సమూయేలు మొదటి గ్రంథం 22:1-23

  • అదుల్లాములో, మిస్పాలో దావీదు (1-5)

  • సౌలు నోబు యాజకుల్ని చంపించడం (6-19)

  • అబ్యాతారు తప్పించుకోవడం (20-23)

22  దాంతో దావీదు అక్కడి నుండి బయల్దేరి+ అదుల్లాము గుహకు పారిపోయాడు.+ అతని సహోదరులు, అతని తండ్రి ఇంటివాళ్లందరూ అది విన్నప్పుడు, వాళ్లు అతని దగ్గరికి వచ్చారు.  కష్టాల్లో, అప్పుల్లో, బాధల్లో* ఉన్న వాళ్లందరూ అతని దగ్గరికి చేరారు; అతను వాళ్లకు అధిపతి అయ్యాడు. అతనితో దాదాపు 400 మంది ఉన్నారు.  ఆ తర్వాత దావీదు అక్కడి నుండి మోయాబులోని మిస్పేకు వెళ్లి మోయాబు+ రాజును, “దేవుడు నా విషయంలో ఏమి చేస్తాడో నాకు తెలిసేంతవరకు దయచేసి నా తల్లిదండ్రుల్ని నీ దగ్గర ఉండనివ్వు” అని అడిగాడు.  అలా దావీదు వాళ్లను మోయాబు రాజు దగ్గర ఉంచాడు. దావీదు ఒక సురక్షితమైన స్థలంలో దాక్కొని ఉన్నంతకాలం వాళ్లు ఆ రాజు దగ్గరే ఉన్నారు.+  కొంతకాలం తర్వాత గాదు+ ప్రవక్త దావీదుకు ఇలా చెప్పాడు: “నువ్వు ఆ స్థలంలో ఉండకు, అక్కడి నుండి యూదా దేశంలోకి వెళ్లు.”+ దాంతో దావీదు అక్కడి నుండి హారెతు అడవిలోకి వెళ్లాడు.  దావీదు, అతనితో ఉన్న మనుషులు కనిపించారనే విషయం సౌలు విన్నాడు. అప్పుడు సౌలు గిబియాలోని+ ఉన్నత స్థలంలో పిచుల వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. అతని చేతిలో ఈటె ఉంది. అతని సేవకులందరూ అతని చుట్టూ ఉన్నారు.  అప్పుడు సౌలు తన చుట్టూ ఉన్న తన సేవకులతో ఇలా అన్నాడు: “బెన్యామీనీయులారా, దయచేసి వినండి. యెష్షయి కుమారుడు+ కూడా మీ అందరికీ పొలాలు, ద్రాక్షతోటలు ఇస్తాడా? మీ అందర్నీ సహస్రాధిపతులుగా,* శతాధిపతులుగా* నియమిస్తాడా?+  మీరందరూ నా మీద కుట్రపన్నారు! నా సొంత కుమారుడే యెష్షయి కుమారునితో ఒప్పందం చేసుకున్నాడని+ ఎవ్వరూ నాకు చెప్పలేదు! మీలో ఒక్కరికి కూడా నా మీద సానుభూతి లేదు; నేడు జరుగుతున్నట్టు, నా కోసం మాటువేసేలా స్వయాన నా కుమారుడే నా సొంత సేవకుణ్ణి ఉసిగొల్పాడని మీలో ఎవ్వరూ నాకు చెప్పలేదు.”  అక్కడ సౌలు సేవకుల మీద అధికారిగా ఉన్న దోయేగు+ అనే ఎదోమీయుడు అప్పుడు ఇలా అన్నాడు:+ “యెష్షయి కుమారుడు నోబులో ఉన్న అహీటూబు కుమారుడైన అహీమెలెకు+ దగ్గరికి రావడం నేను చూశాను. 10  అహీమెలెకు అతని తరఫున యెహోవా దగ్గర విచారణ చేశాడు, అతనికి ఆహారం పెట్టాడు, ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తిని కూడా ఇచ్చాడు.”+ 11  వెంటనే సౌలు, యాజకుడైన అహీటూబు కుమారుడైన అహీమెలెకును, నోబులో ఉన్న అతని తండ్రి కుటుంబంలోని యాజకులందర్నీ పిలవడానికి మనుషుల్ని పంపించాడు. వాళ్లందరూ రాజు దగ్గరికి వచ్చారు. 