రాజులు మొదటి గ్రంథం 7:1-51

  • సొలొమోను రాజభవనం (1-12)

  • నైపుణ్యంగల హీరాము చేసిన పనులు (13-47)

    • రెండు రాగి స్తంభాలు (15-22)

    • పోత పోసిన సముద్రం (23-26)

    • పది రాగి బండ్లు, రాగి గంగాళాలు (27-39)

  • బంగారు వస్తువుల తయారీ పూర్తయింది (48-51)

7  తర్వాత, సొలొమోను తన రాజభవనాన్ని కట్టించుకున్నాడు, దాన్ని పూర్తిచేయడానికి+ అతనికి 13 సంవత్సరాలు పట్టింది.+  తర్వాత, అతను లెబానోను అడవి గృహాన్ని+ కట్టించాడు. దాని పొడవు 100 మూరలు,* వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు; దాన్ని నాలుగు వరుసల దేవదారు స్తంభాలపై కట్టించాడు. ఆ స్తంభాల మీద దేవదారు దూలాలు+ వేశారు.  స్తంభాల మీద ఉంచిన అడ్డ దూలాల మీద పల​కలు అమ​ర్చారు; అవి వరుసకు 15 చొప్పున 45 ఉన్నాయి.  దానికి, చట్రం* ఉన్న కిటికీలు మూడు వరుసల్లో ఉన్నాయి. మూడు వరుసల్లో ప్రతీ కిటికీకి ఎదురుగా మరో కిటికీ ఉంది.  మూడు వరుసల్లో ఎదురెదురుగా ఉన్న కిటికీలకు ఉన్నట్టే దాని గుమ్మాలన్నిటికీ, ద్వారబంధాలన్నిటికీ చతుర​స్రాకారంలో* చట్రాలు ఉన్నాయి.  ఆ తర్వాత, స్తంభాల మంటపాన్ని* కట్టించాడు; దాని పొడవు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. దాని ముందు, స్తంభాలు ఉన్న మరో వసారాను కట్టించి దానికి పైకప్పు వేయించాడు.  అతను న్యాయం తీర్చేందుకు, సింహాసన మందిరాన్ని*+ అంటే తీర్పు మందిరాన్ని+ కూడా కట్టించాడు. దాన్ని నేల నుండి పైన దూలాల దాకా దేవదారు చెక్కలతో కప్పారు.  మందిరం వెనక మరో ప్రాంగణంలో+ అతను నివసించడానికి రాజభవనాన్ని కట్టించాడు, ఈ భవనాన్ని కూడా దానిలాగే కట్టించాడు. సొలొమోను తాను పెళ్లి చేసుకున్న ఫరో కూతురు కోసం ఆ మందిరం లాంటి ఇంకో భవనాన్ని కూడా కట్టించాడు.+  ఇవన్నీ కొలత ప్రకారం చెక్కిన, రాతి రంపాలతో అన్నివైపులా కోయబడిన ​ఖరీదైన రాళ్లతో+ నిర్మించబడ్డాయి. పునాది నుండి గోడ పైభాగం దాకా, బయటివైపున గొప్ప ప్రాంగణం+ వరకు అదేవిధంగా నిర్మించబడ్డాయి. 10  పునాది ఖరీదైన పెద్దపెద్ద రాళ్లతో వేయబడింది; కొన్ని రాళ్లు పది మూరల పొడవు, మరికొన్ని రాళ్లు ఎనిమిది మూరల పొడవు ఉన్నాయి. 11  ​వీటిపైన, కొలత ప్రకారం చెక్కిన ఖరీదైన రాళ్లను అలాగే దేవదారు కలపను వేశారు. 12  యెహోవా మందిరం లోపలి ప్రాంగణానికి,+ మందిర వసారాకి+ వేసినట్టే గొప్ప ప్రాంగణం చుట్టూ మూడు వరుసల చెక్కిన రాళ్లు, ఒక వరుస దేవదారు దూలాలు వేశారు. 13  సొలొమోను రాజు హీరాము+ కోసం కబురు పంపి, అతన్ని తూరు నుండి రప్పించాడు. 14  అతను నఫ్తాలి గోత్రానికి చెందిన ఒక విధవరాలి కుమారుడు, అతని తండ్రి తూరుకు చెందిన రాగి పనివాడు.+ హీరాముకు రాగితో* చేసే ​పనులన్నిట్లో గొప్ప నైపుణ్యం, అవగాహన,+ ​అనుభవం ఉన్నాయి. కాబట్టి అతను సొలొమోను రాజు దగ్గరికి వచ్చి రాజు చెప్పిన పనులన్నిటినీ చేశాడు. 15  అతను రెండు రాగి స్తంభాల్ని పోతపోయించాడు;+ రెండు స్తంభాల్లో ఒక్కోదాని ఎత్తు 18 మూరలు, ఒక్కోదాని చుట్టుకొలత 12 మూరలు.*+ 16  అతను స్తంభాల పైన పెట్టడానికి రాగితో పోత పోసిన రెండు స్తంభ శీర్షాల్ని చేశాడు. ఒక శీర్షం ఎత్తు ఐదు మూరలు, రెండో శీర్షం ఎత్తు ఐదు మూరలు. 17  స్తంభాల పైన ఉన్న శీర్షాలకు మెలితిప్పిన గొలుసులతో చేసిన అల్లికలు ఉన్నాయి;+ ఒక శీర్షానికి ఏడు, ఇంకో శీర్షానికి ఏడు ఉన్నాయి. 18  తర్వాత అతను స్తంభాల పైన ఉన్న శీర్షాల్ని కప్పడానికి, అల్లిక చుట్టూ రెండు వరుసల్లో దానిమ్మ పండ్లను చేశాడు; రెండు శీర్షాలకు అలాగే చేశాడు. 19  వసారా దగ్గర స్తంభాల పైనున్న శీర్షాలు కలువ పువ్వు ఆకారంలో ఉన్నాయి, వాటి ఎత్తు నాలుగు మూరలు. 20  శీర్షాలు రెండు స్తంభాల పైన ఉన్నాయి, అవి అల్లికను ఆనుకొని ఉన్న గుండ్రటి భాగానికి కాస్త పైన ఉన్నాయి. ప్రతీ శీర్షం చుట్టూరా 200 దానిమ్మ పండ్లు వరుసల్లో ఉన్నాయి.+ 21  అతను స్తంభాల్ని ఆలయ* వసారాకు ఎదురుగా నిలబెట్టించాడు.+ అతను కుడివైపున* ఒక స్తంభాన్ని నిలబెట్టించి దానికి యాకీను* అని పేరు పెట్టాడు, ఎడమవైపున* ఇంకో స్తంభాన్ని నిలబెట్టించి దానికి బోయజు* అని పేరు పెట్టాడు.+ 22  స్తంభాల పైభాగం కలువ పువ్వు ఆకారంలో ఉంది. అలా స్తంభాల నిర్మాణం పూర్తయింది. 23  తర్వాత అతను లోహంతో సముద్రం* పోత పోయించాడు.+ అది గుండ్రంగా ఉంది, అది ఒక అంచు నుండి ఇంకో అంచు వరకు 10 మూరలు ఉంది; దాని ఎత్తు 5 మూరలు, దాని చుట్టుకొలత 30 మూరలు.*+ 24  దాని అంచు కింద, చుట్టూరా గుండ్రటి అలంకారాలు+ ఉన్నాయి. మూరకు పది చొప్పున అవి సముద్రం చుట్టూరా ఉన్నాయి. అవి రెండు వరుసల్లో సముద్రంతో కలిపి పోత పోయబడ్డాయి. 25  ఆ సముద్రం 12 ఎద్దుల మీద ఉంది;+ 3 ఎద్దులు ఉత్తరం వైపుకు, 3 ఎద్దులు పడమటి వైపుకు, 3 ఎద్దులు దక్షిణం వైపుకు, 3 ఎద్దులు తూర్పు వైపుకు తిరిగి ఉన్నాయి. వాటిమీద సముద్రం ఉంది. ఎద్దుల వెనక భాగాలు మధ్య​వైపుకు ఉన్నాయి. 26  ఆ సముద్రం బెత్తెడు* మందం ఉంది. దాని అంచు గిన్నె అంచులా, వికసించిన కలువ పువ్వులా చేయబడింది; దానిలో 2,000 బాత్‌ కొలతల* నీళ్లు పడతాయి. 27  తర్వాత అతను రాగితో పది బండ్లు*+ చేశాడు. ప్రతీ బండి నాలుగు మూరల పొడవు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల ఎత్తు ఉంది. 28  ఆ బండ్లు ఇలా నిర్మించబడ్డాయి: వాటికి పక్క పలకలు ఉన్నాయి, ఆ పక్క పలకలు అడ్డ కడ్డీల మధ్య ఉన్నాయి. 29  అడ్డ కడ్డీల మధ్య ఉన్న ఆ పక్క పలకల మీద సింహాల,+ ఎద్దుల, కెరూబుల+ రూపాలు ఉన్నాయి; అడ్డ కడ్డీల మీద కూడా అవే రూపాలు ఉన్నాయి. వేలాడే దండల్లాంటి ఆకారాలు సింహాల, ఎద్దుల పైనా కిందా ఉన్నాయి. 30  ప్రతీ బండికి నాలుగు రాగి చక్రాలు, రాగి ఇరుసులు ఉన్నాయి. బండి నాలుగు మూలల్లో వాటికి ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు గంగాళం కింద ఉన్నాయి, ప్రతీ ఆధారం పక్కన దండల్లాంటి ఆకారాలు ఉన్నాయి; అవి ఆధారాలతో పాటు పోత పోయబడ్డాయి. 31  గంగాళం మూతి, బండి పైభాగం లోపల ఉంది; గంగాళం పైకి ఒక మూర ఉంది. దాని మూతి గుండ్రంగా ఉంది, ఆధారాలతో పాటు దాని పీఠం ఒకటిన్నర మూరల ఎత్తు ఉంది. గంగాళం పైభాగంలో చెక్కిన ఆకారాలు ఉన్నాయి. బండి పక్క పలకలు గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉన్నాయి. 32  పక్క పలకల కింద నాలుగు చక్రాలు ఉన్నాయి, చక్రాల ఆధారాలు బండికి అమర్చబడివున్నాయి. ఒక్కో చక్రం ఎత్తు ఒకటిన్నర మూరలు. 33  చక్రాలన్నీ రథచక్రాల్లా చేయబడ్డాయి. వాటి ఆధారాలు, చట్రాలు, ఊసలు, నడిమి దిమ్మలు ఇవన్నీ లోహంతో పోత పోసినవి. 34  ప్రతీ బండికి నాలుగు మూలల్లో నాలుగు ఆధారాలు ఉన్నాయి; బండి ఆధారాలు బండితో పాటే* పోత పోయబడ్డాయి. 35  బండి పైభాగం మీద గుండ్రటి ఆకారంలో ఒక పట్టీ ఉంది, దాని ఎత్తు అర మూర. బండి పైభాగం మీద వాటి పక్క పలకలు, వాటిని పట్టివుంచే భాగాలు* ఇవన్నీ కలిపి* పోత పోయబడ్డాయి. 36  దాని పక్క పలకల మీద, వాటిని పట్టివుంచే భాగాల మీద ఎక్కడెక్కడైతే చోటు ఉందో అక్కడ అతను కెరూబుల్ని, సింహాల్ని, ఖర్జూర చెట్లను చెక్కాడు. అలాగే వాటి చుట్టూ దండల్లాంటి ఆకారాల్ని పెట్టాడు.+ 37  అతను పది బండ్లను ఇలాగే చేశాడు;+ అవన్నీ ఒకే కొలతలో, ఒకే ఆకారంలో ఒకేలా పోత పోయబడ్డాయి.+ 38  అతను పది రాగి గంగాళాలు+ చేశాడు, వాటిలో ఒక్కొక్క దానిలో 40 బాత్‌ కొలతల నీళ్లు పడతాయి. ప్రతీ గంగాళం నాలుగు మూరలు ఉంది.* ఆ పది బండ్లలో ఒక్కోదానికి ఒక్కో గంగాళం ఉంది. 39  తర్వాత అతను మందిరం కుడివైపున ఐదు బండ్లను, ఎడమవైపున ఐదు బండ్లను పెట్టాడు; సముద్రాన్ని మందిరం కుడివైపున, ఆగ్నేయ దిక్కులో పెట్టించాడు.+ 40  హీరాము+ పళ్లేల్ని, పారల్ని,+ గిన్నెల్ని+ కూడా చేశాడు. అలా హీరాము యెహోవా మందిరం విషయంలో సొలొమోను రాజు చేయమన్న పనంతటినీ పూర్తిచేశాడు. అతను వీటిని చేశాడు:+ 41  రెండు స్తంభాలు,+ రెండు స్తంభాల మీదున్న గుండ్రటి స్తంభ శీర్షాలు; రెండు స్తంభాల మీదున్న రెండు గుండ్రటి శీర్షాల్ని కప్పడానికి రెండు అల్లికలు;+ 42  రెండు స్తంభాల మీదున్న రెండు గుండ్రటి శీర్షాల్ని కప్పే రెండు అల్లికల్లో ఒక్కో అల్లిక కోసం రెండు వరుసల దానిమ్మ పండ్లు చొప్పున 400 దానిమ్మ పండ్లు;+ 43  పది బండ్లు,+ బండ్ల మీదున్న పది గంగాళాలు;+ 44  సముద్రం,+ సముద్రం కిందవున్న 12 ఎద్దులు; 45  బాల్చీలు, పారలు, గిన్నెలు, అలాగే పాత్రలన్నీ; యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయమన్నట్టు, హీరాము వీటిని మెరుగుపెట్టిన రాగితో చేశాడు. 46  రాజు వాటిని యొర్దాను ప్రాంతంలో సుక్కోతుకు, సారెతానుకు మధ్య బంకమట్టి అచ్చుల్లో పోత పోయించాడు. 47  పాత్రలు చాలా ఎక్కువ ఉండడంతో సొలొమోను వాటన్నిటి బరువు తూకం వేయించలేదు. కాబట్టి ఎంత రాగి ఉపయోగించబడిందో తెలియలేదు.+ 48  యెహోవా మందిరం కోసం సొలొమోను వీటన్నిటినీ చేయించాడు: బంగారు ధూపవేదిక,+ సముఖపు రొట్టెలు* పెట్టడానికి బంగారు బల్ల;+ 49  స్వచ్ఛమైన బంగారు దీపస్తంభాలు,+ అత్యంత లోపలి గదికి ఎదురుగా కుడివైపున ఐదు దీపస్తంభాలు, ఎడమవైపున ఐదు దీపస్తంభాలు; బంగారంతో చేసిన వికసించిన పువ్వులు, దీపాలు, పట్టుకార్లు;+ 50  స్వచ్ఛమైన బంగారంతో చేసిన పళ్లేలు, ఒత్తులు కత్తిరించే కత్తెరలు,+ పాత్రలు, గిన్నెలు,+ నిప్పు పాత్రలు; లోపలి మందిరం, అంటే అతి పవిత్ర స్థలం తలుపుల+ కోసం, అలాగే ఆలయ మందిరపు* తలుపుల+ కోసం బంగారు ఆధారాలు. 51  అలా సొలొమోను రాజు యెహోవా మందిరానికి సంబంధించి చేయాల్సిన పని అంతటినీ పూర్తి చేశాడు. తర్వాత అతను, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన* వాటిని+ మందిరంలోకి తీసుకొచ్చాడు; అతను వెండిబంగారాల్ని, వస్తువుల్ని యెహోవా మందిర ఖజానాల్లో  పెట్టాడు.

