సమూయేలు మొదటి గ్రంథం 29:1-11
-
ఫిలిష్తీయులు దావీదును నమ్మకపోవడం (1-11)
29 ఫిలిష్తీయులు+ తమ సైన్యాలన్నిటినీ ఆఫెకు దగ్గర సమకూర్చారు, ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని+ ఊట దగ్గర మకాం వేశారు.
2 ఫిలిష్తీయుల పాలకులు తమ వందల, వేల సైనికుల గుంపులతో ముందుకు సాగుతున్నారు. వాళ్ల వెనక దావీదు, అతని మనుషులు ఆకీషుతోపాటు ముందుకు సాగుతున్నారు.+
3 కానీ ఫిలిష్తీయుల పాలకులు, “ఈ హెబ్రీయులు ఇక్కడ ఎందుకు ఉన్నారు?” అని అడిగారు. దానికి ఆకీషు వాళ్లతో, “ఇతను దావీదు, ఇశ్రాయేలు రాజైన సౌలు సేవకుడు, ఇతను సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం నుండే నా దగ్గర ఉంటున్నాడు.+ ఇతను తన రాజు దగ్గర నుండి పారిపోయి నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నాకు ఇతనిలో ఏ తప్పూ కనబడలేదు” అన్నాడు.
4 కానీ ఫిలిష్తీయుల పాలకులు ఆకీషు మీద కోప్పడి అతనితో ఇలా అన్నారు: “ఆ మనిషిని వెనక్కి పంపించేయి.+ నువ్వు అతనికి ఇచ్చిన స్థలానికి అతన్ని వెళ్లనివ్వు. అతన్ని మనతో కలిసి యుద్ధానికి రానివ్వొద్దు; లేకపోతే యుద్ధం జరుగుతున్నప్పుడు అతను మనమీద దాడిచేస్తాడు.+ మన మనుషుల తలల్ని తన ప్రభువు దగ్గరికి తీసుకెళ్లి అతని అనుగ్రహం పొందడానికి ఇంతకన్నా మంచి మార్గం ఏముంటుంది?
5 ‘సౌలు వెయ్యిమంది శత్రువుల్ని చంపాడు,
దావీదు పదివేలమంది శత్రువుల్ని చంపాడు’అని వాళ్లు నాట్యం చేస్తూ పాడింది ఈ దావీదు గురించి కాదా?”+
6 దాంతో ఆకీషు+ దావీదును పిలిపించి ఇలా అన్నాడు: “యెహోవా జీవం తోడు, నువ్వు నిజాయితీపరుడివి, నువ్వు నా సైన్యంతో కలిసి యుద్ధానికి రావడం నాకు ఇష్టం.+ ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు నీలో నాకు ఏ తప్పూ కనిపించలేదు.+ కానీ మిగతా పాలకులకు నీ మీద నమ్మకం లేదు.+
7 కాబట్టి క్షేమంగా వెనక్కి వెళ్లు, ఫిలిష్తీయుల పాలకులకు ఇష్టంలేని ఏ పనీ చేయకు.”
8 అయితే దావీదు ఆకీషుతో, “ఎందుకు? నేనేమి చేశాను? నీ సేవకుడినైన నేను నీ దగ్గరికి వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు నాలో నీకు ఏ తప్పు కనిపించింది? నా ప్రభువైన రాజు శత్రువులతో పోరాడడానికి నేను నీతోపాటు ఎందుకు రాకూడదు?” అని అన్నాడు.
9 అప్పుడు ఆకీషు దావీదుతో ఇలా అన్నాడు: “నా దృష్టిలో నువ్వు దేవుని దూత అంత మంచివాడివి.+ కానీ ఫిలిష్తీయుల పాలకులు, ‘అతన్ని మనతో కలిసి యుద్ధానికి రానివ్వొద్దు’ అన్నారు.
10 కాబట్టి నువ్వు, నీతో వచ్చిన మనుషులు ఉదయాన్నే లేవండి. పెందలాడే లేచి, వెలుతురు రాగానే బయల్దేరి వెళ్లండి.”
11 దాంతో దావీదు, అతని మనుషులు ఫిలిష్తీయుల దేశానికి తిరిగెళ్లిపోవడానికి ఉదయాన్నే లేచారు. తర్వాత ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు+ వెళ్లారు.