సమూయేలు మొదటి గ్రంథం 30:1-31
30 మూడో రోజు దావీదు, అతని మనుషులు సిక్లగుకు+ వచ్చారు. ఈలోగా అమాలేకీయులు+ దక్షిణ ప్రాంతాన్ని,* సిక్లగును దోచుకున్నారు. వాళ్లు సిక్లగు మీద దాడిచేసి దాన్ని అగ్నితో కాల్చేశారు.
2 చిన్నాపెద్దా అనే తేడా లేకుండా స్త్రీలతో సహా+ నగరంలో ఉన్నవాళ్లందర్నీ బందీలుగా తీసుకెళ్లారు. వాళ్లు ఎవర్నీ చంపలేదు కానీ వాళ్లను తీసుకొని తమ దారిన వెళ్లిపోయారు.
3 దావీదు, అతని మనుషులు నగరానికి వచ్చేసరికి అది కాల్చేయబడి ఉండడం, తమ భార్యలు, కుమారులు, కూతుళ్లు బందీలుగా తీసుకెళ్లబడి ఉండడం చూశారు.
4 దాంతో దావీదు, అతనితో ఉన్న మనుషులు పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టారు. ఇక ఏడ్వడానికి శక్తిలేనంత వరకు వాళ్లు ఏడ్చారు.
5 దావీదు ఇద్దరు భార్యలు, అంటే యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, చనిపోయిన కర్మెలువాసి అయిన నాబాలు భార్య అబీగయీలు కూడా బందీలుగా తీసుకెళ్లబడ్డారు.+
6 ఆ మనుషులందరూ తమ కుమారుల్ని, కూతుళ్లను కోల్పోయి ఎంతో కోపంగా ఉండడం వల్ల, వాళ్లు దావీదును రాళ్లతో కొట్టాలనుకున్నారు. కాబట్టి దావీదు ఎంతో ఆందోళనపడ్డాడు. కానీ అతను తన దేవుడైన యెహోవా సహాయంతో బలం పొందాడు.+
7 అప్పుడు దావీదు అహీమెలెకు కుమారుడూ యాజకుడూ అయిన అబ్యాతారుతో,+ “దయచేసి ఏఫోదును ఇక్కడికి తీసుకురా”+ అన్నాడు. దాంతో అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకొచ్చాడు.
8 దావీదు, “నేను ఈ దోపిడీ ముఠాను తరమనా? నేను వాళ్లను పట్టుకుంటానా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు.+ దానికి ఆయన ఇలా చెప్పాడు: “వాళ్లను తరుము, నువ్వు వాళ్లను తప్పకుండా పట్టుకుంటావు; ప్రతీదాన్ని, ప్రతీ ఒక్కర్ని రక్షిస్తావు.”+
9 దావీదు వెంటనే తనతో ఉన్న 600 మందితో+ బయల్దేరాడు, వాళ్లు బెసోరు వాగు* వరకు వెళ్లారు. కొంతమంది మనుషులు అక్కడే ఆగిపోయారు.
10 దావీదు 400 మందితో కలిసి తరుముతూ వెళ్లాడు; అయితే 200 మంది అలసిపోయి బెసోరు వాగు దాటలేక అక్కడే ఆగిపోయారు.+
11 వాళ్లకు పొలంలో ఒక ఐగుప్తీయుడు కనిపించాడు, వాళ్లు అతన్ని దావీదు దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్లు అతనికి తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు ఇచ్చారు,
12 అంతేకాదు ఒక అంజూర రొట్టె ముక్కను, రెండు ఎండుద్రాక్ష రొట్టెల్ని కూడా ఇచ్చారు. అవి తిన్నాక, అతనికి మళ్లీ బలం వచ్చింది. ఎందుకంటే అతను మూడు పగళ్లూ మూడు రాత్రులూ ఆహారం తినలేదు, నీళ్లు తాగలేదు.
13 అప్పుడు దావీదు అతన్ని, “నువ్వు ఎవరి సేవకుడివి? ఎక్కడి వాడివి?” అని అడిగాడు. దానికి అతను ఇలా చెప్పాడు: “నేను ఐగుప్తీయుణ్ణి, ఒక అమాలేకీయుడి సేవకుణ్ణి; మూడు రోజుల క్రితం నాకు ఒంట్లో బాలేకపోవడంతో నా యజమాని నన్ను వదిలేసి వెళ్లిపోయాడు.
14 మేము కెరేతీయుల+ దక్షిణ ప్రాంతాన్ని,* యూదా ప్రాంతాన్ని, కాలేబు దక్షిణ ప్రాంతాన్ని*+ దోచుకోవడానికి వెళ్లాం; సిక్లగును అగ్నితో కాల్చేశాం.”
15 అప్పుడు దావీదు అతన్ని, “ఆ దోపిడీ ముఠా దగ్గరికి నన్ను తీసుకెళ్తావా?” అని అడిగాడు. దానికి అతను, “నన్ను చంపనని, నా యజమానికి అప్పగించనని నువ్వు దేవుని మీద ఒట్టేస్తే నిన్ను ఆ దోపిడీ ముఠా దగ్గరికి తీసుకెళ్తాను” అన్నాడు.
