట్టించాడు. సొలొమోను యెరూషలేములో, లెబానోనులో, తన పరిపాలన కింద ఉన్న దేశమంతటిలో తాను కోరుకున్న ప్రతీది కట్టించాడు.  ఇశ్రాయేలీయులుకాని హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల+ వంశస్థుల విషయానికొస్తే,+  అంటే దేశంలో ఇశ్రాయేలీయులు నాశనం చేయని మిగిలినవాళ్ల+ విషయానికొస్తే, ఈ రోజు వరకు సొలొమోను వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నాడు.+  అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవర్నీ తన పని కోసం దాసులుగా చేసుకోలేదు.+ వాళ్లు అతని యోధులుగా, అతని అధికారుల మీద అధిపతులుగా, అతని రథసారథుల మీద, గుర్రపురౌతుల మీద అధిపతులుగా ఉన్నారు.+ 10  సొలొమోను రాజు దగ్గర ముఖ్య ఉప పాలకులు 250 మంది ఉన్నారు, వీళ్లు పనివాళ్ల మీద పర్యవేక్షకులు.+ 11  సొలొమోను ఫరో కూతురి కోసం ఒక భవనం కట్టించి,+ ఆమెను దావీదు నగరం నుండి ఆ భవనానికి తీసుకొచ్చాడు. అతను ఇలా అనుకున్నాడు: “ఆమె నా భార్యే అయినా, ఆమె ఇశ్రాయేలు రాజైన దావీదు రాజభవనంలో ఉండకూడదు. ఎందుకంటే, యెహోవా మందసం ఏ స్థలాలకు వచ్చిందో ఆ స్థలాలు పవిత్రమైనవి.”+ 12  తర్వాత సొలొమోను, వసారాకు+ ఎదురుగా తాను కట్టించిన యెహోవా బలిపీఠం+ మీద యెహోవాకు దహనబలులు+ అర్పించాడు. 13  మోషే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతను ప్రతీరోజు అర్పించాల్సిన బలుల్ని, విశ్రాంతి రోజుల్లో,+ అమావాస్య రోజుల్లో అర్పించాల్సిన బలుల్ని,+ సంవత్సరంలో మూడుసార్లు జరుపుకోవాల్సిన నియామక పండుగల్లో,+ అంటే పులవని రొట్టెల పండుగలో,+ వారాల పండుగలో,+ పర్ణశాలల* పండుగలో+ అర్పించాల్సిన బలుల్ని అర్పించాడు. 14  అంతేకాదు, అతను తన తండ్రి దావీదు పెట్టిన నియమం ప్రకారం, తమకు అప్పగించబడిన సేవల్ని చేయడానికి యాజకుల విభాగాల్ని+ నియమించాడు; అలాగే ప్రతీరోజు జరగాల్సిన పద్ధతి ప్రకారం దేవుణ్ణి స్తుతించడానికి,+ యాజకుల దగ్గర సేవ చేయడానికి లేవీయుల్ని వాళ్లవాళ్ల పనుల్లో నియమించాడు. తమతమ విభాగాల ప్రకారం ఆయా ద్వారాల దగ్గర ద్వారపాలకుల్ని నియమించాడు.+ సొలొమోను ఇదంతా సత్యదేవుని సేవకుడైన దావీదు ఆజ్ఞ ప్రకారం చేశాడు. 15  గోదాముల విషయంలో గానీ ఇంకే విషయంలో గానీ రాజు యాజకులకు, లేవీయులకు ఇచ్చిన ఆజ్ఞ నుండి వాళ్లు తప్పిపోలేదు. 16  యెహోవా మందిరం పునాది వేయబడిన రోజు+ నుండి అది పూర్తయ్యేంత వరకు సొలొమోను పనులన్నీ ఒక క్రమపద్ధతిలో జరిగాయి.* ఆ విధంగా యెహోవా మందిర నిర్మాణం పూర్తయింది. 17  అప్పుడే సొలొమోను ఎదోము దేశంలో సముద్ర తీరాన ఉన్న ఎసోన్గెబెరుకు,+ ఏలతుకు+ వెళ్లాడు. 18  హీరాము+ తన సేవకులకు ఓడల్ని, అనుభవంగల నావికుల్ని ఇచ్చి సొలొమోను దగ్గరికి పంపించాడు. వాళ్లు సొలొమోను సేవకులతోపాటు ఓఫీరుకు+ వెళ్లి, అక్కడి నుండి 450 తలాంతుల* బంగారాన్ని+ సొలొమోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు.+

అధస్సూచీలు

అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”
లేదా “తాత్కాలిక ఆశ్రయాల.”
లేదా “చక్కగా వ్యవస్థీకరించబడ్డాయి; పూర్తయ్యాయి.”
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.