రెండో థెస్సలొనీకయులు 2:1-17

  • పాపపురుషుడు (1-12)

  • స్థిరంగా ఉండమనే ప్రోత్సాహం (13-17)

2  అయితే సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షతకు,+ మనం ఆయన దగ్గరికి సమకూర్చబడడానికి+ సంబంధించి మేము మిమ్మల్ని కోరేదేమిటంటే,  యెహోవా* రోజు+ వచ్చేసిందని ఎవరైనా చెప్తే, అది ప్రవచన* రూపంలో అయినాసరే,+ మాటల రూపంలో అయినాసరే, మా నుండి వచ్చినట్టు కనిపించే ఉత్తరం రూపంలో అయినాసరే వెంటనే అయోమయంలో పడిపోకండి, భయాందోళనలకు గురికాకండి.  ఎవ్వరూ ఏ రకంగానూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా* చూసుకోండి. ఎందుకంటే, ముందు మతభ్రష్టత్వం+ పుట్టుకొచ్చి పాపపురుషుడు,+ అంటే నాశనపుత్రుడు+ బయల్పర్చబడితేనే గానీ ఆ రోజు రాదు.  ఆ పాపపురుషుడు ఒక వ్యతిరేకి. దేవుడని పిలవబడే ప్రతీదాని మీద, పూజించబడే ప్రతీ వస్తువు మీద అతను తనను తాను హెచ్చించుకుంటాడు. అలా, తానే ఒక దేవుణ్ణని అందరిముందూ చూపించుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుంటాడు.  నేను మీతో ఉన్నప్పుడు మీకు ఈ విషయాలు చెప్పేవాణ్ణని గుర్తులేదా?  ఆ పాపపురుషుడు తన సమయం వచ్చినప్పుడే బయల్పర్చబడేలా అతన్ని అడ్డుకుంటున్నది ఎవరో ఇప్పుడు మీకు తెలుసు.  నిజమే, ఆ పాపపురుషుడి దుష్టత్వం ఇప్పటికే రహస్యంగా పనిచేస్తోంది,+ అయితే అతన్ని అడ్డుకుంటున్న వ్యక్తి వెళ్లిపోయేవరకే ఆ దుష్టత్వం అలా రహస్యంగా ఉంటుంది.  ఆ తర్వాత, పాపపురుషుడు బయల్పర్చబడతాడు. యేసు ప్రభువు ప్రత్యక్షత వెల్లడైనప్పుడు+ ఆయన తన నోటి ఊపిరితో అతన్ని నాశనం చేస్తాడు.+  అయితే, పాపపురుషుడి ప్రత్యక్షత సాతాను వల్ల జరుగుతుంది.+ అతను సాతాను శక్తితోనే శక్తివంతమైన పనులు, బూటకపు సూచనలు, అద్భుతాలు,+ 10  నశించిపోతున్న వాళ్లను మోసగించే అన్నిరకాల అవినీతి పనులు+ చేస్తాడు. వాళ్లు రక్షణనిచ్చే సత్యం పట్ల బలమైన కోరికను చూపించలేదు కాబట్టి ఇదే వాళ్లకు శిక్ష. 11  వాళ్లు సత్యం పట్ల ఆసక్తి చూపించలేదు కాబట్టి, వాళ్లు అబద్ధాన్ని నమ్మేలా మోసపోవడానికి+ దేవుడు అనుమతిస్తాడు. 12  సత్యాన్ని నమ్మకుండా అవినీతిని ప్రేమించినందుకు వాళ్లందరూ తగిన తీర్పు పొందాలని దేవుడు అలా అనుమతిస్తాడు. 13  అయితే, యెహోవా* ప్రేమించే సహోదరులారా, మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మామీద ఉంది. ఎందుకంటే మీకు రక్షణ కలగాలని దేవుడు మొదటినుండి మిమ్మల్ని ఎంచుకున్నాడు.+ ఆయన తన పవిత్రశక్తితో మిమ్మల్ని పవిత్రపర్చడం ద్వారా,+ సత్యం విషయంలో మీకున్న విశ్వాసం ద్వారా అలా ఎంచుకున్నాడు. 14  మేము ప్రకటించే మంచివార్త ద్వారానే దేవుడు మిమ్మల్ని ఆ రక్షణ కోసం పిలిచాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందాలనే ఉద్దేశంతో దేవుడు అలా చేశాడు.+ 15  కాబట్టి సహోదరులారా, స్థిరంగా ఉండండి.+ నోటి మాట ద్వారా గానీ మేము రాసిన ఉత్తరం ద్వారా గానీ మీరు ఏ విషయాలైతే నేర్చుకున్నారో వాటిని ఎప్పుడూ పాటిస్తూ ఉండండి.+ 16  మన ప్రభువైన యేసుక్రీస్తు, అలాగే మనల్ని ప్రేమించి తన అపారదయతో మనకు శాశ్వతమైన ఊరటను, గొప్ప నిరీక్షణను+ ఇచ్చిన మన తండ్రైన దేవుడు 17  మీ హృదయాలకు ఊరటనివ్వాలి, మీరు ఎప్పుడూ మంచిపనులు చేసేలా, మంచిమాటలు మాట్లాడేలా మిమ్మల్ని స్థిరపర్చాలి.*

అధస్సూచీలు

అనుబంధం A5 చూడండి.
లేదా “ప్రేరేపిత సందేశం.”
లేదా “మోసగించకుండా.”
అనుబంధం A5 చూడండి.
లేదా “బలపర్చాలి.”