దినవృత్తాంతాలు రెండో గ్రంథం 11:1-23

  • రెహబాము పరిపాలన (1-12)

  • విశ్వసనీయులైన లేవీయులు యూదాకు వచ్చేయడం (13-17)

  • రెహబాము కుటుంబం (18-23)

11  రెహబాము యెరూషలేముకు వచ్చిన వెంటనే యూదా, బెన్యామీను+ గోత్రాల నుండి 1,80,000 మంది శిక్షణ పొందిన* యోధుల్ని సమకూర్చాడు. రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవడం కోసం ఇశ్రాయేలువాళ్లతో యుద్ధం చేయడానికి రెహబాము అలా చేశాడు.+  అప్పుడు యెహోవా వాక్యం సత్యదేవుని సేవకుడైన షెమయా+ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “యూదా రాజైన సొలొమోను కుమారుడు రెహబాముతో, యూదాలో, బెన్యామీనులో ఉన్న ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు,  ‘యెహోవా చెప్పేదేమిటంటే: “మీరు మీ సహోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకూడదు. మీలో ప్రతీ ఒక్కరు తమ ఇళ్లకు తిరిగెళ్లిపోవాలి, ఎందుకంటే నేనే ఇలా జరిగేలా చేశాను.” ’ ”+ దాంతో వాళ్లు యెహోవా మాటకు లోబడి, తమ ఇళ్లకు వెళ్లిపోయారు. వాళ్లు యరొబాము మీదికి వెళ్లలేదు.  రెహబాము యెరూషలేములో నివసిస్తూ, యూదాలో ప్రాకారాలుగల నగరాల్ని కట్టించాడు.  అలా అతను పటిష్ఠం చేసిన నగరాలు ఏవంటే: బేత్లెహేము,+ ఏతాము, తెకోవ,+  బేత్సూరు, శోకో,+ అదుల్లాము,+  గాతు,+ మారేషా, జీఫు,+  అదోరయీము, లాకీషు,+ అజేకా,+ 10  జొర్యా, అయ్యాలోను,+ హెబ్రోను;+ ఇవి యూదాలో, బెన్యామీనులో ప్రాకారాలుగల నగరాలు. 11  అంతేకాదు, అతను ప్రాకారాలుగల నగరాల్ని పటిష్ఠం చేసి అక్కడ సైన్యాధికారుల్ని పెట్టాడు. వాళ్లకు ఆహారాన్ని, నూనెను, ద్రాక్షారసాన్ని ఏర్పాటు చేశాడు. 12  అతను ఆ నగరాలన్నిట్లో పెద్ద డాళ్లను, ఈటెల్ని ఉంచి వాటిని ఎంతో పటిష్ఠం చేశాడు. యూదా, బెన్యామీను అతని అధీనంలోనే ఉండిపోయాయి. 13  ఇశ్రాయేలు అంతటా ఉన్న యాజకులు, లేవీయులు తమ ప్రాంతాలన్నిటి నుండి వచ్చేసి రెహబాము పక్షాన నిలబడ్డారు. 14  లేవీయులు తమ పచ్చికబయళ్లను, తమ ఆస్తుల్ని+ విడిచిపెట్టి యూదాకు, యెరూషలేముకు వచ్చారు; ఎందుకంటే యరొబాము, అతని కుమారులు వాళ్లను యెహోవా యాజకులుగా సేవ చేయనివ్వకుండా వెళ్లగొట్టారు.+ 15  తర్వాత యరొబాము ఉన్నత స్థలాల కోసం, మేకల్లాంటి చెడ్డదూతల*+ కోసం, తాను చేయించిన దూడల+ కోసం సొంత యాజకుల్ని నియమించాడు.+ 16  ఇశ్రాయేలు గోత్రాలన్నిట్లో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెదకాలని తమ హృదయంలో నిశ్చయించుకున్నవాళ్లు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి యాజకులతో, లేవీయులతో పాటు యెరూషలేముకు వచ్చారు.+ 17  మూడు సంవత్సరాల పాటు వాళ్లు యూదా రాజరికాన్ని బలపర్చి సొలొమోను కుమారుడైన రెహబాముకు మద్దతిస్తూ ఉన్నారు. ఎందుకంటే మూడు సంవత్సరాల పాటు వాళ్లు దావీదు మార్గంలో, సొలొమోను మార్గంలో నడిచారు. 18  తర్వాత రెహబాము మాహలతును పెళ్లి చేసుకున్నాడు. ఆమె దావీదు కుమారుడైన యెరీమోతుకు, యెష్షయి కుమారుడైన ఏలీయాబు+ కూతురు అబీహాయిలుకు పుట్టిన కూతురు. 19  కొంతకాలం తర్వాత వాళ్లకు యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు. 20  ఆ తర్వాత రెహబాము అబ్షాలోము+ మనవరాలైన మయకాను పెళ్లిచేసుకున్నాడు. కొంతకాలానికి వాళ్లకు అబీయా,+ అత్తయి, జీజా, షెలోమీతు పుట్టారు. 21  రెహబాముకు 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు ఉన్నారు. అతనికి 28 మంది కుమారులు, 60 మంది కూతుళ్లు పుట్టారు. అయితే రెహబాము అబ్షాలోము మనవరాలైన మయకాను ఎక్కువగా ప్రేమించాడు.+ 22  అందుకే అతను మయకా కుమారుడైన అబీయాను రాజును చేయాలనుకుని అతన్ని అతని సహోదరుల మీద అధిపతిగా, నాయకునిగా నియమించాడు. 23  అయితే, రెహబాము తెలివిగా* ప్రవర్తించి తన కుమారుల్లో కొంతమందిని యూదా, బెన్యామీను ప్రాంతాలన్నిటికీ అంటే ప్రాకారాలుగల నగరాలన్నిటికీ+ పంపించాడు; వాళ్లకు కావాల్సినవి సమృద్ధిగా ఏర్పాటు చేసి, చాలామందితో  పెళ్లిళ్లు చేశాడు.

అధస్సూచీలు

అక్ష., “ఎంపిక చేయబడిన.”
అక్ష., “మేకల.” పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
లేదా “అవగాహనతో.”