సమూయేలు మొదటి గ్రంథం 17:1-58

  • దావీదు గొల్యాతును ఓడించడం (1-58)

    • గొల్యాతు ఇశ్రాయేలీయుల్ని సవాలు చేయడం (8-10)

    • దావీదు ఆ సవాలును స్వీకరించడం (32-37)

    • దావీదు యెహోవా పేరున పోరాడడం (45-47)

17  తర్వాత ఫిలిష్తీయులు+ యుద్ధం చేయడానికి తమ సైన్యాల్ని పోగుచేశారు. వాళ్లు యూదాకు చెందిన శోకోలో+ సమకూడి శోకో, అజేకా+ మధ్య ఏఫెస్దమ్మీములో+ మకాం వేశారు.  సౌలు, ఇశ్రాయేలీయులు సమకూడి, ఏలా లోయలో+ మకాం వేశారు. వాళ్లు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి యుద్ధ పంక్తులు తీరారు.  పర్వతానికి ఒకవైపు ఫిలిష్తీయులు, ఇంకోవైపు ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాళ్ల మధ్య లోయ ఉంది.  అప్పుడు ఫిలిష్తీయుల శిబిరాల్లో నుండి వాళ్ల తరఫున ఒక యోధుడు బయటికి వచ్చాడు; అతని పేరు గొల్యాతు,+ అతను గాతుకు+ చెందినవాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన.*  అతని తలమీద రాగి శిరస్త్రాణం* ఉంది. అతను పొలుసులుగల ఒక కవచం వేసుకొని ఉన్నాడు. అతను వేసుకున్న రాగి కవచం+ బరువు 5,000 షెకెల్‌లు.*  అతను కాళ్లకు రాగి తొడుగులు వేసుకున్నాడు, అతని భుజాల మధ్య చిన్న రాగి ఈటె+ వేలాడుతూ ఉంది.  అతని ఈటెకు ఉన్న కర్ర నేత నేసేవాళ్ల కర్రంత పెద్దగా ఉంది,+ అతని ఈటె కొన ఇనుపది, దాని బరువు 600 షెకెల్‌లు;* అతని డాలును మోస్తున్న వ్యక్తి అతని ముందు నడుస్తున్నాడు.  అతను నిలబడి, ఇశ్రాయేలు సైనికుల్ని గట్టిగా పిలుస్తూ+ ఇలా అన్నాడు: “మీరు యుద్ధ పంక్తులు తీరడానికి ఎందుకు వచ్చారు? నేను ఫిలిష్తీయుణ్ణి కాదా, మీరు సౌలు సేవకులు కారా? నాతో పోరాడడానికి మీ తరఫున ఇప్పుడు ఒక వ్యక్తిని ఎంచుకుని అతన్ని నా మీదికి పంపించండి.  అతను నాతో పోరాడి నన్ను చంపగలిగితే, మేము మీకు సేవకులమౌతాం. కానీ నేను అతన్ని ఓడించి అతన్ని చంపితే, మీరు మా సేవకులై మాకు సేవచేస్తారు.” 10  తర్వాత ఆ ఫిలిష్తీయుడు ఇలా అన్నాడు: “నేను ఈ రోజు ఇశ్రాయేలు సైనికుల్ని సవాలు చేస్తున్నాను.*+ ఒక మనిషిని పంపించండి, మేమిద్దరం తలపడతాం!” 11  ఫిలిష్తీయుడు అన్న మాటలు విన్నప్పుడు సౌలు, ఇశ్రాయేలీయులందరూ హడలిపోయారు, చాలా భయపడ్డారు. 12  దావీదు, యూదా బేత్లెహేముకు+ చెందిన ఎఫ్రాతీయుడైన+ యెష్షయి+ కుమారుడు. యెష్షయికి ఎనిమిది మంది కుమారులు.+ సౌలు రాజుగా ఉన్నప్పుడు యెష్షయి వృద్ధుడు. 13  యెష్షయి పెద్ద కుమారులు ముగ్గురు సౌలు వెంట యుద్ధానికి వెళ్లారు.+ పెద్దవాడి పేరు ఏలీయాబు,+ రెండోవాడి పేరు అబీనాదాబు,+ మూడోవాడి పేరు షమ్మా.+ 14  దావీదు అందరికన్నా చిన్నవాడు,+ పెద్దవాళ్లు ముగ్గురూ సౌలు వెంట వెళ్లారు. 15  దావీదు బేత్లెహేములోని తన తండ్రి గొర్రెల్ని కాయడానికి+ సౌలు దగ్గర నుండి వచ్చి వెళ్తుండేవాడు. 16  అయితే, ఆ ఫిలిష్తీయుడు 40 రోజులపాటు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వచ్చి ఇశ్రాయేలీయుల ముందు నిలబడుతూ ఉన్నాడు. 17  అప్పుడు యెష్షయి తన కుమారుడు దావీదుకు ఇలా చెప్పాడు: “వేయించిన ఈ ఈఫా* ధాన్యాన్ని, ఈ పది రొట్టెల్ని తీసుకొని దయచేసి శిబిరంలోని నీ అన్నల దగ్గరికి త్వరగా వెళ్లు. 18  వాళ్ల సహస్రాధిపతికి* ఈ పది జున్ను ముక్కలు తీసుకెళ్లు; అంతేకాదు, నీ అన్నలు ఎలా ఉన్నారో తెలుసుకొని వాళ్ల దగ్గర నుండి ఏదో ఒక గుర్తు తీసుకురా.” 19  అతని అన్నలు సౌలుతో, మిగతా ఇశ్రాయేలీయులందరితో పాటు ఏలా లోయలో+ ఫిలిష్తీయులతో పోరాడుతున్నారు.+ 20  అప్పుడు దావీదు ఉదయాన్నే లేచి, గొర్రెల్ని ఒకతనికి అప్పగించి, యెష్షయి తనకు ఆజ్ఞాపించినట్టే వస్తువుల్ని సర్దుకొని బయల్దేరాడు. అతను శిబిరం దగ్గరికి వచ్చేసరికి సైన్యం యుద్ధకేకలు వేస్తూ యుద్ధభూమికి వెళ్తోంది. 21  ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు ఎదురెదురుగా యుద్ధ పంక్తులు తీరారు. 22  దావీదు వెంటనే తన వస్తువుల్ని సామాను చూసుకునే వ్యక్తికి అప్పగించి యుద్ధభూమికి పరుగులు తీశాడు. అతను అక్కడికి వెళ్లాక, తన అన్నలు ఎలా ఉన్నారో అడిగాడు.+ 23  దావీదు వాళ్లతో మాట్లాడుతుండగా, గాతుకు చెందిన ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే యోధుడు+ వచ్చాడు. అతను ఫిలిష్తీయుల సైనిక శిబిరం నుండి బయటికి వచ్చి ముందులాగే మాట్లాడాడు,+ దావీదు ఆ మాటలు విన్నాడు. 24  ఇశ్రాయేలీయులందరూ అతన్ని చూసి భయపడి,+ అతని దగ్గర నుండి పారిపోయారు. 25  ఇశ్రాయేలీయులు ఇలా మాట్లాడుకున్నారు: “ఆ వచ్చే వ్యక్తిని చూశారా? అతను ఇశ్రాయేలీయుల్ని సవాలు చేయడానికి*+ వస్తున్నాడు. అతన్ని చంపే వ్యక్తికి రాజు గొప్ప సంపదలు ఇస్తాడు, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి కూడా చేస్తాడు,+ అతని తండ్రి ఇంటివాళ్లకు పన్నులు, సేవల నుండి మినహాయింపు ఇస్తాడు.” 