దినవృత్తాంతాలు రెండో గ్రంథం 29:1-36

  • హిజ్కియా, యూదా రాజు (1, 2)

  • హిజ్కియా తెచ్చిన మార్పులు (3-11)

  • ఆలయాన్ని పవిత్రపర్చడం (12-19)

  • ఆలయ సేవలు మళ్లీ ప్రారంభం (20-36)

29  హిజ్కియా+ రాజైనప్పుడు అతనికి 25 ఏళ్లు, అతను యెరూషలేములో 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, జెకర్యా కూతురైన అబీయా.+  అతను తన పూర్వీకుడైన దావీదులా+ యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు.+  అతను తన పరిపాలనలోని మొదటి సంవత్సరం, మొదటి నెలలో యెహోవా మందిరం తలుపులు తెరిపించి వాటిని బాగుచేయించాడు.+  తర్వాత అతను యాజకుల్ని, లేవీయుల్ని పిలిపించి, తూర్పున ఉన్న విశాల స్థలంలో వాళ్లను సమావేశపర్చాడు.  అతను వాళ్లతో ఇలా అన్నాడు: “లేవీయులారా, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకొని+ మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని పవిత్రపర్చండి; పవిత్ర స్థలం నుండి అపవిత్రమైనవాటిని తీసేయండి.+  మన తండ్రులు నమ్మకద్రోహానికి పాల్పడి, మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు చేశారు.+ వాళ్లు ఆయన్ని విడిచిపెట్టి యెహోవా గుడారం వైపు నుండి తమ ముఖాల్ని తిప్పేసుకున్నారు, వాళ్లు ఆయనకు తమ వీపు చూపించారు.+  అంతేకాదు వాళ్లు వసారా ద్వారాల్ని+ మూసేశారు, దీపాల్ని+ ఆర్పారు; వాళ్లు పవిత్ర స్థలంలో ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయడం,+ దహనబలులు+ అర్పించడం మానేశారు.  కాబట్టి, యెహోవా కోపం యూదా మీదికి, యెరూషలేము మీదికి వచ్చింది;+ ఆయన వాటికి చేసింది చూసి ప్రజలు భయభ్రాంతులకు, ఆశ్చర్యానికి లోనౌతున్నారు, ఎగతాళి చేస్తున్నారు.* మీరు దాన్ని కళ్లారా చూస్తున్నారు కదా?+  అందుకే మన పూర్వీకులు కత్తితో చంపబడ్డారు,+ మన కుమారులు, కూతుళ్లు, మన భార్యలు బందీలుగా వెళ్లారు.+ 10  మన మీద రగులుకున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కోపం పక్కకు మళ్లేలా ఆయనతో ఒక ఒప్పందం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.+ 11  నా కుమారులారా, ఇది నిర్లక్ష్యంగా ఉండాల్సిన* సమయం కాదు; ఎందుకంటే, తన ముందు నిలబడి తన పరిచారకులుగా సేవచేయడానికి,+ తనకు బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేయడానికి యెహోవా మిమ్మల్ని ఎంచుకున్నాడు.”+ 12  అప్పుడు లేవీయులైన వీళ్లు లేచి నిలబడ్డారు: కహాతీయుల్లో+ అమాశై కుమారుడు మహతు, అజర్యా కుమారుడు యోవేలు; మెరారీయుల్లో+ అబ్దీ కుమారుడు కీషు, యెహల్లెలేలు కుమారుడు అజర్యా; గెర్షోనీయుల్లో + జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఏదెను; 13  ఎలీషాపాను కుమారుల్లో షిమ్రీ, యెవుయేలు; ఆసాపు కుమారుల్లో+ జెకర్యా, మత్తన్యా; 14  హేమాను కుమారుల్లో+ యెహీయేలు, షిమీ; యెదూతూను+ కుమారుల్లో షెమయా, ఉజ్జీయేలు. 