దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 11:1-47

  • ఇశ్రాయేలీయులందరూ దావీదును రాజుగా అభిషేకించడం (1-3)

  • దావీదు సీయోనును స్వాధీనం చేసుకోవడం (4-9)

  • దావీదు బలమైన యోధులు (10-47)

11  కొంతకాలానికి ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో+ ఉన్న దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “ఇదిగో! మేము నీ రక్తసంబంధులం.*+  గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు, నువ్వే యుద్ధాల్లో ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించావు.+ అంతేకాదు నీ దేవుడైన యెహోవా నీతో ఇలా అన్నాడు: ‘నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కాస్తావు, నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలు మీద నాయకుడివి అవుతావు.’ ”+  ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, అతను అక్కడ యెహోవా ఎదుట వాళ్లతో ఒప్పందం* చేశాడు. తర్వాత వాళ్లు, సమూయేలు ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం+ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించారు.+  ఆ తర్వాత దావీదు, అలాగే ఇశ్రాయేలీయులందరూ యెబూసీయులు+ నివసిస్తున్న యెరూషలేముకు, అంటే యెబూసుకు+ బయల్దేరారు.  యెబూసీయులు దావీదును, “నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రాలేవు!” అని హేళన చేశారు.+ అయితే దావీదు సీయోను కోటను+ స్వాధీనం చేసుకున్నాడు, దాన్ని ఇప్పుడు దావీదు నగరం+ అని పిలుస్తున్నారు.  దావీదు ఇలా అన్నాడు: “యెబూసీయుల మీద మొదట ఎవరు దాడి చేస్తారో అతను సైన్యాధిపతి అవుతాడు.” అప్పుడు సెరూయా కుమారుడైన యోవాబు+ మొదట దాని మీదికి వెళ్లాడు, అతను సైన్యాధిపతి అయ్యాడు.  తర్వాత దావీదు ఆ కోటలో నివసించడం మొదలుపెట్టాడు. అందుకే దానికి దావీదు నగరం అనే పేరు వచ్చింది.  అతను మిల్లో* దగ్గర నుండి దాని చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గోడల్ని, మిగతా భవనాల్ని కట్టిం​చడం మొదలుపెట్టాడు, యోవాబు మిగతా నగరాన్ని తిరిగి కట్టించాడు.  అలా దావీదు అంతకంతకూ గొప్పవాడౌతూ ఉన్నాడు,+ సైన్యాలకు అధిపతైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. 10  దావీదు దగ్గరున్న బలమైన యోధుల్లో అధిపతులు వీళ్లే. యెహోవా ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినట్టు, దావీదును రాజుగా చేసే విషయంలో వీళ్లు ఇశ్రాయేలీయులందరితో పాటు పూర్తి మద్దతు ఇచ్చారు.+ 11  దావీదు దగ్గరున్న బలమైన యోధుల పట్టిక ఇది: హక్మోనీయుడి కుమారుడైన యాషాబాము,+ అతను ముగ్గురు బలమైన యోధుల్లో అధిపతి.+ యాషాబాము ఒకసారి తన ఈటెతో 300 మందిని చంపాడు.+ 12  అతని తర్వాతివాడు ఎలియాజరు,+ అతను అహోహీయుడైన+ దోదో కుమారుడు. ముగ్గురు బలమైన యోధుల్లో ఎలియాజరు ఒకడు. 13  ఒకసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి పస్ద​మ్మీములో సమకూడినప్పుడు అతను దావీదుతో పాటు ఉన్నాడు.+ అక్కడ ఒక బార్లీ* చేను ఉంది; ప్రజలు ఫిలిష్తీయుల్ని చూసి పారిపోయారు. 14  కానీ అతను ఆ చేను మధ్యలో నిలబడి దాన్ని కాపాడాడు, అతను ఫిలిష్తీయుల్ని హతం చేస్తూ వెళ్లాడు. అలా యెహోవా తన ప్రజలకు గొప్ప విజయాన్ని* ఇచ్చాడు.+ 15  ఒకసారి 30 మంది అధిపతుల్లో ముగ్గురు దావీదు దగ్గరికి వచ్చారు, అప్పుడు దావీదు బండ దగ్గర, అంటే అదుల్లాము గుహ దగ్గర ఉన్నాడు;+ ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో మకాం వేసి ఉంది.+ 16  ఆ సమయంలో దావీదు అక్కడ ఒక సురక్షితమైన స్థలంలో ఉన్నాడు, ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఒకటి బేత్లెహేములో ఉంది. 17  అప్పుడు దావీదు, “నేను బేత్లెహేము+ ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తాగితే ఎంత బాగుంటుంది!” అంటూ తన కోరికను తెలియజేశాడు. 18  దాంతో ఆ ముగ్గురు ఫిలిష్తీయుల శిబిరంలోకి చొరబడి, ​బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావిలో నుండి నీళ్లు తోడి దావీదు దగ్గరికి తీసుకొచ్చారు; కానీ దావీదు ఆ నీళ్లు తాగడానికి ఒప్పుకోకుండా వాటిని యెహోవా ముందు పారబోశాడు. 