దినవృత్తాంతాలు రెండో గ్రంథం 5:1-14

  • ఆలయ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు (1-14)

    • మందసాన్ని ఆలయానికి తీసుకురావడం (2-10)

5  అలా సొలొమోను యెహోవా మందిరానికి సంబంధించి చేయాల్సిన పని అంతటినీ పూర్తి చేశాడు.+ తర్వాత అతను, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన* వాటిని+ మందిరంలోకి తీసుకొచ్చాడు; అతను వెండిబంగారాల్ని, వస్తువులన్నిటినీ సత్యదేవుని మందిర ఖజానాల్లో పెట్టాడు.+  అప్పుడు సొలొమోను ఇశ్రాయేలు పెద్దల్ని, గోత్ర పెద్దలందర్నీ, ఇశ్రాయేలు పూర్వీకుల కుటుంబాల ప్రధానుల్ని సమావేశపర్చాడు. వాళ్లు దావీదు నగరం నుండి,+ అంటే సీయోను నుండి యెహోవా ఒప్పంద* మందసాన్ని తీసుకురావడానికి యెరూషలేముకు వచ్చారు.+  ఏడో నెలలో జరిగే పండుగ* సమయంలో+ ఇశ్రాయేలీయులందరూ రాజు ముందు సమావేశమయ్యారు.  అలా ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చినప్పుడు లేవీయులు మందసాన్ని ఎత్తారు.+  వాళ్లు మందసాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని,+ గుడారంలోని పవిత్ర పాత్రలన్నిటినీ తీసుకొచ్చారు. యాజకులు, లేవీయులు* వాటిని తీసుకొచ్చారు.  అప్పుడు సొలొమోను రాజు, అలాగే అతని దగ్గరికి పిలిపించబడిన ఇశ్రాయేలు సమాజమంతా మందసం ముందు ఉన్నారు. అప్పుడు లెక్కపెట్టలేనన్ని గొర్రెల్ని, పశువుల్ని బలి అర్పించారు.+  తర్వాత యాజకులు యెహోవా ఒప్పంద మందసాన్ని దాని స్థానంలోకి, అంటే మందిరంలోని అత్యంత లోపలి గది అయిన అతి పవిత్ర స్థలంలోకి తీసుకొచ్చి, కెరూబుల రెక్కల కింద ఉంచారు.+  కెరూబుల రెక్కలు మందసం మీదికి చాపబడి ఉన్నాయి. ఆ కెరూబులు మందసాన్ని, దాని కర్రల్ని+ కప్పేశాయి.  ఆ కర్రలు ఎంత పొడవుగా ఉన్నాయంటే వాటి కొనలు అత్యంత లోపలి గదికి ఎదురుగా ఉన్న పవిత్ర స్థలం నుండి కనబడేవి, కానీ బయటి నుండి కనబడేవి కావు. అవి ఈ రోజు వరకు అక్కడే ఉన్నాయి. 10  మందసంలో రెండు పలకలు తప్ప ఇంకేమీ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వస్తున్నప్పుడు,+ యెహోవా వాళ్లతో ఒప్పందం చేసిన సమయంలో,+ హోరేబు దగ్గర మోషే ఆ రెండు పలకల్ని మందసంలో ఉంచాడు.+ 11  యాజకులు పవిత్ర స్థలం నుండి బయటికి వచ్చినప్పుడు (అక్కడున్న అన్ని విభాగాల+ యాజకులు తమను తాము పవిత్రపర్చుకున్నారు),+ 12  ఆసాపుకు,+ హేమానుకు,+ యెదూతూనుకు,+ అలాగే వాళ్ల కుమారులకు, సహోదరులకు చెందిన లేవి గాయకులందరూ+ నాణ్యమైన వస్త్రాలు వేసుకొని తాళాలు, తంతివాద్యాలు, వీణలు* పట్టుకొని ఉన్నారు; వాళ్లు బలిపీఠానికి తూర్పు వైపున నిలబడివున్నారు. వాళ్లతోపాటు 120 మంది యాజకులు బాకాలు ఊదుతున్నారు.+ 13  బాకాలు ఊదేవాళ్లు, గాయకులు ఒకే స్వరంతో యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు; “ఆయన మంచివాడు; ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది”+ అని వాళ్లు యెహోవాను స్తుతిస్తున్నప్పుడు బాకాల, తాళాల, ఇతర సంగీత వాద్యాల శబ్దం మారుమోగుతోంది; అప్పుడు, యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది.+ 14  ఆ మేఘం వల్ల యాజకులు అక్కడ నిలబడి సేవ చేయలేకపోయారు, ఎందుకంటే సత్యదేవుని మందిరం యెహోవా మహిమతో నిండిపోయింది.+

అధస్సూచీలు

లేదా “పవిత్రపర్చిన.”
లేదా “నిబంధన.”
అంటే, పర్ణశాలల పండుగ.
లేదా “లేవీయులైన యాజకులు.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.