దినవృత్తాంతాలు రెండో గ్రంథం 4:1-22

  • బలిపీఠం, సముద్రం, గంగాళాలు (1-6)

  • దీపస్తంభాలు, బల్లలు, ప్రాంగణాలు (7-11ఎ)

  • ఆలయ మిగతా పనులు పూర్తవ్వడం (11బి-22)

4  తర్వాత అతను* రాగి బలిపీఠం+ చేయించాడు. దాని పొడవు 20 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 10 మూరలు.  అతను లోహంతో సముద్రం*+ పోత పోయించాడు. అది గుండ్రంగా ఉంది, అది ఒక అంచు నుండి ఇంకో అంచు వరకు 10 మూరలు ఉంది, దాని ఎత్తు 5 మూరలు, దాని చుట్టుకొలత 30 మూరలు.*+  దాని కింద, అలాగే చుట్టూరా గుండ్రటి అలంకారాలు+ ఉన్నాయి. మూరకు పది చొప్పున అవి సముద్రం చుట్టూరా ఉన్నాయి. ఆ అలంకారాలు రెండు వరుసల్లో ఉన్నాయి. అవి సముద్రంతో కలిపి పోత పోయబడ్డాయి.  ఆ సముద్రం 12 ఎద్దుల మీద ఉంది;+ 3 ఎద్దులు ఉత్తరం వైపుకు, 3 ఎద్దులు పడమటి వైపుకు, 3 ఎద్దులు దక్షిణం వైపుకు, 3 ఎద్దులు తూర్పు వైపుకు తిరిగి ఉన్నాయి; వాటిమీద సముద్రం ఉంది. ఎద్దుల వెనక భాగాలు మధ్యవైపుకు ఉన్నాయి.  సముద్రం బెత్తెడు* మందం ఉంది; దాని అంచు గిన్నె అంచులా, వికసించిన కలువ పువ్వులా చేయబడింది. ఆ జలాశయంలో 3,000 బాత్‌ కొలతల* నీళ్లు పడతాయి.  అంతేకాదు, అతను పది గంగాళాలు చేయించి కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు పెట్టించాడు.+ వాటిలోని నీళ్లతో దహనబలికి ఉపయోగించేవాటిని కడిగేవాళ్లు.+ సముద్రాన్ని మాత్రం యాజకులు కాళ్లూచేతులు కడుక్కోవడానికి ఉపయోగించేవాళ్లు.+  తర్వాత అతను, నిర్దేశించబడిన ప్రకారం+ పది బంగారు దీపస్తంభాల్ని+ చేయించి ఆలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు పెట్టించాడు.+  అతను పది బల్లల్ని కూడా చేయించాడు. అతను వాటిని ఆలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు పెట్టించాడు;+ అంతేకాదు అతను 100 బంగారు గిన్నెల్ని చేయించాడు.  తర్వాత అతను యాజకుల ప్రాంగణాన్ని,+ గొప్ప ప్రాంగణాన్ని,+ వాటి కోసం తలుపుల్ని చేయించి, ఆ తలుపుల్ని రాగి రేకుతో కప్పించాడు. 10  అతను సముద్రాన్ని కుడివైపున ఆగ్నేయ దిక్కులో  పెట్టించాడు.+ 11  హీరాము, బూడిదను ఎత్తే బాల్చీల్ని, పారల్ని, గిన్నెల్ని+ కూడా చేశాడు. అలా హీరాము సత్యదేవుని మందిరం విషయంలో సొలొమోను రాజు చేయమన్న పనిని పూర్తిచేశాడు. అతను వీటిని చేశాడు:+ 12  రెండు స్తంభాలు,+ రెండు స్తంభాల మీదున్న గుండ్రటి స్తంభ శీర్షాలు; రెండు స్తంభాల మీదున్న రెండు గుండ్రటి శీర్షాల్ని కప్పడానికి రెండు అల్లికలు;+ 13  స్తంభాల మీదున్న రెండు గుండ్రటి శీర్షాల్ని కప్పే రెండు అల్లికల్లో ఒక్కో అల్లిక కోసం రెండు వరుసల దానిమ్మ పండ్ల+ చొప్పున మొత్తం 400 దానిమ్మ పండ్లు;+ 14  పది బండ్లు,* బండ్ల మీదున్న పది గంగాళాలు;+ 15  సముద్రం, దాని కిందవున్న 12 ఎద్దులు;+ 16  బాల్చీలు, పారలు, ముళ్ల గరిటెలు,+ వాటికి సంబంధించిన పాత్రలన్నీ; యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయమన్నట్టు హూరామబీవు+ వీటిని మెరుగుపెట్టిన రాగితో చేశాడు. 17  రాజు వాటిని యొర్దాను ప్రాంతంలో సుక్కోతుకు,+ జెరేదాకు మధ్య బంకమట్టి అచ్చుల్లో పోత పోయించాడు. 18  సొలొమోను ఈ పాత్రలన్నిటినీ పెద్ద సంఖ్యలో చేయించాడు. రాగి ఎంత ఉపయోగించబడిందో తెలియలేదు.+ 19  సత్యదేవుని మందిరం కోసం సొలొమోను వీటన్నిటినీ చేయించాడు:+ బంగారు ధూపవేదిక,+ సముఖపు రొట్టెల* కోసం బల్లలు;+ 20  నియమం ప్రకారం అత్యంత లోపలి గది ఎదుట వెలిగించడానికి స్వచ్ఛమైన బంగారు దీపస్తంభాలు, వాటి దీపాలు;+ 21  బంగారంతో, అంటే అత్యంత స్వచ్ఛమైన బంగారంతో చేసిన వికసించిన పువ్వులు, దీపాలు, పట్టుకార్లు; 22  స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఒత్తులు కత్తిరించే కత్తెరలు, పాత్రలు, గిన్నెలు, నిప్పు పాత్రలు; అతను అతి పవిత్ర స్థలం తలుపుల్ని,+ ఆలయ మందిరపు* తలుపుల్ని బంగారంతో చేయించాడు.+

అధస్సూచీలు

అంటే, సొలొమోను.
లేదా “జలాశయం.”
లేదా “దాన్ని చుట్టడానికి 30 మూరల కొలనూలు పట్టింది.”
దాదాపు 7.4 సెంటీమీటర్లు (2.9 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక బాత్‌ 22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “నీటి బండ్లు.”
లేదా “సన్నిధి రొట్టెల.”
ఇది పవిత్ర స్థలాన్ని సూచిస్తోంది.