సమూయేలు మొదటి గ్రంథం 8:1-22

  • రాజు కావాలని ఇశ్రాయేలీయులు కోరడం (1-9)

  • సమూయేలు ప్రజల్ని హెచ్చరించడం (10-18)

  • రాజు కావాలన్న ప్రజల విన్నపాన్ని యెహోవా ఒప్పుకోవడం (19-22)

8  సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారుల్ని ఇశ్రాయేలు మీద న్యాయమూర్తులుగా నియమించాడు.  అతని మొదటి కుమారుని పేరు యోవేలు; రెండో కుమారుని పేరు అబీయా;+ వాళ్లు బెయేర్షెబాలో న్యాయమూర్తులుగా ఉండేవాళ్లు.  కానీ అతని కుమారులు అతని మార్గాల్లో నడవలేదు; వాళ్లు అక్రమ సంపాదన వైపు మొగ్గుచూపేవాళ్లు,+ లంచం తీసుకుంటూ+ న్యాయాన్ని వక్రీకరించేవాళ్లు.+  కొంతకాలానికి ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చారు.  వాళ్లు అతనితో, “ఇదిగో! నీకు వయసు మీదపడింది, కానీ నీ కుమారులు నీ మార్గాల్లో నడవడం లేదు. కాబట్టి మిగతా దేశాలన్నిటిలాగే మాకు న్యాయం తీర్చడానికి మా కోసం ఒక రాజును నియమించు” అన్నారు.+  అయితే, “మాకు న్యాయం తీర్చడానికి ఒక రాజును ఇవ్వు” అని వాళ్లు అనడం సమూయేలుకు నచ్చలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు;  యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు నీతో చెప్పే ప్రతీ మాట విను; ఎందుకంటే వాళ్లు తిరస్కరించింది నిన్ను కాదు, వాళ్లు తమ రాజుగా ఉండకుండా నన్నే తిరస్కరించారు.+  నేను వాళ్లను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు వాళ్లు ఎలా ప్రవర్తించారో ఇప్పుడూ అలాగే ప్రవర్తిస్తున్నారు; వాళ్లు నన్ను విడిచిపెడుతూ+ వేరే దేవుళ్లను సేవిస్తూ ఉంటారు,+ నీ విషయంలో కూడా వాళ్లు అలాగే ప్రవర్తిస్తున్నారు.  ఇప్పుడు వాళ్ల మాట విను. అయితే నువ్వు వాళ్లను గట్టిగా హెచ్చరించాలి; వాళ్లను పరిపాలించే రాజుకు ఏమేమి అడిగే హక్కు ఉంటుందో వాళ్లకు చెప్పు.” 10  కాబట్టి సమూయేలు, రాజు కావాలని అడుగుతున్న ప్రజలకు యెహోవా మాటలన్నీ చెప్పాడు. 11  అతను ఇలా అన్నాడు: “మిమ్మల్ని పరిపాలించే రాజుకు వీటిని అడిగే హక్కు ఉంటుంది:+ అతను మీ కుమారుల్ని తీసుకెళ్లి+ తన రథాలు నడిపేవాళ్లుగా,+ గుర్రపురౌతులుగా ఉపయోగించుకుంటాడు,+ కొందరు అతని రథాల ముందు పరుగెత్తాల్సి ఉంటుంది. 12  అతను వాళ్లను వేలమంది మీద, యాభైమంది మీద అధిపతులుగా+ నియమించుకుంటాడు. కొందరు అతని పొలాన్ని దున్నుతారు,+ అతని పంట కోస్తారు,+ అతని యుద్ధ ఆయుధాల్ని, అతని రథాల కోసం సామగ్రిని తయారుచేస్తారు.+ 13  అతను మీ కూతుళ్లను తీసుకెళ్లి లేపనాలు చేసేవాళ్లుగా,* వంటవాళ్లుగా, రొట్టెలు చేసేవాళ్లుగా ఉపయోగించుకుంటాడు.+ 14  మీ పొలాల్లో, మీ ద్రాక్షతోటల్లో, మీ ఒలీవ తోటల్లో శ్రేష్ఠమైనవాటిని తీసుకొని+ వాటిని తన సేవకులకు ఇస్తాడు. 15  అతను మీ ధాన్యం పంటలో, మీ ద్రాక్ష పంటలో పదోవంతును తీసుకొని తన ఆస్థాన అధికారులకు, తన సేవకులకు ఇస్తాడు. 16  అతను మీ సేవకుల్ని, సేవకురాళ్లను, మీ శ్రేష్ఠమైన పశువుల్ని, మీ గాడిదల్ని తీసుకొని తన పని కోసం ఉపయోగించుకుంటాడు.+ 17  అతను మీ మందల్లో పదోవంతును తీసుకుంటాడు,+ మీరు అతనికి సేవకులౌతారు. 18  మీ కోసం మీరు ఎంచుకున్న రాజు కారణంగా మీరు మొరపెట్టే రోజు వస్తుంది,+ కానీ ఆ రోజు యెహోవా మీకు జవాబివ్వడు.” 19  అయితే, ప్రజలు సమూయేలు మాటల్ని పట్టించుకోలేదు. వాళ్లు ఇలా అన్నారు: “లేదు, మాకు రాజు కావాలని మేము తీర్మానించుకున్నాం. 20  అప్పుడు మేము మిగతా దేశాలన్నిటిలా ఉంటాం, మా రాజు మాకు న్యాయం తీరుస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు, మా శత్రువులతో యుద్ధం చేస్తాడు.” 21  సమూయేలు ప్రజల మాటలన్నీ విన్న తర్వాత వాటిని యెహోవాకు చెప్పాడు. 22  యెహోవా సమూయేలుతో, “వాళ్ల మాట విను, వాళ్లను పరిపాలించడానికి ఒక రాజును నియమించు”+ అన్నాడు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీలో ప్రతీ ఒక్కరు మీ మీ నగరాలకు వెళ్లాలి” అని చెప్పాడు.

అధస్సూచీలు

లేదా “పరిమళ ద్రవ్యాలు చేసేవాళ్లుగా.”