19  అతను ఇలా అన్నాడు: “నా దేవుడంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఈ పని చేయడం నా ఊహకందని విషయం! తమ ప్రాణాలకు ​తెగించిన ఈ మనుషుల రక్తాన్ని నేను తాగాలా?+ వాళ్లు ​ప్రాణాలకు తెగించి మరీ ఈ నీళ్లు తీసుకొచ్చారు.” అలా దావీదు ఆ నీళ్లు తాగడానికి ఒప్పుకోలేదు. అతని దగ్గరున్న ముగ్గురు బల​మైన యోధులు చేసిన పనులు ఇవి. 20  యోవాబు సహోదరుడైన+ అబీషై+ మరో ముగ్గురిలో అధిపతి అయ్యాడు; అతను ఒకసారి ఈటెతో 300 మందిని చంపాడు. అతనికి ఆ మొదటి ముగ్గురికి ఉన్నలాంటి పేరే ఉంది.+ 21  అతను ఆ మరో ముగ్గురిలో మిగతా ఇద్దరి కన్నా ఎంతో ప్రసిద్ధి చెందాడు, అతను వాళ్ల అధిపతి; అయినా అతను మొదటి ముగ్గురికి సమానుడు కాలేదు. 22  యెహోయాదా కుమారుడైన బెనాయా+ ఎంతో ధైర్యం గలవాడు.* అతను కబ్సెయేలులో+ ఎన్నో సాహస కార్యాలు చేశాడు. అతను మోయాబుకు చెందిన అరీయేలు ఇద్దరు కుమారుల్ని చంపాడు. మంచు కురుస్తున్న ఒకరోజు అతను నీటి గుంటలోకి దిగి ఒక సింహాన్ని చంపాడు.+ 23  అతను చాలా ఎత్తుగా ఉన్న, అంటే ఐదు మూరల* ఎత్తున్న ఒక ఐగుప్తీయుణ్ణి+ కూడా చంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో నేత నేసేవాళ్ల కర్ర లాంటి ఈటె+ ఉన్నా, అతను ఆ ఐగుప్తీ​యుడి మీదికి ఒక కర్రతో వెళ్లి అతని చేతిలో నుండి ఈటెను లాక్కొని దానితోనే అతన్ని చంపాడు.+ 24  ఈ పనులు యెహోయాదా కుమారుడైన బెనాయా చేశాడు, అతనికి ఆ ముగ్గురు బలమైన యోధులకున్నంత పేరు ఉంది. 25  అతను ఆ ముప్పై మంది కన్నా ఎక్కువ ప్రసిద్ధి చెందినా, ఆ ముగ్గురికి సమా​నుడు కాలేదు.+ అయితే, దావీదు అతన్ని తన అంగరక్షకుల మీద నియమించాడు. 26  సైన్యంలో ఉన్న బలమైన యోధులు ఎవరంటే: యోవాబు సహోదరుడైన అశాహేలు,+ బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,+ 27  హరోరీయుడైన షమ్మా, పెలోనీయుడైన హేలెస్సు, 28  తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడు ఈరా,+ అనాతోతీయుడైన అబీయెజరు,+ 29  హూషాతీయుడైన సిబ్బెకై,+ అహోహీయుడైన ఈలై, 30  నెటోపాతీయుడైన మహరై,+ నెటోపాతీయుడైన ​బయనా ​కుమారుడు హేలెదు,+ 31  బెన్యామీనీయుల+ గిబియాకు చెందిన రీబై కుమారుడు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, 32  గాయషు+ వాగుల* ప్రాంతానికి చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, 33  బహూరీమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా, 34  గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడు యోనాతాను, 35  హరారీయుడైన శాకారు కుమారుడు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, 36  మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా, 37  కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారు​డైన నయరై, 38  నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీ కుమారుడైన మిబ్హారు, 39  అమ్మోనీయుడైన జెలెకు, బెరోతీయుడైన నహరై; ఇతను సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలు మోసేవాడు, 40  ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, 41  హిత్తీయుడైన ఊరియా,+ అహ్లయి కుమారుడైన జాబాదు, 42  రూబేనీయుడైన షీజా కుమారుడు అదీనా, అతను రూబేనీయుల్లో ఒక అధిపతి, అలాగే అతనితో ఉన్న 30 మందికి అధిపతి; 43  మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, 44  అష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరోయేరీయుడైన హోతాము కుమారులు షామా, యెహీయేలు; 45  షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన అతని సహోదరుడు యోహా; 46  మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా, మోయా​బీయుడైన ఇత్మా; 47  ఎలీయేలు, ఓబేదు, మెజోబాయావాడైన యహశీయేలు.

అధస్సూచీలు

అక్ష., “నీ ఎముక, మాంసం.”
లేదా “నిబంధన.”
ఈ హీబ్రూ పదం, కోటలాంటి నిర్మాణాన్ని సూచిస్తుండవచ్చు. అక్ష., “మట్టిదిబ్బ.”
లేదా “బార్లీతో నిండిన.”
లేదా “రక్షణను.”
అక్ష., “వీరుని కుమారుడు.”
అతని ఎత్తు దాదాపు 2.23 మీటర్లు (7.3 అడుగులు). అనుబంధం B14 చూడండి.
పదకోశం చూడండి.