12  అప్పుడు సౌలు, “అహీటూబు కుమారుడా, దయచేసి విను!” అన్నాడు. దానికి అతను, “చెప్పు, ప్రభూ” అన్నాడు. 13  సౌలు అతనితో, “నువ్వు యెష్షయి కుమారునికి రొట్టెల్ని, కత్తిని ఇచ్చి, అతని తరఫున దేవుని దగ్గర విచారణ చేసి, నువ్వూ అతనూ నా మీద ఎందుకు కుట్రపన్నారు? నేడు జరుగుతున్నట్టు, అతను నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నా కోసం మాటువేశాడు” అని అన్నాడు. 14  దానికి అహీమెలెకు రాజుతో ఇలా అన్నాడు: “నీ సేవకులందరిలో దావీదు అంత నమ్మదగినవాళ్లు* ఎవరు ఉన్నారు?+ అతను రాజు అల్లుడు,+ నీ అంగరక్షకులకు అధిపతి, నీ ఇంట్లో గౌరవించబడే వ్యక్తి.+ 15  నేను అతని తరఫున దేవుని దగ్గర విచారణ చేయడం ఇదే మొదటిసారా?+ నీ మీద కుట్రపన్నడం నా ఊహకందని విషయం! నీ సేవకుడినైన నా మీద, నా తండ్రి ఇంటివాళ్ల మీద ఏ నేరం మోపవద్దు. ఎందుకంటే, నీ సేవకునికి వీటిలో ఏ ఒక్కటీ తెలీదు.”+ 16  కానీ సౌలు రాజు ఇలా అన్నాడు: “అహీమెలెకూ, నువ్వు ఖచ్చితంగా చనిపోతావు,+ నువ్వూ, నీ తండ్రి ఇంటివాళ్లందరూ చనిపోతారు.”+ 17  అప్పుడు రాజు తన చుట్టూ ఉన్న కాపలావాళ్లతో,* “మీరు వెళ్లి యెహోవా యాజకుల్ని చంపండి. ఎందుకంటే వాళ్లు దావీదుతో చేతులు కలిపారు! అతను పారిపోతున్నాడని వాళ్లకు తెలిసినా నాకు చెప్పలేదు!” అన్నాడు. కానీ రాజు సేవకులు యెహోవా యాజకుల్ని చంపడానికి తమ చెయ్యి ఎత్తాలనుకోలేదు. 18  తర్వాత రాజు దోయేగుతో,+ “నువ్వు వెళ్లి యాజకుల్ని చంపు!” అన్నాడు. వెంటనే ఎదోమీయుడైన+ దోయేగు వెళ్లి తానే స్వయంగా ఆ యాజకుల్ని చంపాడు. ఆ రోజున అతను నార ఏఫోదు వేసుకున్న 85 మందిని చంపాడు.+ 19  అతను యాజకుల నగరమైన నోబులో+ ఉన్నవాళ్లను కూడా కత్తితో చంపాడు; పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని, చంటిబిడ్డల్ని, ఎద్దుల్ని, గాడిదల్ని, గొర్రెల్ని కత్తితో చంపాడు. 20  అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారుల్లో ఒకడైన అబ్యాతారు+ తప్పించుకొని, దావీదును అనుసరించడానికి పారిపోయాడు. 21  అబ్యాతారు దావీదుతో, “సౌలు యెహోవా యాజకుల్ని చంపాడు” అని చెప్పాడు. 22  అప్పుడు దావీదు అబ్యాతారుతో ఇలా అన్నాడు: “ఎదోమీయుడైన దోయేగును అక్కడ చూసినప్పుడు, అతను తప్పకుండా సౌలుకు చెప్తాడని నాకు ఆ రోజే తెలుసు.+ నీ తండ్రి ఇంట్లో ప్రతీ ఒక్కరి చావుకు నేనే బాధ్యుణ్ణి. 23  నువ్వు నాతో ఉండు. భయపడకు, నీ ప్రాణం తీయాలని చూసేవాళ్లు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు; నువ్వు నా కాపుదలలో ఉన్నావు.”+

అధస్సూచీలు

లేదా “తమ జీవితంతో అసంతృప్తిగా.”
అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
లేదా “నమ్మకమైనవాళ్లు.”
అక్ష., “పరుగెత్తేవాళ్లతో.”