సమూయేలు మొదటి గ్రంథం 6:1-21

  • ఫిలిష్తీయులు మందసాన్ని ఇశ్రాయేలుకు తిరిగి పంపించడం (1-21)

6  యెహోవా మందసం+ ఫిలిష్తీయుల ప్రాంతంలో ఏడు నెలలపాటు ఉంది.  అప్పుడు ఫిలిష్తీయులు యాజకుల్ని, సోదె చెప్పేవాళ్లను+ పిలిచి, “యెహోవా మందసం విషయంలో మనం ఏమి చేయాలి? మనం ఆ మందసాన్ని దాని స్థలానికి తిరిగి ఎలా పంపించాలో చెప్పండి” అని వాళ్లను అడిగారు.  దానికి వాళ్లు ఇలా అన్నారు: “మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒప్పంద మందసాన్ని పంపిస్తున్నట్లయితే, అర్పణ లేకుండా దాన్ని పంపించకండి. మీరు ఆయన దగ్గరికి అపరాధ పరిహారార్థ బలిని తప్పకుండా పంపించాలి.+ అప్పుడే మీకు నయమౌతుంది, ఆయన మిమ్మల్ని ఇంకా ఎందుకు శిక్షిస్తున్నాడో మీకు తెలియజేయబడుతుంది.”  అప్పుడు ఫిలిష్తీయులు, “ఆయన దగ్గరికి మనం ఏ అపరాధ పరిహారార్థ బలిని పంపించాలి?” అని అడిగారు. దానికి వాళ్లు ఇలా చెప్పారు: “ఫిలిష్తీయుల పాలకుల సంఖ్య ప్రకారం,+ ఐదు బంగారు మొలల్ని, ఐదు బంగారు ఎలుకల్ని పంపించండి. ఎందుకంటే ఆ తెగుళ్లే మీలో ప్రతీ ఒక్కర్ని, అలాగే మీ పాలకుల్ని బాధించాయి.  మీకు వచ్చిన మొలల బొమ్మల్ని, దేశాన్ని నాశనం చేస్తున్న మీ ఎలుకల బొమ్మల్ని మీరు తయారుచేయాలి;+ మీరు ఇశ్రాయేలు దేవుణ్ణి ఘనపర్చాలి. అలాచేస్తే ఆయన మిమ్మల్ని, మీ దేవుణ్ణి, మీ దేశాన్ని శిక్షించడం ఆపేస్తాడేమో.+  ఐగుప్తు ప్రజలు, ఫరో తమ హృదయాల్ని కఠినం చేసుకున్నట్టు+ మీరెందుకు మీ హృదయాన్ని కఠినం చేసుకుంటారు? ఆయన వాళ్లను శిక్షించినప్పుడు+ వాళ్లు ఇశ్రాయేలీయుల్ని పంపించేయాల్సి వచ్చింది, దాంతో ఇశ్రాయేలీయులు అక్కడి నుండి బయల్దేరారు.+  ఇప్పుడు మీరు ఒక కొత్త బండిని చేయించి, ఎప్పుడూ కాడి మోయని రెండు పాడి ఆవుల్ని తీసుకొచ్చి ఆ బండికి కట్టండి, కానీ వాటి దూడల్ని వాటి దగ్గర నుండి ఇంటికి తీసుకెళ్లండి.  యెహోవా మందసాన్ని ఆ బండిమీద పెట్టండి; ఆయనకు అపరాధ పరిహారార్థ బలిగా మీరు పంపిస్తున్న బంగారు వస్తువుల్ని ఒక పెట్టెలో ఉంచి, దాని పక్కన పెట్టండి.+ తర్వాత బండిని పంపించేసి  గమనిస్తూ ఉండండి. అది బేత్షెమెషుకు+ వెళ్లే దారి గుండా దాని సొంత ప్రాంతానికి వెళ్తే, ఆయన వల్లే మనకు ఇంత పెద్ద కీడు వచ్చినట్టు. అలా జరగకపోతే, ఆయన మనల్ని మొత్తలేదని, అది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని మనకు తెలుస్తుంది.” 10  అప్పుడు ప్రజలు ఆ విధంగానే చేశారు. వాళ్లు రెండు పాడి ఆవుల్ని తీసుకొని, వాటిని బండికి కట్టారు. దూడల్ని ఇంటిదగ్గరే ఉంచారు. 