15  అప్పుడు వాళ్లు తమ సహోదరుల్ని సమకూర్చి, యెహోవా మాట ప్రకారం రాజు ఆజ్ఞాపించినట్టు తమను తాము పవిత్రపర్చుకొని యెహోవా మందిరాన్ని పవిత్రపర్చడానికి వచ్చారు.+ 16  తర్వాత యాజకులు యెహోవా మందిరాన్ని పవిత్రపర్చడానికి లోపలికి వెళ్లారు, వాళ్లు యెహోవా ఆలయంలో కనిపించిన అపవిత్రమైన వాటన్నిటినీ బయటికి తెచ్చి, యెహోవా మందిర ప్రాంగణం+ దగ్గర ఉంచారు. లేవీయులు వాటిని బయటికి తీసుకొచ్చి కిద్రోను లోయలో పడేశారు.+ 17  అలా వాళ్లు మొదటి నెల, మొదటి రోజున పవిత్రపర్చడం మొదలుపెట్టి, ఎనిమిదో రోజున యెహోవా మందిర వసారా+ దగ్గరికి వచ్చారు. వాళ్లు యెహోవా మందిరాన్ని ఎనిమిది రోజులపాటు పవిత్రపర్చారు, వాళ్లు మొదటి నెల 16వ రోజున ఆ పనిని పూర్తిచేశారు. 18  తర్వాత వాళ్లు హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: “మేము యెహోవా మందిరాన్నంతటినీ, దహనబలులు అర్పించే బలిపీఠాన్ని,+ దాని పాత్రలన్నిటినీ,+ సముఖపు రొట్టెల* బల్లను,+ దాని పాత్రలన్నిటినీ పవిత్రపర్చాం. 19  ఆహాజు రాజు తన పరిపాలనలో నమ్మకద్రోహానికి పాల్పడినప్పుడు పక్కన పెట్టేసిన పాత్రలన్నిటినీ+ మేము సిద్ధం చేసి పవిత్రపర్చాం,+ అవి ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు ఉన్నాయి.” 20  తర్వాత హిజ్కియా రాజు ఉదయాన్నే లేచి, నగర అధిపతుల్ని సమకూర్చాడు, వాళ్లు యెహోవా మందిరానికి వెళ్లారు. 21  వాళ్లు రాజ్యం కోసం, పవిత్రమైన స్థలం కోసం, యూదా కోసం పాపపరిహారార్థ బలిగా ఏడు ఎద్దుల్ని, ఏడు పొట్టేళ్లను, ఏడు మగ గొర్రెపిల్లల్ని, ఏడు మేకపోతుల్ని తీసుకొచ్చారు.+ వాటిని యెహోవా బలిపీఠం మీద అర్పించమని అహరోను వంశస్థులైన యాజకులకు హిజ్కియా ఆజ్ఞాపించాడు. 22  అప్పుడు వాళ్లు పశువుల్ని వధించారు,+ యాజకులు ఆ రక్తాన్ని తీసుకెళ్లి బలిపీఠం మీద చిలకరించారు;+ తర్వాత వాళ్లు పొట్టేళ్లను వధించి, వాటి రక్తాన్ని బలిపీఠం మీద చిలకరించారు; మగ గొర్రెపిల్లల్ని వధించి, వాటి రక్తాన్ని బలిపీఠం మీద చిలకరించారు. 23  తర్వాత వాళ్లు పాపపరిహారార్థ బలి మేకపోతుల్ని రాజు ఎదుటికి, సమాజం ఎదుటికి తీసుకొచ్చి, వాటిమీద చేతులు ఉంచారు. 24  యాజకులు వాటిని వధించి, పాపపరిహారార్థ బలిగా అర్పించారు. ఇశ్రాయేలీయులందరి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి వాళ్లు వాటి రక్తాన్ని బలిపీఠం మీద పోశారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులందరి కోసం దహనబలిని, పాపపరిహారార్థ బలిని అర్పించాలని రాజు ఆజ్ఞాపించాడు. 25  ఈలోగా తాళాలు, తంతివాద్యాలు, వీణలు* పట్టుకొని యెహోవా మందిరంలో నిలబడమని హిజ్కియా లేవీయులకు ఆజ్ఞాపించాడు.