దినవృత్తాంతాలు రెండో గ్రంథం 31:1-21

  • హిజ్కియా అబద్ధ ఆరాధనను తొలగించడం (1)

  • యాజకులకు, లేవీయులకు సహాయం చేయడం (2-21)

31  పండుగ అయిపోయిన తర్వాత, అక్కడున్న ఇశ్రాయేలీయులందరూ యూదా నగరాలకు వెళ్లి, యూదా, బెన్యామీను అంతటా అలాగే ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాల్లో+ ఉన్న పూజా స్తంభాల్ని ముక్కలుముక్కలు చేశారు,+ పూజా కర్రల్ని* నరికారు;+ ఉన్నత స్థలాల్ని,+ బలిపీఠాల్ని పడగొట్టారు;+ వాటిని పూర్తిగా నాశనం చేశారు. తర్వాత ఇశ్రాయేలీయులందరూ తమతమ నగరాలకు, ఇళ్లకు తిరిగెళ్లిపోయారు.  తర్వాత యాజకుల, లేవీయుల విభాగాలు+ చేయాల్సిన సేవ ప్రకారం హిజ్కియా ఆయా విభాగాల్లో వాళ్లను నియమించాడు.+ వాళ్లు దహనబలులు, సమాధాన బలులు అర్పించడానికి, యెహోవా ప్రాంగణాల్లోని* ద్వారాల్లో పరిచారం చేయడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వాళ్లను అలా నియమించాడు.+  యెహోవా ధర్మశాస్త్రంలో రాయబడినదాని ప్రకారం దహనబలుల కోసం, అంటే ఉదయం, సాయంత్రం అర్పించాల్సిన బలులతోపాటు,+ విశ్రాంతి రోజుల్లో,+ అమావాస్య రోజుల్లో,+ పండుగ రోజుల్లో+ అర్పించాల్సిన దహనబలుల కోసం రాజు ఆస్తిలో నుండి కొంతభాగం ఇవ్వబడింది.+  అంతేకాదు, యాజకులు, లేవీయులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేలా* వాళ్లకు ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వమని అతను యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు ఆజ్ఞాపించాడు.+  ఆ ఆజ్ఞ జారీ కాగానే ఇశ్రాయేలీయులు ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో, తేనెలో, అలాగే పొలంలో పండేవాటన్నిట్లో నుండి పెద్ద ఎత్తున ప్రథమఫలాల్ని+ తెచ్చారు; వాళ్లు ప్రతీదానిలో పదోవంతును విస్తారంగా తీసుకొచ్చారు.+  యూదా నగరాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలు కూడా పశువుల్లో, గొర్రెల్లో నుండి పదోవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువుల్లో నుండి పదోవంతును+ తీసుకొచ్చారు. వాటిని తీసుకొచ్చి కుప్పలుగా వేశారు.  మూడో నెలలో+ వాళ్లు తమ విరాళాల్ని కుప్పలుగా వేయడం మొదలుపెట్టారు, ఏడో నెలలో+ దాన్ని ముగించారు.  ప్రజలు తీసుకొచ్చిన విరాళాల్ని చూసి హిజ్కియా, అధిపతులు యెహోవాను స్తుతించారు, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని దీవించారు.  ప్రజలు తెచ్చిన ఆ విరాళాల గురించి హిజ్కియా యాజకుల్ని, లేవీయుల్ని అడిగాడు, 10  అప్పుడు సాదోకు వంశస్థుడూ ముఖ్య యాజకుడూ అయిన అజర్యా ఇలా అన్నాడు: “యెహోవా మందిరంలోకి విరాళాలు తీసుకురావడం+ మొదలుపెట్టినప్పటి నుండి ప్రజలు తృప్తిగా తింటున్నారు, ఇంకా చాలా మిగిలిపోతోంది. యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదించాడు, అందుకే ఇంత పెద్ద మొత్తంలో మిగిలిపోతోంది.”+ 11  అప్పుడు హిజ్కియా, యెహోవా మందిరంలో నిల్వచేసే గదుల్ని*+ సిద్ధం చేయమని వాళ్లకు చెప్పాడు; వాళ్లు సిద్ధం చేశారు. 