సమూయేలు మొదటి గ్రంథం 27:1-12
-
ఫిలిష్తీయులు దావీదుకు సిక్లగును ఇవ్వడం (1-12)
27 అయితే, దావీదు తన హృదయంలో ఇలా అనుకున్నాడు: “ఏదోకరోజు నేను సౌలు చేతిలో చనిపోతాను. కాబట్టి నేను ఫిలిష్తీయుల దేశానికి పారిపోవడం మంచిది;+ అప్పుడు సౌలు ఇశ్రాయేలు ప్రాంతాలన్నిట్లో నా కోసం వెదకడం మానేస్తాడు,+ నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను.”
2 దాంతో దావీదు తనతో ఉన్న 600 మందితో+ బయల్దేరి, గాతు రాజూ మాయోకు కుమారుడూ అయిన ఆకీషు+ దగ్గరికి వెళ్లాడు.
3 దావీదు, అతని మనుషులు వాళ్లవాళ్ల కుటుంబాలతో గాతులో ఆకీషు దగ్గర నివసించారు. దావీదుతో అతని ఇద్దరు భార్యలు ఉన్నారు; వాళ్లు, యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, చనిపోయిన నాబాలుకు భార్యా కర్మెలువాసీ అయిన అబీగయీలు.+
4 దావీదు గాతుకు పారిపోయాడన్న వార్త సౌలుకు అందినప్పుడు, అతను దావీదు కోసం వెదకడం మానేశాడు.+
5 తర్వాత దావీదు ఆకీషుతో, “నీ దయ నా మీద ఉంటే, ఏదైనా ఒక చిన్న నగరంలో నేను నివసించేలా నాకు ఒక స్థలమివ్వు. నీ సేవకుడు నీతోపాటు రాజనగరంలో నివసించడం దేనికి?” అన్నాడు.
6 కాబట్టి ఆకీషు ఆ రోజు అతనికి సిక్లగు+ నగరాన్ని ఇచ్చాడు. అందుకే సిక్లగు నేటివరకు యూదా రాజులకు చెందుతుంది.
7 దావీదు ఫిలిష్తీయుల దేశంలో నివసించిన మొత్తం కాలం ఒక సంవత్సరం, నాలుగు నెలలు.+
8 ఆ సమయంలో దావీదు తన మనుషులతో కలిసి గెషూరీయుల్ని,+ గెజెరీయుల్ని, అమాలేకీయుల్ని+ దోచుకోవడానికి వెళ్లేవాడు. ఎందుకంటే వాళ్లు తెలెము మొదలుకొని షూరు+ వరకు, కింది వైపు ఐగుప్తు దేశం వరకు ఉన్న ప్రాంతంలో నివసించేవాళ్లు.
9 దావీదు ఆ దేశం మీద దాడిచేసినప్పుడు స్త్రీని గానీ పురుషుణ్ణి గానీ ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు.+ కానీ మందల్ని, పశువుల్ని, గాడిదల్ని, ఒంటెల్ని, బట్టల్ని దోచుకొని ఆకీషు దగ్గరికి తిరిగొచ్చేవాడు.
10 ఆకీషు, “ఈ రోజు నువ్వు ఎక్కడ దోచుకున్నావు?” అని అడిగేవాడు. దానికి దావీదు, “యూదా దక్షిణాన”*+ అని గానీ, “యెరహ్మెయేలీయుల+ ప్రాంతానికి దక్షిణాన” అని గానీ, “కేనీయుల+ ప్రాంతానికి దక్షిణాన” అని గానీ జవాబిచ్చేవాడు.
11 గాతుకు తీసుకురావాల్సి వస్తుందని దావీదు స్త్రీని గానీ పురుషుణ్ణి గానీ ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు. “ ‘దావీదు ఇలా చేశాడు’ అని వాళ్లు మన గురించి వీళ్లకు చెప్పకూడదు” అని దావీదు అనేవాడు. (ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అతను అలా చేస్తూ వచ్చాడు.)
12 కాబట్టి ఆకీషు, ‘అతను ఖచ్చితంగా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య అసహ్యకరమైన వ్యక్తి అయ్యాడు. అందుకే అతను ఎప్పటికీ నా సేవకునిగా ఉంటాడు’ అని అనుకొని దావీదును నమ్మాడు.
అధస్సూచీలు
^ లేదా “నెగెబులో.”