దినవృత్తాంతాలు రెండో గ్రంథం 2:1-18

  • ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు (1-18)

2  సొలొమోను యెహోవా పేరు కోసం ఒక మందిరాన్ని,+ తన కోసం ఒక రాజభవనాన్ని+ కట్టమని ఆదేశించాడు.  సొలొమోను 70,000 మందిని మామూలు పనివాళ్లుగా,* 80,000 మందిని పర్వతాల్లో రాళ్లు కొట్టేవాళ్లుగా,+ 3,600 మందిని వాళ్లమీద పర్యవేక్షకులుగా నియమించాడు.+  అంతేకాదు, సొలొమోను తూరు రాజైన హీరాముకు+ ఈ సందేశం పంపించాడు: “నా తండ్రైన దావీదు ఒక రాజభవనాన్ని కట్టించుకోవడానికి నువ్వు నా తండ్రికి దేవదారు మ్రానుల్ని పంపించినట్టే+ నాకు కూడా పంపించు.  నా దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించడానికి,* ఆయన ఎదుట పరిమళ ధూపం వేయడానికి,+ ఎప్పుడూ ఉంచే సముఖపు రొట్టెలు* ఉంచడానికి,+ అలాగే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం,+ విశ్రాంతి రోజుల్లో,*+ అమావాస్య రోజుల్లో,+ మా దేవుడైన యెహోవా పండుగ కాలాల్లో+ దహనబలులు అర్పించడం కోసం నేను ఆయన పేరు కోసం ఒక మందిరం కట్టిస్తాను. వీటిని చేసే బాధ్యత ఇశ్రాయేలీయులకు ఎల్లప్పుడూ ఉంది.  నేను కట్టించే మందిరం చాలా గొప్పదిగా ఉంటుంది, ఎందుకంటే మా దేవుడు ఇతర దేవుళ్లందరి కన్నా గొప్పవాడు.  ఆయన కోసం ఒక మందిరాన్ని ఎవరు కట్టగలరు? ఆకాశ మహాకాశాలే ఆయనకు సరిపోవు.+ అలాంటిది ఆయన కోసం ఒక మందిరం కట్టడానికి నేనెంతటివాణ్ణి? నేను చేయగలిగిందల్లా, ఆయన ఎదుట బలులు అర్పించి వాటి పొగ పైకిలేచేలా చేయడానికి ఒక మందిరం కట్టడమే.  బంగారంతో, వెండితో, రాగితో, ఇనుముతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు రంగు దారంతో, నీలంరంగు దారంతో పనిచేసే నైపుణ్యం ఉండి, చెక్కే పని చేయగల వ్యక్తిని నా దగ్గరికి పంపించు.+ నా తండ్రి దావీదు ఎంపిక చేసిన నైపుణ్యంగల నా పనివాళ్లతో+ కలిసి అతను యూదాలో, యెరూషలేములో పనిచేస్తాడు.  అలాగే లెబానోను నుండి దేవదారు, సరళవృక్ష,*+ చందన మ్రానుల్ని+ పంపించు. ఎందుకంటే, లెబానోను చెట్లను+ నరకడంలో నీ సేవకులకు చాలా అనుభవముందని నాకు తెలుసు. నా సేవకులు నీ సేవకులతో కలిసి పనిచేసి+  పెద్ద ఎత్తున దూలాల్ని సిద్ధం చేస్తారు. ఎందుకంటే నేను కట్టే మందిరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 10  నేను నీ సేవకులకు, మ్రానుల్ని నరికేవాళ్లకు 20,000 కొర్‌ కొలతల* గోధుమల్ని, 20,000 కొర్‌ కొలతల బార్లీని, 20,000 బాత్‌ కొలతల* ద్రాక్షారసాన్ని, 20,000 బాత్‌ కొలతల నూనెను ఆహారంగా ఇస్తాను.”+ 11  అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు ఈ సందేశం పంపించాడు: “యెహోవా తన ప్రజల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను వాళ్ల మీద రాజును చేశాడు.” 12  హీరాము ఇంకా ఇలా అన్నాడు: “ఆకాశాన్నీ భూమినీ చేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతించబడాలి; ఎందుకంటే ఆయన బుద్ధి, అవగాహన ఉన్న+ ఒక తెలివిగల కుమారుణ్ణి దావీదు రాజుకు ఇచ్చాడు,+ అతను యెహోవా కోసం ఒక మందిరాన్ని, తన కోసం ఒక రాజభవనాన్ని కడతాడు. 13  నేను నీ దగ్గరికి హూరామబీ అనే పనివాణ్ణి పంపిస్తున్నాను; అతను అవగాహన, నైపుణ్యం ఉన్నవాడు.+ 14  అతని తల్లి దాను వంశస్థురాలు, అతని తండ్రి తూరు దేశస్థుడు; అతను బంగారంతో, వెండితో, రాగితో, ఇనుముతో, రాళ్లతో, కలపతో, ఊదారంగు ఉన్నితో, నీలంరంగు దారంతో, నాణ్యమైన వస్త్రంతో, ముదురు ఎరుపు రంగు దారంతో చేసే పనుల్లో అనుభవం గలవాడు.+ అతను అన్నిరకాల చెక్కే పనులు చేయగలడు, ఏ నమూనా ఇచ్చినా చేయగలడు.+ అతను నైపుణ్యంగల నీ పనివాళ్లతో, అలాగే నా ప్రభువైన నీ తండ్రి దావీదుకు చెందిన నైపుణ్యంగల పనివాళ్లతో కలిసి పనిచేస్తాడు. 15  నా ప్రభువైన నువ్వు నీ సేవకులకు మాటిచ్చినట్టు గోధుమల్ని, బార్లీని, నూనెను, ద్రాక్షారసాన్ని పంపించు.+ 16  నీకు కావాల్సినన్ని చెట్లను మేము లెబానోనులో నరికి,+ వాటిని కలిపి కట్టించి సముద్రం మీదుగా యొప్పేకు+ తీసుకొస్తాం, అక్కడి నుండి నువ్వు వాటిని యెరూషలేముకు తీసుకెళ్లవచ్చు.”+ 17  తర్వాత సొలొమోను తన తండ్రి దావీదు చేసినట్టే+ ఇశ్రాయేలులో ఉన్న విదేశీ పురుషులందర్నీ+ లెక్కపెట్టించాడు; వాళ్లు 1,53,600 మంది ఉన్నారు. 18  అతను వాళ్లలో 70,000 మందిని మామూలు పనివాళ్లుగా,* 80,000 మందిని పర్వతాల్లో రాళ్లు కొట్టేవాళ్లుగా,+ 3,600 మందిని వాళ్ల మీద పర్యవేక్షకులుగా నియమించాడు.+

అధస్సూచీలు

లేదా “బరువులు మోసేవాళ్లుగా.”
లేదా “సబ్బాతు రోజుల్లో.”
లేదా “సన్నిధి రొట్టెలు.”
లేదా “పవిత్రపర్చడానికి.”
అంటే, జూనిపర్‌ చెట్టు.
అప్పట్లో ఒక కొర్‌ 220 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక బాత్‌ 22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “బరువులు మోసేవాళ్లుగా.”