12  వాళ్లు విరాళాల్ని, పదోవంతుల్ని,*+ పవిత్రమైన వస్తువుల్ని మందిరంలోకి నమ్మకంగా తీసుకొస్తూ ఉన్నారు; లేవీయుడైన కొనన్యా వీటన్నిటి మీద అధికారిగా నియమించబడ్డాడు, అతని సహోదరుడైన షిమీ రెండో అధికారి. 13  హిజ్కియా రాజు కొనన్యాకు, అతని సహోదరుడు షిమీకి సహాయం చేసే అధికారులుగా యెహీయేలును, అజజ్యాను, నహతును, అశాహేలును, యెరీమోతును, యోజాబాదును, ఎలీయేలును, ఇస్మక్యాహును, మహతును, బెనాయాను నియమించాడు; అజర్యా సత్యదేవుని మందిర అధికారిగా ఉన్నాడు. 14  తూర్పు వైపున ద్వారపాలకునిగా ఉన్న లేవీయుడూ+ ఇమ్నా కుమారుడూ అయిన కోరే, సత్యదేవుని స్వేచ్ఛార్పణల+ మీద అధికారిగా ఉన్నాడు, యెహోవాకు ఇచ్చిన విరాళాల్ని,+ అతి పవిత్రమైన వస్తువుల్ని+ అతను పంచిపెట్టేవాడు. 15  అతని కింద యాజకుల నగరాల్లో+ ఏదెను, మీన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా, షెకన్యా ఉన్నారు. వీళ్లు నమ్మకస్థులు కాబట్టి చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా ఆయా విభాగాల్లో+ ఉన్న తమ సహోదరులకు సమానంగా పంచిపెట్టే బాధ్యత వీళ్లకు అప్పగించబడింది. 16  అంతేకాదు, వంశావళి పట్టికలో నమోదైనవాళ్లకు కూడా వాళ్లు పంచిపెట్టేవాళ్లు; అంటే రోజూ యెహోవా ఆలయంలో సేవచేయడానికి, తమ విభాగాల్లో పనులు చేయడానికి వచ్చే మగవాళ్లకు, అలాగే మూడేళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వాళ్ల కుమారులకు పంచిపెట్టేవాళ్లు. 17  యాజకులు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం+ వంశావళి పట్టికలో నమోదు చేయబడ్డారు; 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లేవీయులు+ తమ విభాగాల పనుల ప్రకారం+ వంశావళి పట్టికలో నమోదు చేయబడ్డారు. 18  ఆ వంశావళి పట్టికలో వాళ్ల భార్యలు, కుమారులు, కూతుళ్లు, చిన్న పిల్లలతో సహా వాళ్ల కుటుంబ సభ్యులందరూ చేర్చబడ్డారు. (పవిత్రమైన పనులు వాళ్లకు అప్పగించబడ్డాయి కాబట్టి తాము ఎప్పుడూ పవిత్రంగా ఉండేలా చూసుకునేవాళ్లు.) 19  తమ నగరాల బయట* నివసిస్తున్న అహరోను వంశస్థులైన యాజకులు+ కూడా దానిలో చేర్చబడ్డారు. యాజకుల్లో ప్రతీ పురుషునికి, లేవీయుల వంశావళి పట్టికలో చేర్చబడిన ప్రతీ ఒక్కరికి ఆహారం పంచిపెట్టడానికి నగరాలన్నిట్లో కొంతమంది నియమించబడ్డారు. 20  హిజ్కియా యూదా అంతటా అలా చేశాడు. అతను తన దేవుడైన యెహోవా దృష్టిలో మంచిది, సరైనది చేస్తూ ఆయనకు నమ్మకంగా ఉన్నాడు. 21  తన దేవుణ్ణి ఆరాధించడానికి అతను చేపట్టిన ప్రతీ పనిని, అది సత్యదేవుని మందిర సేవకు సంబంధించిందే గానీ+ ధర్మశాస్త్రానికి, ఆజ్ఞకు సంబంధించిందే గానీ అతను దాన్ని నిండు హృదయంతో చేశాడు, వాటిలో విజయం సాధించాడు.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “శిబిరాల్లోని.”
లేదా “ధర్మశాస్త్రానికి పూర్తిగా అంకితమయ్యేలా.”
లేదా “భోజనాల గదుల్ని.”
లేదా “దశమభాగాల్ని.”
అక్ష., “పచ్చికబయళ్ల పొలాల్లో.”