సమూయేలు మొదటి గ్రంథం 3:1-21

  • సమూయేలు ఒక ప్రవక్తగా ఉండేందుకు పిలవబడడం (1-21)

3  ఈలోగా, పిల్లవాడైన సమూయేలు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు సేవచేస్తున్నాడు.+ కానీ ఆ రోజుల్లో యెహోవా వాక్యం అరుదైపోయింది; దర్శనాలు+ కూడా ఎక్కువగా వచ్చేవి కావు.  ఒకరోజు ఏలీ తన గదిలో పడుకొని ఉన్నాడు, అతనికి చూపు మందగించి, ఏమీ కనిపించట్లేదు.+  దేవుని మందిరంలోని దీపాన్ని+ ఇంకా ఆర్పేయలేదు, సమూయేలు యెహోవా ఆలయంలో*+ దేవుని మందసం* ఉన్న చోట పడుకొని ఉన్నాడు.  అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అందుకు సమూయేలు, “ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు.  అతను ఏలీ దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి, “నువ్వు పిలిచావుగా, ఇదిగో వచ్చాను” అన్నాడు. కానీ ఏలీ, “నేను పిలవలేదు. వెళ్లి పడుకో” అన్నాడు. దాంతో సమూయేలు వెళ్లి పడుకున్నాడు.  యెహోవా మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. అప్పుడు సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వచ్చి, “నువ్వు పిలిచావుగా, ఇదిగో వచ్చాను” అన్నాడు. కానీ ఏలీ, “నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు. వెళ్లి పడుకో” అన్నాడు.  (సమూయేలు అప్పటికి ఇంకా యెహోవాను పూర్తిగా తెలుసుకోలేదు, అతనికి అప్పటికి ఇంకా యెహోవా వాక్యం వెల్లడికాలేదు.)+  యెహోవా మళ్లీ మూడోసారి, “సమూయేలూ!” అని పిలిచాడు. దాంతో అతను లేచి ఏలీ దగ్గరికి వెళ్లి, “నువ్వు పిలిచావుగా, ఇదిగో వచ్చాను” అన్నాడు. ఆ పిల్లవాణ్ణి యెహోవాయే పిలుస్తున్నాడని ఏలీకి అప్పుడు అర్థమైంది.  కాబట్టి ఏలీ సమూయేలుతో ఇలా అన్నాడు: “నువ్వు వెళ్లి పడుకో, ఆయన నిన్ను పిలిస్తే, ‘చెప్పు యెహోవా, నీ సేవకుడు వింటున్నాడు’ అని అనాలి.” దాంతో సమూయేలు వెళ్లి తన స్థలంలో పడుకున్నాడు. 10  యెహోవా మళ్లీ అంతకుముందులాగే, “సమూయేలూ, సమూయేలూ!” అని పిలిచాడు. అప్పుడు సమూయేలు, “చెప్పు, నీ సేవకుడు వింటున్నాడు” అన్నాడు. 11  యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు: “ఇదిగో! నేను ఇశ్రాయేలులో ఒక పని చేయబోతున్నాను, దాని గురించి వినేవాళ్ల రెండు చెవులు గింగురుమంటాయి.+ 12  ఏలీ విషయంలో, అతని ఇంటివాళ్ల విషయంలో నేను చెప్పినవన్నీ, మొదటి నుండి చివరిదాకా ఆ రోజున నెరవేరుస్తాను.+ 13  ఈ తప్పు విషయంలో నేను అతని కుటుంబాన్ని శాశ్వతంగా శిక్షిస్తున్నానని నువ్వు ఏలీకి చెప్పాలి. తన కుమారులు దేవుణ్ణి దూషిస్తున్నారని+ తెలిసినా+ అతను వాళ్లను గద్దించలేదు.+ 14  అందుకే ఏలీ ఇంటివాళ్లు చేసిన తప్పు, బలుల వల్ల గానీ అర్పణల వల్ల గానీ ఎప్పటికీ ప్రాయశ్చిత్తం కాదని నేను ఏలీ ఇంటివాళ్లకు ప్రమాణపూర్వకంగా చెప్పాను.”+ 15  సమూయేలు ఉదయం వరకు పడుకున్నాడు; తర్వాత అతను యెహోవా మందిరం తలుపులు తెరిచాడు. సమూయేలు ఆ దర్శనం గురించి ఏలీకి చెప్పడానికి భయపడ్డాడు. 16  అయితే ఏలీ సమూయేలును, “నా కుమారుడా, సమూయేలూ!” అని పిలిచాడు. అందుకు అతను, “ఇక్కడే ఉన్నాను” అన్నాడు. 17  అప్పుడు ఏలీ, “ఆయన నీకు ఏ సందేశం చెప్పాడు? దయచేసి నా దగ్గర దాన్ని దాచొద్దు. ఆయన నీకు చెప్పినవాటిలో నువ్వు ఏ ఒక్కమాట దాచినా దేవుడు నిన్ను తీవ్రంగా శిక్షించాలి” అన్నాడు. 18  దాంతో సమూయేలు ఏదీ దాచకుండా అన్నీ ఏలీకి చెప్పాడు. అప్పుడు ఏలీ, “⁠అది యెహోవా ఇష్టం. ఆయన దృష్టికి ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు. 19  సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు; యెహోవాయే అతనికి తోడుగా ఉన్నాడు,+ ఆయన అతని మాటల్లో దేన్నీ తప్పిపోనివ్వలేదు. 20  సమూయేలు యెహోవా ప్రవక్తగా నియమించబడ్డాడని దాను నుండి బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారు. 21  యెహోవా షిలోహులో దర్శనమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా వాక్యం ద్వారా యెహోవా షిలోహులో సమూయేలుకు తన గురించి వెల్లడి చేసుకున్నాడు.+

అధస్సూచీలు

అంటే, గుడారం.
లేదా “పెద్దపెట్టె.”