16 దాంతో అతను దావీదును ఆ దోపిడీ ముఠా చెదిరి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. వాళ్లు ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి పెద్ద ఎత్తున దోపుడుసొమ్ము కొల్లగొట్టినందుకు తింటూ తాగుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.
17 అప్పుడు దావీదు పొద్దున్నే చీకటితో మొదలుపెట్టి తర్వాతి రోజు సాయంత్రం వరకు వాళ్లను చంపుతూ వెళ్లాడు; ఒంటెల మీద పారిపోయిన 400 మంది తప్ప ఇంకెవ్వరూ తప్పించుకోలేదు.+
18 అమాలేకీయులు దోచుకున్నవన్నీ దావీదు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.+ అతను తన ఇద్దరు భార్యల్ని రక్షించాడు.
19 వాళ్లు చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు ఏ ఒక్కర్నీ పోగొట్టుకోలేదు. వాళ్లు తమ కుమారుల్ని, కూతుళ్లను, దోపుడుసొమ్మును తిరిగి తెచ్చుకున్నారు;+ దోచుకోబడిన వాటన్నిటినీ దావీదు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
20 మందలన్నిటినీ, పశువులన్నిటినీ దావీదు దోచుకున్నాడు; వాటిని అతని మనుషులు తమ సొంత పశువులకు ముందుగా తోలుతూ, “ఇది దావీదు దోపుడుసొమ్ము” అని చెప్పారు.
21 తర్వాత దావీదు, అలసిపోయి తన వెంట రాలేక బెసోరు వాగు దగ్గర ఉండిపోయిన 200 మంది దగ్గరికి వెళ్లాడు.+ వాళ్లు దావీదును, అతనితో ఉన్న మనుషుల్ని కలవడానికి వచ్చారు. దావీదు వాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ల బాగోగులు అడిగాడు.
22 అయితే, దావీదుతో వెళ్లినవాళ్లలో ప్రతీ దుర్మార్గుడు, పనికిమాలినవాడు ఇలా అన్నాడు: “వీళ్లు మనతో రాలేదు కాబట్టి మనం తిరిగి తెచ్చుకున్న దోపుడుసొమ్ములో వీళ్లకు ఏమీ ఇవ్వం; వీళ్లలో ప్రతీ ఒక్కరు తమ భార్యల్ని, పిల్లల్ని మాత్రమే తీసుకెళ్లిపోవచ్చు.”
23 కానీ దావీదు ఇలా అన్నాడు: “నా సహోదరులారా, యెహోవా మనకు ఇచ్చినవాటితో మీరు ఇలా చేయకూడదు. ఆయన మనల్ని కాపాడి, మనమీదికి వచ్చిన దోపిడీ ముఠాను మన చేతికి అప్పగించాడు.+
24 ఈ విషయంలో మీ మాట ఎవరు వింటారు? యుద్ధానికి వెళ్లిన వ్యక్తికి వచ్చే భాగం, సామాను దగ్గర కూర్చున్న వ్యక్తికి వచ్చే భాగం ఒకేలా ఉంటుంది.+ అందరూ కలిసి పంచుకోవాలి.”+
25 ఆ రోజు నుండి అతను దాన్ని ఒక శాసనంగా చేశాడు. నేటివరకు అది ఇశ్రాయేలులో ఒక నియమంగా ఉంది.
26 దావీదు సిక్లగుకు తిరిగొచ్చినప్పుడు అతను, “యెహోవా శత్రువుల దగ్గర దోచుకున్న సొమ్ములో నుండి మీ కోసం ఒక కానుక”* అంటూ కొంత దోపుడుసొమ్మును తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు.
27 అతను కానుకను బేతేలులో+ ఉన్నవాళ్లకు, నెగెబులోని* రామోతులో ఉన్నవాళ్లకు, యత్తీరులో+ ఉన్నవాళ్లకు,
28 అరోయేరులో ఉన్నవాళ్లకు, షిప్మోతులో ఉన్నవాళ్లకు, ఎష్టెమోయలో+ ఉన్నవాళ్లకు,
29 రాకాలులో ఉన్నవాళ్లకు, యెరహ్మెయేలీయుల+ నగరాల్లో ఉన్నవాళ్లకు, కేనీయుల+ నగరాల్లో ఉన్నవాళ్లకు,
30 హోర్మాలో+ ఉన్నవాళ్లకు, బోరాషానులో ఉన్నవాళ్లకు, అతాకులో ఉన్నవాళ్లకు,
31 హెబ్రోనులో+ ఉన్నవాళ్లకు, అలాగే దావీదు, అతని మనుషులు తరచూ వెళ్లిన ప్రాంతాలన్నిట్లో ఉన్న పెద్దలకు పంపించాడు.

