రాజులు మొదటి గ్రంథం 9:1-28

  • యెహోవా సొలొమోనుకు మళ్లీ కలలో కనిపించడం (1-9)

  • హీరాము రాజుకు సొలొమోను కానుక (10-14)

  • సొలొమోను చేపట్టిన వేర్వేరు నిర్మాణ పనులు (15-28)

9  సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని, తాను కోరుకున్న ప్రతీదాన్ని కట్టించడం పూర్తిచేసిన తర్వాత,+  యెహోవా గిబియోనులో కనిపించినట్టే సొలొమోనుకు రెండోసారి కలలో కనిపించాడు.  యెహోవా అతనితో ఇలా అన్నాడు: “నువ్వు నా ముందు చేసిన ప్రార్థనను, అనుగ్రహం కోసం నువ్వు చేసిన విన్నపాన్ని నేను విన్నాను. నా పేరును శాశ్వతంగా అక్కడ ఉంచడం ద్వారా,+ నువ్వు కట్టిన ఈ మందిరాన్ని నేను పవిత్రపర్చాను; నా దృష్టి, నా హృదయం ఎప్పుడూ అక్కడ ఉంటాయి.+  అయితే నువ్వు నేను ఆజ్ఞాపించినవన్నీ చేస్తూ+ నా నియమాలకు, తీర్పులకు లోబడుతూ+ నీ తండ్రి దావీదులా నా ఎదుట యథార్థ హృదయంతో,+ నిజాయితీగా+ నడుచుకుంటే,+  ‘ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే ఒక వ్యక్తి నీ రాజవంశంలో ఎప్పుడూ ఉంటాడు’+ అని నేను నీ తండ్రి దావీదుకు వాగ్దానం చేసినట్టు, ఇశ్రాయేలు మీద నీ రాజ్య సింహాసనాన్ని ఎల్లప్పుడూ స్థిరపరుస్తాను.  అయితే మీరు గానీ, మీ కుమారులు గానీ నన్ను అనుసరించడం మానేసి, నేను మీకు ఇచ్చిన నా ఆజ్ఞల్ని, శాసనాల్ని పాటించకుండా, వెళ్లి వేరే దేవుళ్లను సేవించి వాటికి మొక్కితే,+  నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశం నుండి వాళ్లను కొట్టివేస్తాను,+ నా పేరు కోసం నేను పవిత్రపర్చిన ఈ మందిరాన్ని నా కళ్లముందు ఉండకుండా తీసేస్తాను,+ అన్ని​దేశాలు ఇశ్రాయేలీయుల్ని ఈసడించు​కుంటాయి,* అపహాస్యం చేస్తాయి.+  ఈ మందిరం శిథిలాల దిబ్బ అవుతుంది.+ దీని పక్కన నుండి వెళ్లే ప్రతీ ఒక్కరు ఆశ్చర్యంగా చూస్తూ, ఈల వేస్తూ, ‘యెహోవా ఈ దేశాన్ని, ఈ మందిరాన్ని ఎందుకు ఇలా చేశాడు?’ అని చెప్పుకుంటారు.+  అప్పుడు వాళ్లు ఇలా అంటారు, ‘ఎందుకంటే వాళ్లు తమ పూర్వీకుల్ని ఐగుప్తు దేశం నుండి ​బయటికి తీసుకొచ్చిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు; వేరే దేవుళ్లను హత్తుకుని వాటికి మొక్కి, వాటిని ​సేవించారు. అందుకే యెహోవా వాళ్ల మీద ఈ విపత్తునంతటినీ తీసుకొచ్చాడు.’ ”+ 10  సొలొమోను 20 సంవత్సరాల్లో రెండు భవనాల్ని అంటే యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించడం పూర్తిచేశాడు.+ 11  తూరు రాజైన హీరాము+ సొలొమోనుకు దేవదారు, సరళవృక్ష మ్రానుల్ని, సొలొమోను కోరుకున్నంత బంగారాన్ని పంపించాడు. కాబట్టి సొలొమోను రాజు హీరాముకు గలిలయ ప్రాంతంలో 20 నగరాల్ని ఇచ్చాడు. 12  సొలొమోను తనకిచ్చిన నగరాల్ని చూడడానికి హీరాము తూరు నుండి వచ్చాడు, కానీ అవి అతనికి నచ్చలేదు.* 13  అతను, “నా సహోదరుడా, నువ్వు నాకు ఇలాంటి నగరాలు ఇచ్చావేంటి?” అన్నాడు. కాబట్టి అవి నేటివరకు కాబూల్‌ దేశం* అని పిలవబడుతున్నాయి. 14  ఈలోపు హీరాము సొలొమోను రాజుకు 120 తలాంతుల* బంగారం పంపించాడు.