11  తర్వాత వాళ్లు యెహోవా మందసాన్ని, అలాగే బంగారు ఎలుకలు, తమ మొలల బొమ్మలు ఉన్న పెట్టెను బండిమీద పెట్టారు. 12  ఆ ఆవులు తిన్నగా బేత్షెమెషుకు వెళ్లే దారిలో నడిచాయి.+ అవి ‘అంబా’ అని అరుస్తూ, కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ తిరగకుండా ఒకే రహదారిలో వెళ్లాయి. ఫిలిష్తీయుల పాలకులు బేత్షెమెషు సరిహద్దు వరకు వాటి వెనకాలే నడిచారు. 13  బేత్షెమెషు ప్రజలు అప్పుడు లోయ మైదానంలో గోధుమ పంట కోస్తున్నారు. వాళ్లు తలెత్తి చూసినప్పుడు వాళ్లకు మందసం కనిపించింది. దాన్ని చూసి వాళ్లు ఎంతో సంతోషించారు. 14  ఆ బండి బేత్షెమెషుకు చెందిన యెహోషువ పొలంలోకి వచ్చి అక్కడ ఒక పెద్ద బండ దగ్గర ఆగింది. దాంతో వాళ్లు బండికున్న కర్రల్ని చీల్చి, ఆ ఆవుల్ని+ యెహోవాకు దహనబలిగా అర్పించారు. 15  లేవీయులు+ యెహోవా మందసాన్ని, బంగారు వస్తువులు ఉన్న పెట్టెను కిందికి దించి, వాటిని ఆ పెద్ద బండమీద పెట్టారు. ఆ రోజున బేత్షెమెషు+ ప్రజలు యెహోవాకు దహనబలుల్ని, వేరే బలుల్ని అర్పించారు. 16  ఫిలిష్తీయుల ఐదుగురు పాలకులు దాన్ని చూసినప్పుడు, వాళ్లు అదే రోజు ఎక్రోనుకు తిరిగొచ్చారు. 17  అపరాధ పరిహారార్థ బలిగా ఫిలిష్తీయులు యెహోవాకు పంపించిన బంగారు మొలలు ఏవంటే:+ అష్డోదు+ కోసం ఒకటి, గాజా కోసం ఒకటి, అష్కెలోను కోసం ఒకటి, గాతు+ కోసం ఒకటి, ఎక్రోను+ కోసం ఒకటి. 18  అంతేకాదు, ఆ ఐదుగురు పాలకులకు చెందిన ఫిలిష్తీయుల నగరాలన్నిటి లెక్క ప్రకారం, అంటే ప్రాకారాలుగల నగరాలతోపాటు బయట ఉన్న గ్రామాల కోసం బంగారు ఎలుకల్ని ఇచ్చారు. వాళ్లు బేత్షెమెషుకు చెందిన యెహోషువ పొలంలో యెహోవా మందసాన్ని ఉంచిన ఆ పెద్ద బండ ఈ రోజు వరకు సాక్ష్యంగా ఉంది. 19  కానీ దేవుడు బేత్షెమెషు ప్రజల్ని చంపాడు, ఎందుకంటే వాళ్లు యెహోవా మందసాన్ని తేరి చూశారు. ఆయన 50,070 మందిని* చంపాడు. యెహోవా వాళ్లను పెద్ద ఎత్తున హతం చేశాడు+ కాబట్టి ప్రజలు ఏడ్వడం మొదలుపెట్టారు. 20  బేత్షెమెషు ప్రజలు ఇలా అనుకున్నారు: “పవిత్ర దేవుడైన ఈ యెహోవా ఎదుట ఎవరు నిలవగలరు?+ ఆయన మన దగ్గర నుండి వేరేవాళ్ల దగ్గరికి వెళ్తే బావుండు!”+ 21  అప్పుడు వాళ్లు కిర్యత్యారీము+ నివాసులకు సందేశకులతో ఈ కబురు పంపించారు: “ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని వెనక్కి తీసుకొచ్చారు. మీరు వచ్చి దీన్ని మీతోపాటు తీసుకెళ్లండి.”+

అధస్సూచీలు

అక్ష., “70 మందిని, 50,000 మందిని.”