మొదటి యోహాను 1:1-10

  • జీవ వాక్యం (1-4)

  • వెలుగులో నడవడం (5-7)

  • పాపాల్ని ఒప్పుకోవాల్సిన అవసరం (8-10)

1  జీవ వాక్యం+ గురించి మేము మీకు రాస్తున్నాం. ఆయన మొదటి నుండి ఉన్నాడు, మేము ఆయన మాట్లాడుతుంటే విన్నాం, ఆయన్ని కళ్లారా చూశాం, జాగ్ర​త్తగా గమనించాం, చేతులతో ముట్టుకున్నాం.  (అవును, శాశ్వత జీవితం వెల్లడిచేయబడింది, మేము దాన్ని చూశాం, దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాం,+ దాని గురించి మీకు ప్రకటిస్తున్నాం. ఈ శాశ్వత జీవితం+ తండ్రి నుండి వచ్చింది, అది మాకు వెల్లడిచేయబడింది.)  మేము చూసింది, విన్నది మీకు ప్రకటిస్తున్నాం.+ మేము తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఐక్యంగా* ఉన్నట్టే మీరు మాతో ఐక్యంగా* ఉండాలని+ అలా చేస్తున్నాం.  మన ఆనందం సంపూర్ణం అవ్వాలని మేము ఈ విషయాలు రాస్తున్నాం.  మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడు వెలుగు,+ ఆయనలో చీకటి ఏమాత్రం లేదు.  ఒకవేళ మనం, “ఆయనతో ఐక్యంగా ఉన్నాం” అని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తూ ఉంటే, మనం అబద్ధమాడుతున్నాం, మనం సత్యానికి అనుగుణంగా నడుచుకోవట్లేదు.+  అయితే, ఆయన వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులో నడుస్తుంటే, మనం ఒకరితో ఒకరం ఐక్యంగా ఉన్నాం, ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.+  ఒకవేళ మనం, “మాలో ఏ పాపం లేదు” అని చెప్పుకుంటే, మనల్ని మనం మోసం చేసుకున్నట్టే,+ మనలో సత్యం లేనట్టే.  కానీ మనం మన పాపాల్ని ఒప్పుకుంటే, ఆయన నమ్మకమైనవాడు, నీతిమంతుడు కాబట్టి మనల్ని క్షమిస్తాడు, అన్నిరకాల చెడుతనం నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తాడు.+ 10  అయితే మనం, “మేము పాపం చేయలేదు” అని చెప్పుకుంటే, మనం ఆయన్ని అబద్ధాలకోరుగా చేస్తున్నట్టే, ఆయన వాక్యం మనలో లేనట్టే.

అధస్సూచీలు

లేదా “సహవాసంలో.”
లేదా “మా సహవాసంలో.”