దినవృత్తాంతాలు రెండో గ్రంథం 28:1-27

  • ఆహాజు, యూదా రాజు (1-4)

  • సిరియా చేతిలో, ఇశ్రాయేలు చేతిలో ఓడిపోవడం (5-8)

  • ఓదేదు ఇశ్రాయేలును హెచ్చరించడం (9-15)

  • యూదా అణచివేయబడడం (16-19)

  • ఆహాజు విగ్రహపూజ; అతని మరణం (20-27)

28  ఆహాజు+ రాజైనప్పుడు అతని వయసు 20 ఏళ్లు, అతను యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతను తన పూర్వీకుడైన దావీదు చేసినట్టు యెహోవా దృష్టిలో సరైనది చేయలేదు.+  అతను ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడిచాడు,+ బయలు దేవుళ్ల పోత* విగ్రహాల్ని కూడా చేయించాడు.+  అంతేకాదు, అతను యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొట్టిన దేశాల అసహ్యమైన ఆచారాల్ని పాటిస్తూ+ బెన్‌హిన్నోము* లోయలో బలులు అర్పించి, వాటి పొగ పైకిలేచేలా చేశాడు; తన కుమారుల్ని అగ్నిలో కాల్చాడు.+  అతను ఉన్నత స్థలాల మీద,+ కొండల మీద, పచ్చని ప్రతీ చెట్టు కింద బలులు అర్పిస్తూ,+ వాటి పొగ పైకిలేచేలా చేస్తూ ఉన్నాడు.  కాబట్టి, అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించాడు.+ వాళ్లు అతన్ని ఓడించి, చాలామందిని దమస్కుకు+ బందీలుగా తీసుకెళ్లారు. దేవుడు అతన్ని ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించాడు. ఇశ్రాయేలు రాజు అతన్ని ఘోరంగా ఓడించాడు.  రెమల్యా కుమారుడైన పెకహు+ ఒక్క రోజులోనే యూదావాళ్లలో ధైర్యవంతులైన 1,20,000 మందిని చంపాడు. ఎందుకంటే వాళ్లు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు.+  ఎఫ్రాయిమీయుడైన జిఖ్రీ అనే యోధుడు రాకుమారుడైన మయశేయాను, రాజభవనాన్ని పర్యవేక్షిస్తున్న అజ్రీకామును, రాజు తర్వాతివాడైన ఎల్కానాను చంపాడు.  అంతేకాదు, ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన యూదావాళ్లలో నుండి 2,00,000 మంది స్త్రీలను, కుమారుల్ని, కూతుళ్లను బందీలుగా తీసుకెళ్లారు; వాళ్లు పెద్ద ఎత్తున దోపుడుసొమ్మును తీసుకొని సమరయకు+ వెళ్లిపోయారు.  అయితే అక్కడ ఓదేదు అనే యెహోవా ప్రవక్త ఉన్నాడు. అతను సమరయకు వస్తున్న సైన్యానికి ఎదురుగా వెళ్లి ఇలా అన్నాడు: “ఇదిగో! మీ పూర్వీకుల దేవుడైన యెహోవా యూదా మీద కోపంగా ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్లను మీ చేతికి అప్పగించాడు,+ అయితే మీరు ఆకాశాన్నంటినంత కోపంతో వాళ్లను చంపారు. 10  ఇప్పుడు మీరు యూదా, యెరూషలేము ప్రజల్ని మీ సేవకులుగా, సేవకురాళ్లుగా చేసుకోవాలనుకుంటున్నారు.+ మీరు కూడా మీ దేవుడైన యెహోవా ఎదుట అపరాధులే కదా? 11  ఇప్పుడు నా మాట విని మీ సహోదరుల్లో నుండి బందీలుగా తీసుకొచ్చినవాళ్లను వెనక్కి పంపించేయండి, ఎందుకంటే యెహోవా కోపాగ్ని మీ మీద రగులుతూ ఉంది.” 12  అప్పుడు ఎఫ్రాయిము అధిపతుల్లో కొంతమంది, అంటే యెహోహానాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయ కుమారుడైన అమాశా యుద్ధం నుండి తిరిగొస్తున్న వాళ్లను అడ్డుకుని, 13  వాళ్లతో ఇలా అన్నారు: “బందీలను ఇక్కడికి తీసుకురావద్దు, అలాచేస్తే మనం యెహోవా ఎదుట అపరాధులమౌతాం. ఇప్పటికే మన అపరాధం చాలా ఎక్కువగా ఉంది, ఇశ్రాయేలు మీద దేవుని కోపాగ్ని రగులుతూ ఉంది. మీరు మన పాపాల్ని, అపరాధాన్ని ఇంకా పెంచాలనుకుంటున్నారా?” 14  అప్పుడు సైనికులు బందీలను, దోపుడుసొమ్మును+ అధిపతులకు, సమాజమంతటికీ అప్పగించారు. 