+ 15  సొలొమోను యెహోవా మందిరాన్ని, తన రాజభవనాన్ని, మిల్లోను,*+ యెరూషలేము ప్రాకారాన్ని, అలాగే హాసోరును,+ మెగిద్దోను,+ గెజెరును+ కట్టించడం కోసం వెట్టిచాకిరి చేయడానికి పిలిపించిన వాళ్ల+ వివరాలు ఇవి. 16  (ఐగుప్తు రాజైన ఫరో గెజెరును స్వాధీనం చేసుకుని దాన్ని అగ్నితో కాల్చేశాడు. అతను ఆ నగరంలో నివసిస్తున్న కనానీయుల్ని+ కూడా చంపాడు. అతను ఆ నగరాన్ని తన కూతురికి అంటే సొలొమోను భార్యకు పెళ్లి కానుకగా* ఇచ్చాడు.) 17  సొలొమోను గెజెరును, దిగువ బేత్‌-హోరోనును పటిష్ఠం చేశాడు;+ 18  అంతేకాదు బాలాతును,+ ఇశ్రాయేలు దేశంలో* ఎడారిలో ఉన్న తామారును, 19  అలాగే సొలొమోను తన గోదాముల నగరాలన్నిటినీ, రథాల నగరాల్ని,+ గుర్రపురౌతుల నగరాల్ని కట్టించాడు. అతను యెరూషలేములో, లెబానోనులో, తన ​పరిపాలన కింద ఉన్న దేశమంతటిలో తాను కోరుకున్న ప్రతీది కట్టించాడు. 20  ఇశ్రాయేలీయులుకాని అమోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల+ వంశస్థుల విషయానికొస్తే, 21  అంటే దేశంలో ఇశ్రాయేలీయులు నాశనం చేయలేకపోయిన మిగిలినవాళ్ల విషయానికొస్తే, ఈ రోజు వరకు సొలొమోను వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నాడు.+ 22  అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవర్నీ దాసులుగా చేయలేదు.+ వాళ్లు అతని యోధులుగా, సేవకులుగా, అధిపతులుగా, అధికారులుగా, అలాగే అతని రథసారథుల మీద, గుర్రపురౌతుల మీద అధిపతులుగా ఉన్నారు. 23  సొలొమోను పనుల్ని చూసుకునే ముఖ్య ఉప పాలకులు 550 మంది ఉన్నారు, వీళ్లు పనివాళ్ల మీద పర్యవేక్షకులు.+ 24  ఫరో కూతురు+ దావీదు నగరం నుండి తన సొంత ఇంటికి వచ్చింది. ఆ ఇంటిని సొలొమోను ఆమె కోసం కట్టించాడు; ఆ తర్వాత అతను మిల్లోను* కట్టించాడు. 25  సొలొమోను యెహోవా కోసం కట్టించిన బలిపీఠం మీద సంవత్సరానికి మూడుసార్లు+ ​దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పించేవాడు;+ అంతేకాదు యెహోవా ఎదుట ఉన్న ​బలిపీఠం మీద బలులు అర్పించి వాటి పొగ ​పైకిలేచేలా చేశాడు. అలా అతను మందిరాన్ని పూర్తిచేశాడు.+ 26  అంతేకాదు, సొలొమోను రాజు ఎసో​న్గెబెరులో+ ఒక నౌకాదళాన్ని కూడా తయారుచేశాడు. ఈ ఎసోన్గెబెరు, ఎదోము దేశంలో ఎర్రసముద్రం తీరాన ఏలతు దగ్గర ఉంది.+ 27  హీరాము అనుభవమున్న నావికులైన తన సేవకుల్ని సొలొమోను సేవకులతో కలిసి పనిచేయడానికి ఆ నౌకాదళంతో పాటు పంపించాడు.+ 28  వాళ్లు ఓఫీరుకు+ వెళ్లి, అక్కడి నుండి 420 తలాంతుల బంగారాన్ని సొలొమోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు.

అధస్సూచీలు

లేదా “ఇశ్రాయేలీయుల మీద సామెత చెప్పుకుంటాయి.”
అక్ష., “అతని దృష్టికి సరైనవి అనిపించలేదు.”
లేదా “పనికిరాని దేశం” అయ్యుంటుంది.
అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
ఈ హీబ్రూ పదం, కోటలాంటి నిర్మాణాన్ని సూచిస్తుండవచ్చు. అక్ష., “మట్టిదిబ్బను.”
లేదా “కట్నంగా.”
అక్ష., “దేశం లోపల.”
ఈ హీబ్రూ పదం, కోటలాంటి నిర్మాణాన్ని సూచిస్తుండవచ్చు. అక్ష., “మట్టిదిబ్బను.”