హబక్కూకు 3:1-19

  • చర్య తీసుకోమని ప్రవక్త యెహోవాకు ప్రార్థించడం (1-19)

    • దేవుడు తన అభిషిక్త ప్రజల్ని రక్షిస్తాడు (13)

    • కష్టాల్లో ఉన్నా యెహోవాను బట్టి ఆనందించడం (17, 18)

3  హబక్కూకు ప్రవక్త చేసిన ప్రార్థన, శోకగీతాలు:   యెహోవా, నీ గురించిన వార్త విన్నాను. యెహోవా, నీ పనుల్ని చూసి సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయాను. మా కాలంలో* మళ్లీ వాటిని చేయి! మా కాలంలో* వాటిని తెలియజేయి. కోప్పడుతూనే కరుణ చూపించడం మర్చిపోకు.+   దేవుడు తేమాను నుండి వచ్చాడు,పవిత్రుడైన దేవుడు పారాను కొండ నుండి వచ్చాడు.+ (సెలా)* ఆయన మహిమ ఆకాశాన్ని కప్పేసింది;+భూమి ఆయన కీర్తితో నిండిపోయింది.   ఆయన తేజస్సు వెలుగు లాంటిది.+ ఆయన చేతి నుండి రెండు కిరణాలు ప్రసరించాయి,అక్కడే ఆయన శక్తి దాగివుంది.   తెగులు ఆయన ముందు నడిచింది,+విషజ్వరం ఆయన పాదాల వెంట వెళ్లింది.   ఆయన స్థిరంగా నిలబడి భూమిని కుదిపేశాడు.+ ఒక్క చూపుతో దేశాలు ఉలిక్కిపడి లేచేలా చేశాడు.+ అనాది నుండి ఉన్న పర్వతాలు బద్దలయ్యాయి,ప్రాచీనకాలం నుండి ఉన్న కొండలు మోకరిల్లాయి.+ ఇవి ఆయన పురాతన మార్గాలు.   కూషీయుల డేరాల్లో విపత్తును చూశాను. మిద్యానీయుల డేరాల తెరలు వణికిపోయాయి.+   యెహోవా, నీకు కోపం వచ్చింది నదుల మీదనా?నీ కోపం మండుతున్నది నదుల మీదనా? లేదా నీ ఆగ్రహం సముద్రం మీదనా?+ ఎందుకంటే, నువ్వు నీ గుర్రాల మీద స్వారీ చేశావు;+నీ రథాలు విజయాన్ని* తెచ్చేవి.+   నువ్వు నీ విల్లును తీసి ఎక్కుపెట్టావు. కర్రలు* ప్రమాణపూర్వకంగా నియమించబడ్డాయి.* (సెలా) నువ్వు నదులతో భూమిని చీలుస్తున్నావు. 10  నిన్ను చూసి పర్వతాలు నొప్పితో మెలికలు తిరిగిపోయాయి.+ కుండపోతగా కురిసిన నీళ్లు దేశంలో ప్రవహించాయి. అగాధ జలాలు బిగ్గరగా గర్జించాయి.+ అవి ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. 11  సూర్యుడు, చంద్రుడు తమ ఉన్నత నివాసాల్లో ఉండిపోయారు.+ నీ బాణాలు వెలుగులా దూసుకెళ్లాయి.+ నీ ఈటె తళతళ మెరిసింది. 12  విపరీతమైన కోపంతో నువ్వు భూమ్మీద సంచరించావు.* ఆగ్రహంతో దేశాల్ని అణగదొక్కావు.* 13  నీ ప్రజల్ని రక్షించడానికి, నీ అభిషిక్తుణ్ణి కాపాడడానికి నువ్వు బయల్దేరావు. దుష్టుల ఇంటి నాయకుణ్ణి చితగ్గొట్టావు. పునాది నుండి పైకప్పు* వరకు అది ధ్వంసమైంది. (సెలా) 14  నన్ను చెదరగొట్టడానికి వాళ్లు తుఫానులా వచ్చినప్పుడు,నువ్వు అతని యోధుల తలల్ని అతని ఆయుధాలతోనే* నరికేశావు. కష్టాల్లో ఉన్నవాణ్ణి రహస్యంగా మింగేయడం వాళ్లకెంతో ఇష్టం. 15  నువ్వు నీ గుర్రాలతోసముద్రం గుండా, ఉప్పొంగుతున్న విస్తార జలాల గుండా వచ్చావు. 16  దాన్ని విని నేను లోలోపల* భయంతో వణికిపోయాను;ఆ శబ్దానికి నా పెదాలు అదిరాయి. నా ఎముకలు కుళ్లిపోసాగాయి.+నా కాళ్లు గజగజలాడాయి. అయినా నేను, వేదన కలిగించే ఆ రోజు కోసం మౌనంగా ఎదురుచూస్తాను,+ఎందుకంటే, అది మా మీద దాడిచేసే వాళ్లమీదికి వస్తోంది. 17  అంజూర చెట్టు పూత వేయకపోయినా,ద్రాక్షతీగలు ఫలించకపోయినా;ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా,పొలాల్లో పంట పండకపోయినా;దొడ్డిలో గొర్రెలు లేకుండాపోయినా,సాలల్లో పశువులు లేకపోయినా; 18  నేను మాత్రం యెహోవాను బట్టి ఆనందిస్తాను;నా రక్షకుడైన దేవుణ్ణి బట్టి సంతోషిస్తాను.+ 19  సర్వోన్నత ప్రభువైన యెహోవాయే నా బలం;+ఆయన నా కాళ్లను జింక కాళ్లలా చేస్తాడు, నన్ను ఎత్తైన స్థలాల్లో నడిచేలా చేస్తాడు,+

అధస్సూచీలు

అక్ష., “సంవత్సరాల మధ్యలో.”
అక్ష., “సంవత్సరాల మధ్యలో.”
పదకోశం చూడండి.
లేదా “రక్షణను.”
లేదా “బాణాలు” అయ్యుంటుంది.
లేదా “ఒట్టేసి చేసిన గోత్రాల ప్రమాణాలు చెప్పబడ్డాయి” అయ్యుంటుంది.
అక్ష., “నూర్చావు.”
లేదా “కవాతు చేశావు.”
అక్ష., “మెడ.”
అక్ష., “కర్రలతోనే.”
అక్ష., “నా కడుపు.”