+ పాటలు పాడడం కోసం దావీదు, అలాగే రాజు కోసం దర్శనాలు చూసే గాదు,+ నాతాను+ ప్రవక్త ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారం+ అలా నిలబెట్టించాడు. ఆ పద్ధతిని యెహోవాయే తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. 26  కాబట్టి లేవీయులు దావీదు చేయించిన వాద్యాలతో, యాజకులు బాకాలతో+ నిలబడి ఉన్నారు. 27  తర్వాత బలిపీఠం మీద దహనబలి+ అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహనబలి అర్పించడం మొదలుపెట్టినప్పుడు, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాల్ని అనుసరిస్తూ యెహోవాకు పాట పాడడం అలాగే బాకాలు ఊదడం ప్రారంభమైంది. 28  పాట పాడుతుండగా, బాకాల శబ్దం మోగుతుండగా సమాజమంతా సాష్టాంగపడ్డారు. దహనబలి అర్పించడం పూర్తయ్యేవరకు ఇలా జరిగింది. 29  బలి అర్పించడం పూర్తవ్వగానే రాజు, అతనితోపాటు ఉన్నవాళ్లందరూ సాష్టాంగపడ్డారు. 30  అప్పుడు హిజ్కియా, అధిపతులు దావీదు కీర్తనలతో,+ దర్శనాలు చూసే ఆసాపు కీర్తనలతో+ యెహోవాను స్తుతించమని లేవీయులకు ఆజ్ఞాపించారు. వాళ్లు ఎంతో ఉల్లాసంగా కీర్తనలు పాడారు, సాష్టాంగపడ్డారు. 31  అప్పుడు హిజ్కియా ఇలా అన్నాడు: “మీరు యెహోవా కోసం ప్రత్యేకపర్చబడ్డారు కాబట్టి మీరు వచ్చి యెహోవా మందిరంలోకి బలుల్ని, కృతజ్ఞతార్పణల్ని తీసుకురండి.” దాంతో సమాజంవాళ్లు బలుల్ని, కృతజ్ఞతార్పణల్ని తీసుకురావడం మొదలుపెట్టారు; ఇవ్వాలని కోరుకున్న ప్రతీ ఒక్కరు దహనబలులు తీసుకొచ్చారు.+ 32  వాళ్లు దహనబలి కోసం 70 పశువుల్ని, 100 పొట్టేళ్లను, 200 మగ గొర్రెపిల్లల్ని తీసుకొచ్చారు. వాటన్నిటినీ యెహోవాకు దహనబలిగా తీసుకొచ్చారు.+ 33  పవిత్రమైన అర్పణలుగా 600 పశువుల్ని, 3,000 గొర్రెల్ని తీసుకొచ్చారు. 34  అయితే, దహనబలి జంతువులన్నిటి చర్మం ఒలవడానికి తగినంత మంది యాజకులు లేరు. కాబట్టి, వాళ్ల సహోదరులైన లేవీయులు ఆ పని పూర్తయి, యాజకులు తమను తాము పవిత్రపర్చుకునేంత వరకు+ వాళ్లకు సహాయం చేశారు;+ తమను తాము పవిత్రపర్చుకునే విషయంలో యాజకుల కన్నా లేవీయులు ఎంతో శ్రద్ధ చూపించారు.* 35  అంతేకాదు, అక్కడ ఎన్నో దహనబలులతో+ పాటు, సమాధాన బలుల కొవ్వు,+ దహనబలుల కోసం పానీయార్పణలు+ ఉన్నాయి. ఆ విధంగా యెహోవా మందిర సేవ మునుపటి స్థితికి తీసుకురాబడింది.* 36  సత్యదేవుడు ప్రజల కోసం చేసినదాన్నిబట్టి హిజ్కియా, అలాగే ప్రజలందరూ ఉల్లసించారు.+ ఎందుకంటే, ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది.

అధస్సూచీలు

లేదా “ఈల వేస్తున్నారు.”
లేదా “విశ్రాంతి తీసుకోవాల్సిన.”
లేదా “సన్నిధి రొట్టెల.”
ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
అక్ష., “నిజాయితీగల హృదయంతో ఉన్నారు.”
లేదా “సిద్ధం చేయబడింది.”