26  దావీదు తన దగ్గర నిలబడివున్నవాళ్లను ఇలా అడగడం మొదలుపెట్టాడు: “అక్కడున్న ఆ ఫిలిష్తీయుణ్ణి చంపి, ఇశ్రాయేలు మీద నుండి అవమానాన్ని తీసేసే వ్యక్తికి ఏమి ఇస్తారు? జీవంగల దేవుని సైన్యాన్ని సవాలు చేయడానికి* ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎవడు?”+ 27  అప్పుడు ప్రజలు, “అతన్ని చంపే వ్యక్తికి ఇలా చేస్తారు” అని అంతకుముందు చెప్పిందే అతనికి చెప్పారు. 28  దావీదు వాళ్లతో మాట్లాడడం అతని పెద్దన్న ఏలీయాబు+ విన్నప్పుడు, అతనికి దావీదు మీద కోపం వచ్చి ఇలా అన్నాడు: “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎడారిలోని ఆ కొన్ని గొర్రెల్ని ఎవరికి అప్పగించావు?+ నీ అహంకారం, నీ హృదయంలోని చెడు ఉద్దేశాలు నాకు బాగా తెలుసు; యుద్ధం చూడడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు.” 29  దానికి దావీదు, “నేను ఇప్పుడు ఏమి చేశాను? నేను ఒక ప్రశ్నేగా అడుగుతున్నాను!” అన్నాడు. 30  అప్పుడు దావీదు అతని దగ్గర నుండి ఇంకొకరి దగ్గరికి వెళ్లి మళ్లీ అదే ప్రశ్న అడిగాడు,+ ప్రజలు అంతకుముందు ఇచ్చిన జవాబే ఇచ్చారు.+ 31  దావీదు మాటల్ని విన్న కొంతమంది వాటిని సౌలుకు తెలియజేశారు. దాంతో సౌలు దావీదును పిలిపించాడు. 32  దావీదు సౌలుతో ఇలా అన్నాడు: “అతన్ని బట్టి ఎవ్వరూ ధైర్యం కోల్పోవద్దు, నీ సేవకుడినైన నేను వెళ్లి ఆ ఫిలిష్తీయునితో పోరాడతాను.”+ 33  కానీ సౌలు దావీదుతో, “నువ్వు ఆ ఫిలిష్తీయునితో పోరాడలేవు, నువ్వు కేవలం బాలుడివి,+ అతను చిన్నప్పటి నుండే యుద్ధ వీరుడు”* అని అన్నాడు. 34  అప్పుడు దావీదు సౌలుతో ఇలా అన్నాడు: “నీ సేవకుడినైన నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు ఒకసారి సింహం,+ ఇంకోసారి ఎలుగుబంటి వచ్చి మంద నుండి ఒక గొర్రెను ఎత్తుకెళ్లాయి. 35  నేను వాటి వెంటబడి, వాటిని కొట్టి, వాటి నోటి నుండి గొర్రెను రక్షించాను. అవి నా మీదికి లేచినప్పుడు, నేను వాటి దవడ పట్టుకొని వాటిని కొట్టి చంపాను. 36  నీ సేవకుడు సింహాన్ని, ఎలుగుబంటిని రెండిటినీ చంపాడు. సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు కూడా వాటిలాగే అవుతాడు. ఎందుకంటే అతను జీవంగల దేవుని సైన్యాల్ని సవాలు చేశాడు.”*+ 37  దావీదు ఇంకా ఇలా అన్నాడు: “సింహం, ఎలుగుబంటి పంజాల నుండి నన్ను రక్షించిన యెహోవా ఆ ఫిలిష్తీయుని చేతి నుండి కూడా నన్ను రక్షిస్తాడు.”+ అప్పుడు సౌలు దావీదుతో, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉండాలి” అన్నాడు. 