సమూయేలు మొదటి గ్రంథం 11:1-15

  • సౌలు అమ్మోనీయుల్ని ఓడించడం (1-11)

  • సౌలును మళ్లీ రాజుగా ప్రకటించడం (12-15)

11  తర్వాత అమ్మోనీయుడైన+ నాహాషు వచ్చి గిలాదులోని యాబేషుకు+ ఎదురుగా మకాం వేశాడు. అప్పుడు యాబేషు వాళ్లందరూ నాహాషుతో, “మాతో ఒప్పందం చేసుకో, మేము నీకు సేవ చేస్తాం” అన్నారు.  అమ్మోనీయుడైన నాహాషు వాళ్లతో, “నేను ఒక షరతు మీద మీతో ఒప్పందం చేసుకుంటాను. నేను మీ అందరి కుడి కళ్లను పీకేస్తాను. ఇశ్రాయేలీయులందర్నీ అవమానించడానికి నేనలా చేస్తాను” అన్నాడు.  అప్పుడు యాబేషు పెద్దలు అతనితో ఇలా అన్నారు: “మేము ఇశ్రాయేలు ప్రాంతమంతటికీ సందేశకుల్ని పంపించేలా మాకు ఏడురోజులు గడువు ఇవ్వు. ఒకవేళ మమ్మల్ని రక్షించేవాళ్లెవ్వరూ లేకపోతే మేము నీకు లొంగిపోతాం.”  కొన్ని రోజులకు ఆ సందేశకులు సౌలు సొంత ఊరైన గిబియాకు+ వచ్చి ప్రజలతో ఆ మాటలు చెప్పారు. దాంతో ప్రజలందరూ పెద్దగా ఏడ్చారు.  అయితే సౌలు పశువుల్ని తోలుకుంటూ పొలం నుండి వస్తున్నాడు. అతను, “ఈ ప్రజలకు ఏమైంది? వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. వాళ్లు యాబేషువాళ్ల మాటల్ని అతనికి చెప్పారు.  అతను ఆ మాటలు విన్నప్పుడు దేవుని పవిత్రశక్తి అతని మీదికి వచ్చింది,+ అప్పుడు అతను కోపంతో రగిలిపోయాడు.  అతను రెండు ఎద్దుల్ని తీసుకొని ముక్కలుముక్కలు చేసి వాటిని సందేశకుల ద్వారా ఇశ్రాయేలు ప్రాంతమంతటికీ పంపించి వాళ్లతో ఇలా చెప్పించాడు: “ఎవరైతే సౌలును, సమూయేలును అనుసరించరో వాళ్ల పశువులకు ఇలాగే జరుగుతుంది!” అప్పుడు యెహోవా భయం ప్రజలకు కలగడంతో వాళ్లు ఏక మనస్సుతో* వచ్చారు.  తర్వాత బెజెకులో సౌలు వాళ్లను లెక్కపెట్టినప్పుడు, ఇశ్రాయేలీయులు 3,00,000 మంది, యూదావాళ్లు 30,000 మంది ఉన్నారు.  అప్పుడు వాళ్లు యాబేషు నుండి వచ్చిన సందేశకులతో ఇలా అన్నారు: “గిలాదులోని యాబేషువాళ్లకు మీరు ఇలా చెప్పండి, ‘దాదాపు రేపు మధ్యాహ్నం కల్లా మీరు రక్షించబడతారు.’ ” ఆ సందేశకులు వెళ్లి యాబేషువాళ్లకు ఆ విషయం చెప్పారు, దాంతో వాళ్లు ఎంతో సంతోషించారు. 10  కాబట్టి యాబేషువాళ్లు అమ్మోనీయులతో ఇలా అన్నారు: “రేపు మేము మీకు లొంగిపోతాం. మీకు ఏది మంచిదనిపిస్తే అది మాకు చేయవచ్చు.”+ 11  తర్వాతి రోజు, సౌలు ప్రజల్ని మూడు గుంపులుగా విభజించాడు. వాళ్లు వేకువ జామున* అమ్మోనీయుల+ శిబిరం మధ్యలోకి చొచ్చుకొనిపోయి దాదాపు మధ్యాహ్నం వరకు వాళ్లను చంపుతూనే ఉన్నారు. ప్రాణాలతో తప్పించుకున్నవాళ్లు చెల్లాచెదురై, ఎవరి దారిన వాళ్లు పారిపోయారు. 12  తర్వాత ప్రజలు సమూయేలుతో, “ ‘సౌలు మనమీద రాజుగా ఉంటాడా?’+ అని అన్నవాళ్లు ఎక్కడ? వాళ్లను మాకు అప్పగించు, మేము వాళ్లను చంపుతాం” అన్నారు. 13  కానీ సౌలు, “ఈ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల్ని రక్షించాడు కాబట్టి ఇవాళ ఎవ్వర్నీ చంపకూడదు”+ అన్నాడు. 14  తర్వాత సమూయేలు ప్రజలతో, “పదండి, మనం గిల్గాలుకు+ వెళ్లి సౌలును మళ్లీ రాజుగా ప్రకటిద్దాం”+ అన్నాడు. 15  దాంతో ప్రజలందరూ గిల్గాలుకు వెళ్లారు; వాళ్లు గిల్గాలులో యెహోవా ఎదుట సౌలును రాజును చేశారు. తర్వాత వాళ్లు అక్కడ యెహోవా ఎదుట సమాధాన బలులు అర్పించారు. అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయులందరూ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకున్నారు.+

అధస్సూచీలు

అక్ష., “ఒక్క మనిషిలా.”
అంటే, దాదాపు రాత్రి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు.