రాజులు మొదటి గ్రంథం 6:1-38

  • సొలొమోను ఆలయాన్ని నిర్మించడం (1-38)

    • అత్యంత లోపలి గది (19-22)

    • కెరూబులు (23-28)

    • చెక్కడాలు, తలుపులు, లోపలి ప్రాంగణం (29-36)

    • దాదాపు ఏడేళ్లలో ఆలయం పూర్తయింది (37, 38)

6  ఇశ్రాయేలీయులు* ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన+ 480వ సంవత్సరంలో, అంటే సొలొమోను ఇశ్రాయేలు మీద రాజైన నాలుగో సంవత్సరం, జీవ్‌* నెలలో+ (అంటే రెండో నెలలో) అతను యెహోవా మందిరాన్ని* కట్టించడం మొదలుపెట్టాడు.+  సొలొమోను రాజు యెహోవాకు కట్టిన మందిరం* పొడవు 60 మూరలు,* వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు.+  ఆలయం* ముందున్న వసారా+ వెడల్పు మందిరం వెడల్పుతో సమానం. అది 20 మూరలు ఉంది. మందిరం ముందు నుండి లెక్కిస్తే ఆ వసారా పది మూరలు ఉంటుంది.  అతను మందిరం కోసం, బయటివైపు ఇరుకుగా లోపలివైపు వెడల్పుగా ఉండే కిటికీలు+ చేయించాడు.  అంతేకాదు, అతను మందిరం గోడ పక్కన ఒక నిర్మాణం చేయించాడు; అది మందిరం గోడల చుట్టూ, అంటే ఆలయం* గోడల చుట్టూ అలాగే అత్యంత లోపలి గది+ గోడల చుట్టూ సాగింది. అతను అందులో గదులు కట్టించాడు.+  ఆ పక్కనున్న గదుల్లో, కింది అంతస్తు గదులు ఐదు మూరల వెడల్పు, మధ్య అంతస్తు గదులు ఆరు మూరల వెడల్పు, పై అంతస్తు గదులు ఏడు మూరల వెడల్పు ఉన్నాయి. దూలాల్ని మందిరం గోడల్లోకి దూర్చకుండా ఉండేందుకు సొలొమోను మందిరం చుట్టూ ఆధారాల్ని చేయించాడు.+  మందిరాన్ని కడుతున్నప్పుడు అక్కడ సుత్తుల శబ్దం గానీ గొడ్డళ్ల శబ్దం గానీ మరే ఇతర ఇనుప పనిముట్ల శబ్దం గానీ వినబడకుండా, ముందే గని దగ్గర సిద్ధం చేసిన రాళ్లతో+ దాన్ని కట్టారు.  పక్క గదుల్లోని కింది అంతస్తు గదుల్లోకి వెళ్లే మార్గం మందిరానికి దక్షిణం* వైపున ఉంది;+ కింది అంతస్తు నుండి మధ్య అంతస్తులోకి, మధ్య అంతస్తు నుండి పై అంతస్తులోకి వెళ్లేందుకు వలయాకారంలో మెట్లు ఉన్నాయి.  సొలొమోను, మందిర నిర్మాణాన్ని కొనసాగించి దాన్ని పూర్తిచేశాడు;+ అతను మందిరాన్ని దేవదారు మ్రానులతో, దేవదారు పలకలతో కప్పించాడు.+ 10  అతను మందిరం చుట్టూ గదుల్ని కట్టించాడు,+ ఒక్కొక్క గది ఎత్తు ఐదు మూరలు; ఆ గదులు దేవదారు దూలాలతో మందిరానికి కలపబడ్డాయి. 11  ఈలోగా యెహోవా వాక్యం సొలొమోను దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 12  “నువ్వు నా శాసనాల ప్రకారం నడిస్తే, నా తీర్పుల్ని అమలు చేస్తే, నా ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ వాటికి అనుగుణంగా జీవిస్తే,+ నేను కూడా నీ తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని, ముఖ్యంగా నువ్వు కట్టిస్తున్న ఈ మందిరం విషయంలో నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.+ 13  అంతేకాదు, నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాను,+ నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టను.”+ 14  సొలొమోను, మందిరం పూర్తయ్యే వరకు దాని నిర్మాణాన్ని కొనసాగించాడు. 15  అతను మందిరం లోపలి గోడల్ని దేవదారు పలకలతో కట్టించాడు. లోపలి గోడల్ని చెక్క పలకలతో కప్పించాడు; మందిరం అడుగు నుండి పైకప్పున ఉన్న దూలాల వరకు అతను వాటితో కప్పించాడు. మందిరం నేలను సరళవృక్ష పలకలతో+ కప్పించాడు. 16  అతను మందిరం వెనక గోడ నుండి 20 మూరలు కొలిచి, నేల నుండి పైనున్న దూలాల దాకా దేవదారు పలకలతో ఒక గది కట్టించాడు; అతను దాని లోపల* అత్యంత లోపలి గదిని,+ అంటే అతి పవిత్ర స్థలాన్ని+ కట్టించాడు. 17  దాని ముందున్న మందిర భాగం, అంటే ఆలయం*+ 40 మూరలు ఉంది. 18  మందిరం లోపలవున్న దేవదారు పలకల మీద గుండ్రటి పండ్లు,+ వికసించిన పువ్వులు+ చెక్కబడ్డాయి. లోపల ఉన్నవన్నీ దేవదారు పలకలే; ఒక్క రాయి కూడా బయటికి కనిపించలేదు. 19  తర్వాత అతను, యెహోవా ఒప్పంద మందసాన్ని పెట్టడానికి+ మందిరంలోని అత్యంత లోపలి గదిని+ సిద్ధం చేశాడు. 20  అత్యంత లోపలి గది పొడవు 20 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 20 మూరలు;+ అతను దాన్ని స్వచ్ఛమైన బంగారు రేకుతో కప్పించాడు; ధూపవేదికను+ దేవదారు చెక్కలతో కప్పించాడు. 21  సొలొమోను, మందిరంలోని లోపలి భాగాన్ని స్వచ్ఛమైన బంగారు రేకుతో కప్పించాడు;+ అలాగే బంగారు రేకుతో కప్పబడిన అత్యంత లోపలి గదికి+ ఎదురుగా బంగారు గొలుసుల్ని పెట్టించాడు. 22  అతను మందిరం మొత్తాన్ని బంగారు రేకుతో కప్పించాడు. అలాగే అత్యంత లోపలి గది దగ్గర్లో ఉన్న ధూపవేదిక మొత్తాన్ని బంగారు రేకుతో కప్పించాడు.+ 23  అత్యంత లోపలి గదిలో పైన్‌ చెట్టు కలపతో* రెండు కెరూబుల్ని+ చేయించాడు, ఒక్కో దాని ఎత్తు పది మూరలు.+ 24  మొదటి కెరూబు ఒక రెక్క ఐదు మూరలు ఉంది, మరో రెక్క ఐదు మూరలు ఉంది. మొదటి రెక్క అంచు నుండి రెండో రెక్క అంచు వరకు పది మూరలు ఉంది. 25  రెండో కెరూబు రెక్కలు కూడా పది మూరలు ఉన్నాయి. కెరూబులు రెండూ ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి. 26  మొదటి కెరూబు ఎత్తు రెండో కెరూబు ఎత్తులాగే పది మూరలు ఉంది. 27  తర్వాత సొలొమోను, కెరూబుల్ని+ అతి పవిత్ర స్థలం లోపల పెట్టించాడు. కెరూబుల రెక్కలు చాపబడివున్నాయి కాబట్టి ఒక కెరూబు రెక్క ఒక గోడను, రెండో కెరూబు రెక్క ఇంకో గోడను తాకుతున్నాయి; అలాగే వాటి రెక్కలు మందిరం మధ్యభాగం వైపుకు చాపబడివున్నాయి, కాబట్టి ఆ రెక్కలు ఒకదానికొకటి తాకుతున్నాయి. 28  అతను కెరూబుల్ని బంగారు రేకుతో కప్పించాడు. 29  అలాగే అతను మందిరంలోని లోపలి, బయటి గదుల గోడలన్నిటి మీద* చుట్టూరా కెరూబుల్ని,+ ఖర్జూర చెట్లను,+ వికసించిన పువ్వుల్ని+ చెక్కించాడు. 30  అంతేకాదు, మందిరంలోని లోపలి, బయటి గదుల నేలను బంగారు రేకుతో కప్పించాడు. 31  అత్యంత లోపలి గది ప్రవేశ ద్వారం కోసం పైన్‌ చెట్టు కలపతో తలుపుల్ని, పక్క స్తంభాల్ని, ద్వారబంధాల్ని ఐదో భాగంగా* చేయించాడు. 32  రెండు తలుపులు పైన్‌ చెట్టు కలపతో చేసినవి. అతను వాటిమీద కెరూబుల్ని, ఖర్జూర చెట్లను, వికసించిన పువ్వుల్ని చెక్కించాడు; అతను తలుపుల్ని బంగారు రేకుతో కప్పించాడు, అలాగే కెరూబుల్ని, ఖర్జూర చెట్లను బంగారు రేకుతో కప్పించాడు. 33  అదేవిధంగా, ఆలయం* ప్రవేశ ద్వారం కోసం అతను పైన్‌ చెట్టు కలపతో ద్వారబంధాల్ని నాలుగో భాగంగా* చేయించాడు. 34  అతను సరళవృక్ష కలపతో రెండు తలుపుల్ని చేయించాడు. ఒక్కో తలుపుకి ఇరుసుల మీద తిరిగే రెండు మడత రెక్కలు ఉన్నాయి.+ 35  అతను తలుపుల మీద కెరూబుల్ని, ఖర్జూర చెట్లను, వికసించిన పువ్వుల్ని చెక్కించాడు; వాటిని బంగారు రేకుతో కప్పించాడు. 36  అతను లోపలి ప్రాంగణాన్ని+ మూడు వరుసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.+ 37  4వ సంవత్సరం జీవ్‌* నెలలో యెహోవా మందిరానికి పునాది వేయబడింది;+ 38  11వ సంవత్సరం బూలు* నెలలో (అంటే ఎనిమిదో నెలలో) నమూనా ప్రకారం,+ అన్ని వివరాలతో సహా మందిరం పూర్తయింది; అలా సొలొమోను ఏడు సంవత్సరాల పాటు మందిరాన్ని కట్టించాడు.

అధస్సూచీలు

అనుబంధం B8 చూడండి.
అనుబంధం B15 చూడండి.
అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”
ఈ సందర్భంలో ఇది పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలం ఉన్న భాగాన్ని మాత్రమే సూచిస్తోంది.
అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
బహుశా పవిత్ర స్థలాన్ని సూచిస్తుండవచ్చు.
ఇక్కడ పవిత్ర స్థలాన్ని సూచిస్తోంది.
అక్ష., “కుడి.”
అంటే, మందిరం లోపల.
అంటే, అతి పవిత్ర స్థలం ముందున్న పవిత్ర స్థలం.
అక్ష., “నూనె చెట్టు కలపతో,” అలెప్పో పైన్‌ కావచ్చు.
అక్ష., “లోపలా, బయటా.”
బహుశా ద్వారబంధం నిర్మాణాన్ని లేదా తలుపుల పరిమాణాన్ని సూచిస్తుండవచ్చు.
ఇక్కడ పవిత్ర స్థలాన్ని సూచిస్తోంది.
అక్ష., “నాలుగో భాగానికి చెందినదిగా.” బహుశా ద్వారబంధం నిర్మాణాన్ని లేదా తలుపుల పరిమాణాన్ని సూచిస్తుండవచ్చు.
అనుబంధం B15 చూడండి.
అనుబంధం B15 చూడండి.