38  తర్వాత సౌలు తన యుద్ధ వస్త్రాల్ని దావీదుకు వేశాడు. అతని తలమీద రాగి శిరస్త్రాణం పెట్టాడు, తర్వాత అతనికి కవచం ధరింపజేశాడు. 39  దావీదు తన వస్త్రాల మీద కత్తి కట్టుకొని వెళ్లడానికి ప్రయత్నించాడు కానీ అలవాటు లేక నడవలేకపోయాడు. అప్పుడు దావీదు సౌలుతో, “నేను వీటితో కదల్లేకపోతున్నాను. ఇవి నాకు అలవాటు లేదు” అన్నాడు. అందుకే దావీదు వాటిని తీసేశాడు. 40  తర్వాత అతను తన చేతికర్రను తీసుకున్నాడు. వాగులో నుండి ఐదు నున్నటి రాళ్లను ఏరుకొని వాటిని తన కాపరి సంచి జేబులో పెట్టుకున్నాడు; అతని వడిసెల+ అతని చేతిలో ఉంది. అతను ఫిలిష్తీయుని వైపు వెళ్లడం మొదలుపెట్టాడు. 41  ఆ ఫిలిష్తీయుడు దావీదుకు దగ్గరగా వస్తున్నాడు, అతని డాలును మోసే వ్యక్తి అతని ముందు నడుస్తున్నాడు. 42  ఫిలిష్తీయుడు దావీదును చూసినప్పుడు, అతను కేవలం ఎర్రగా, అందంగా ఉన్న బాలుడు+ మాత్రమేనని అతన్ని చిన్నచూపు చూసి, ఎగతాళి చేశాడు. 43  ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నేనేమైనా కుక్కనా,+ కర్ర పట్టుకొని నా మీదికి వస్తున్నావు?” అన్నాడు. తర్వాత ఆ ఫిలిష్తీయుడు తన దేవుళ్ల పేరున దావీదును శపించాడు. 44  అప్పుడు అతను దావీదుతో, “రా, నీ మాంసాన్ని ఆకాశపక్షులకు, భూ జంతువులకు ఆహారంగా వేస్తాను” అన్నాడు. 45  అందుకు దావీదు ఫిలిష్తీయునితో ఇలా అన్నాడు: “నువ్వు కత్తితో, ఈటెతో, చిన్న ఈటెతో నా మీదికి వస్తున్నావు;+ కానీ నేను, నువ్వు సవాలు చేసిన* ఇశ్రాయేలు సైన్యాల దేవుని పేరున,+ అంటే సైన్యాలకు అధిపతైన యెహోవా పేరున నీ మీదికి వస్తున్నాను.+ 46  ఈ రోజే యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు.+ నేను నిన్ను చంపి నీ తల నరికేస్తాను; ఈ రోజు నేను ఫిలిష్తీయుల శిబిరంలోనివాళ్ల శవాల్ని ఆకాశపక్షులకు, భూ జంతువులకు ఆహారంగా వేస్తాను; అప్పుడు ఇశ్రాయేలులో ఒక దేవుడు ఉన్నాడని భూమ్మీది ప్రజలందరూ తెలుసుకుంటారు.+ 47  యెహోవా రక్షించేది కత్తితోనో, ఈటెతోనో కాదని+ ఇక్కడికి వచ్చినవాళ్లందరూ తెలుసుకుంటారు. ఎందుకంటే యుద్ధం యెహోవాది.+ ఆయన మీ అందర్నీ మా చేతికి అప్పగిస్తాడు.”+ 48  అప్పుడు ఫిలిష్తీయుడు లేచి దావీదుతో తలపడడానికి ఒక్కో అడుగు ముందుకు వేయసాగాడు, అయితే దావీదు ఫిలిష్తీయునితో తలపడడానికి వేగంగా యుద్ధభూమి వైపు పరుగులు తీశాడు. 49  దావీదు తన సంచిలో చెయ్యి పెట్టి, ఒక రాయి తీసి వడిసెలతో విసిరి ఫిలిష్తీయుని నుదుటి మీద కొట్టాడు; ఆ రాయి అతని నుదుటిలోకి దిగిపోవడంతో అతను నేలమీద బోర్లా పడ్డాడు.