అధస్సూచీలు

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “ఫ్రేము.”
లేదా “నాలుగు వైపులున్న; దీర్ఘ చతురస్రాకారంలో.”
లేదా “వసారాను.”
లేదా “వసారాను.”
లేదా “కంచుతో,” ఇక్కడ అలాగే ఈ అధ్యాయంలోని తర్వాతి చోట్లలో.
లేదా “ఒక్కొక్కదాన్ని చుట్టడానికి 12 మూరల కొలనూలు పట్టింది.”
ఇక్కడ పవిత్ర స్థలాన్ని సూచిస్తోంది.
లేదా “దక్షిణం వైపున.”
“ఆయన [అంటే, యెహోవా] గట్టిగా స్థిరపర్చాలి” అని అర్థం.
లేదా “ఉత్తరం వైపున.”
బహుశా “శక్తితో” అనే అర్థం ఉండవచ్చు.
లేదా “జలాశయం.”
లేదా “దాన్ని చుట్టడానికి 30 మూరల కొలనూలు పట్టింది.”
దాదాపు 7.4 సెంటీమీటర్లు (2.9 అంగుళాలు). అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక బాత్‌ 22 లీటర్లతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “నీటి బండ్లు.”
లేదా “ఒకే భాగంగా.”
లేదా “ఫ్రేములు.”
లేదా “ఒకే భాగంగా.”
లేదా “వ్యాసం నాలుగు మూరలు.”
లేదా “సన్నిధి రొట్టెలు.”
బహుశా పవిత్ర స్థలాన్ని సూచిస్తుండవచ్చు.
అక్ష., “పవిత్రపర్చిన.”