15  అప్పుడు, నియమించబడిన కొంతమంది లేచి బందీలను తీసుకెళ్లి, బట్టలులేని వాళ్లందరికీ దోపుడుసొమ్ములో నుండి బట్టలు ఇచ్చారు. వాళ్లకు బట్టలు, చెప్పులు, ఆహారం, నీళ్లు, ఒంటికి రాసుకోవడానికి నూనె ఇచ్చారు. అంతేకాదు, బలహీనంగా ఉన్నవాళ్లను గాడిదల మీద ఎక్కించి, ఖర్జూర చెట్ల నగరమైన యెరికోలోని వాళ్ల సహోదరుల దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత వాళ్లు సమరయకు తిరిగెళ్లిపోయారు. 16  ఆ సమయంలో ఆహాజు రాజు అష్షూరు రాజుల సహాయాన్ని కోరాడు.+ 17  ఎదోమీయులు మళ్లీ యూదా మీద దండెత్తి, దానిమీద దాడి చేసి బందీలను తీసుకెళ్లారు. 18  ఫిలిష్తీయులు+ కూడా యూదాకు చెందిన షెఫేలాలోని+ నగరాల మీద, నెగెబు మీద దాడులు చేసి బేత్షెమెషు,+ అయ్యాలోను,+ గెదెరోతు, శోకో, దాని చుట్టుపక్కల పట్టణాల్ని, తిమ్నా,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని, గిమ్జో, దాని చుట్టుపక్కల పట్టణాల్ని స్వాధీనం చేసుకున్నారు; తర్వాత వాళ్లు అక్కడ స్థిరపడ్డారు. 19  ఇశ్రాయేలు రాజైన ఆహాజు కారణంగా యెహోవా యూదాను అణచివేశాడు, ఎందుకంటే అతను యెహోవాకు ఎంతో నమ్మకద్రోహం చేశాడు, అతని వల్ల యూదా ప్రజలు అదుపులేకుండా ప్రవర్తించారు. 20  కొంతకాలానికి అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు+ ఆహాజు మీదికి వచ్చాడు, అతను ఆహాజుకు సహాయం చేసే బదులు అతనికి బాధ కలిగించాడు.+ 21  ఆహాజు యెహోవా ఆలయంలో, రాజభవనంలో, అధిపతుల ఇళ్లలో ఉన్నవన్నీ తీసి+ అష్షూరు రాజుకు కానుక పంపించాడు; కానీ దానివల్ల అతనికి ఏ మేలు జరగలేదు. 22  కష్టకాలంలో ఆహాజు రాజు ఇంకా ఎక్కువగా యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు. 23  తాను ఎవరి చేతుల్లోనైతే ఓడిపోయాడో ఆ దమస్కువాళ్ల దేవుళ్లకు అతను బలులు అర్పించడం మొదలుపెట్టాడు;+ “సిరియా రాజుల దేవుళ్లు వాళ్లకు సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్లు నాకు సహాయం చేసేలా నేను ఆ దేవుళ్లకు బలి అర్పిస్తాను”+ అని అతను అనుకున్నాడు. కానీ ఆ దేవుళ్ల వల్ల అతనికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ హానే జరిగింది. 24  అంతేకాదు, ఆహాజు సత్యదేవుని మందిరంలోని పాత్రల్ని పోగు చేయించాడు; తర్వాత వాటిని ముక్కలుముక్కలు చేయించి,+ యెహోవా మందిరం తలుపులు మూయించాడు,+ అతను యెరూషలేములోని అన్ని మూలల్లో తన కోసం బలిపీఠాలు కట్టించుకున్నాడు. 25  అతను యూదా నగరాలన్నిట్లో, ఇతర దేవుళ్ల కోసం బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేయడానికి ఉన్నత స్థలాలు కట్టించాడు,+ అతను తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు కోపం తెప్పించాడు. 26  అతని మిగతా చరిత్ర, అంటే మొదటి నుండి చివరి వరకు అతని వ్యవహారాలు యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడివున్నాయి. 27  తర్వాత ఆహాజు చనిపోయాడు,* అతన్ని యెరూషలేము నగరంలో పాతిపెట్టారు. కానీ అతన్ని ఇశ్రాయేలు రాజుల సమాధుల స్థలంలో పాతిపెట్టలేదు.+ అతని స్థానంలో అతని కుమారుడు హిజ్కియా రాజయ్యాడు.

అధస్సూచీలు

లేదా “లోహపు.”
అక్ష., “హిన్నోము కుమారుడి.” పదకోశంలో “గెహెన్నా” చూడండి.
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”