దినవృత్తాంతాలు రెండో గ్రంథం 12:1-16

  • యెరూషలేము మీద షీషకు దాడి (1-12)

  • రెహబాము పరిపాలన ముగింపు (13-16)

12  రెహబాము రాజరికం బాగా స్థిరపడి,+ అతను బలపడగానే యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు;+ ఇశ్రాయేలు ప్రజలందరూ అలాగే చేశారు.  వాళ్లు యెహోవాకు నమ్మకద్రోహం చేశారు కాబట్టి రెహబాము రాజు పరిపాలనలోని ఐదో సంవత్సరంలో, ఐగుప్తు రాజైన షీషకు+ యెరూషలేము మీదికి వచ్చాడు.  అతను 1,200 రథాలతో, 60,000 గుర్రపురౌతులతో, అలాగే లిబియావాళ్లకు, సుక్కీమువాళ్లకు, ఇతియోపీయులకు చెందిన లెక్కలేనన్ని సైన్యాలతో ఐగుప్తు నుండి వచ్చాడు.+  అతను యూదాకు చెందిన ప్రాకారాలుగల నగరాల్ని స్వాధీనం చేసుకుంటూ చివరికి యెరూషలేము వరకు వచ్చాడు.  అప్పుడు షెమయా+ ప్రవక్త రెహబాము దగ్గరికి, షీషకుకు భయపడి యెరూషలేములో సమకూడిన యూదా అధిపతుల దగ్గరికి వచ్చి వాళ్లతో ఇలా అన్నాడు: “యెహోవా ఇలా చెప్తున్నాడు, ‘మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని షీషకు చేతికి విడిచిపెట్టాను.’ ”+  అప్పుడు ఇశ్రాయేలు అధిపతులు, రాజు తమను తాము తగ్గించుకొని,+ “యెహోవా చేసింది సరైనదే” అన్నారు.  వాళ్లు తమను తాము తగ్గించుకోవడం యెహోవా చూసినప్పుడు, యెహోవా వాక్యం షెమయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: “వాళ్లు తమను తాము తగ్గించుకున్నారు. నేను వాళ్లను నాశనం చేయను,+ త్వరలోనే వాళ్లను రక్షిస్తాను. నేను షీషకు ద్వారా యెరూషలేము మీద నా ఆగ్రహాన్ని కుమ్మరించను.  కానీ వాళ్లు అతని సేవకులౌతారు; నన్ను సేవించడానికీ, ఇతర దేశాల రాజుల్ని* సేవించడానికీ మధ్య తేడా ఏమిటో అప్పుడు వాళ్లు తెలుసుకుంటారు.”  కాబట్టి, ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చాడు. అతను యెహోవా మందిరంలోని ఖజానాల్ని,+ రాజభవనంలోని ఖజానాల్ని కొల్లగొట్టాడు. సొలొమోను చేయించిన బంగారు డాళ్లతోపాటు ప్రతీదాన్ని తీసుకెళ్లిపోయాడు.+ 10  కాబట్టి రెహబాము రాజు వాటి స్థానంలో రాగి డాళ్లను చేయించి, రాజభవన ద్వారాన్ని కాపలా కాస్తున్న కాపలాదారుల* అధిపతుల చేతికి వాటిని అప్పగించాడు. 11  రాజు యెహోవా మందిరానికి వచ్చినప్పుడల్లా కాపలాదారులు వాటిని మోసుకుంటూ అతనితోపాటు వచ్చేవాళ్లు; తర్వాత వాటిని కాపలాదారుల గదిలో తిరిగి పెట్టేవాళ్లు. 12  రాజు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యెహోవా కోపం అతని మీద నుండి మళ్లింది.+ ఆయన వాళ్లను పూర్తిగా నాశనం చేయలేదు.+ అంతేకాదు, యూదావాళ్లలో కొన్ని మంచి విషయాలు కనిపించాయి.+ 13  రెహబాము రాజు యెరూషలేములో తన స్థానాన్ని బలపర్చుకొని పరిపాలనను కొనసాగించాడు; రాజైనప్పుడు రెహబాము వయసు 41 ఏళ్లు, యెహోవా ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో తన పేరును ఉంచడానికి ఎంచుకున్న యెరూషలేము నగరంలో అతను 17 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి అమ్మోనీయురాలైన+ నయమా. 14  అయితే, రెహబాము యెహోవాను వెదకడానికి తన హృదయంలో నిశ్చయించుకోలేదు+ కాబట్టి చెడుగా ప్రవర్తించాడు. 15  రెహబాము చరిత్ర మొదటి నుండి చివరి వరకు షెమయా ప్రవక్త,+ అలాగే దర్శనాలు చూసే ఇద్దో+ రాసిన వంశావళుల పట్టికలో ఉంది. రెహబాముకూ యరొబాముకూ మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుండేవి.+ 16  తర్వాత రెహబాము చనిపోయాడు,* అతన్ని దావీదు నగరంలో+ పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు అబీయా+ రాజయ్యాడు.

అధస్సూచీలు

అక్ష., “రాజ్యాల్ని.”
అక్ష., “పరుగెత్తేవాళ్ల.”
అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”