+ 50  అలా దావీదు ఒక వడిసెలతో, ఒక రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు; చేతిలో కత్తి లేకుండానే+ దావీదు ఫిలిష్తీయుణ్ణి చంపాడు. 51  దావీదు పరుగెత్తుకుంటూ వెళ్లి అతని మీద నిలబడ్డాడు. తర్వాత అతను ఫిలిష్తీయుని కత్తి+ పట్టుకొని దాన్ని ఒర నుండి బయటికి లాగి, దానితో అతని తలను నరికి అతను చనిపోయాడని నిర్ధారించుకున్నాడు. తమ వీరుడు చనిపోవడం చూసి ఫిలిష్తీయులు పారిపోయారు.+ 52  అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యూదావాళ్లు లేచి పెద్దగా కేకలు వేస్తూ లోయ+ నుండి ఎక్రోను+ ద్వారాల వరకు ఫిలిష్తీయుల్ని తరిమారు. చంపబడిన ఫిలిష్తీయుల శవాలు షరాయిము+ నుండి గాతు, ఎక్రోను వరకు దారి పొడవునా పడివున్నాయి. 53  ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల్ని తీవ్రంగా తరిమి, వెనక్కి వచ్చి వాళ్ల శిబిరాల్ని దోచుకున్నారు. 54  తర్వాత దావీదు ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకొచ్చాడు. కానీ ఆ ఫిలిష్తీయుని ఆయుధాల్ని తన సొంత డేరాలో పెట్టుకున్నాడు.+ 55  ఫిలిష్తీయునితో తలపడడానికి దావీదు వెళ్లడం చూసిన క్షణంలో, సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును,+ “అబ్నేరూ, ఇతను ఎవరి కుమారుడు?”+ అని అడిగాడు. దానికి అబ్నేరు, “రాజా, నీ జీవం తోడు, నాకు తెలీదు!” అన్నాడు. 56  అప్పుడు రాజు, “ఈ అబ్బాయి ఎవరి కుమారుడో కనుక్కో” అని చెప్పాడు. 57  దావీదు ఫిలిష్తీయుణ్ణి చంపి తిరిగొచ్చిన వెంటనే అబ్నేరు అతన్ని వెంటబెట్టుకొని సౌలు ముందుకు తీసుకొచ్చాడు. అప్పుడు దావీదు ఫిలిష్తీయుని తలను పట్టుకొని ఉన్నాడు.+ 58  అప్పుడు సౌలు, “బాబూ, నువ్వు ఎవరి కుమారుడివి?” అని అడిగాడు. దానికి దావీదు, “బేత్లెహేముకు చెందిన+ నీ సేవకుడైన యెష్షయి+ కుమారుణ్ణి” అన్నాడు.

అధస్సూచీలు

అతని ఎత్తు దాదాపు 2.9 మీటర్లు (9 అడుగుల 5.75 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
అంటే, హెల్మెట్‌.
దాదాపు 57 కిలోలు. అనుబంధం B14 చూడండి.
దాదాపు 6.84 కిలోలు. అనుబంధం B14 చూడండి.
లేదా “నిందిస్తున్నాను; హేళన చేస్తున్నాను.”
దాదాపు 22 లీటర్లు (13 కిలోలు). అనుబంధం B14 చూడండి.
అంటే, 1,000 మంది మీద అధిపతి.
లేదా “నిందించడానికి; హేళన చేయడానికి.”
లేదా “నిందించడానికి; హేళన చేయడానికి.”
లేదా “సైనికుడు.”
లేదా “నిందించాడు; హేళన చేశాడు.”
లేదా “నిందించిన; హేళన చేసిన.”