సంఖ్యాకాండం 6:1-27

  • నాజీరు మొక్కుబడి (1-21)

  • యాజకులు దీవించడం (22-27)

6  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక పురుషుడు గానీ, స్త్రీ గానీ యెహోవాకు నాజీరుగా*+ జీవిస్తానని ప్రత్యేక మొక్కుబడి చేసుకుంటే,  అతను ద్రాక్షారసానికి, మత్తుపానీయాలకు దూరంగా ఉండాలి. ద్రాక్షారసం నుండి గానీ, ఏ రకమైన మత్తుపానీయం నుండి గానీ తయారుచేసిన పుల్లటి పానీయాన్ని అతను తాగకూడదు.+ ద్రాక్షలతో తయారుచేసిన ఏ పానీయాన్నీ అతను తాగకూడదు; తాజా ద్రాక్షల్ని గానీ, ఎండు ద్రాక్షల్ని గానీ అతను తినకూడదు.  అతను నాజీరుగా ఉన్నన్ని రోజులు, ద్రాక్షతీగ నుండి చేసిందేదీ తినకూడదు; అంటే పచ్చి ద్రాక్షల నుండి ద్రాక్షల పైతోలు వరకు దేనితో​నైనా చేసిందేదీ అతను ​తినకూడదు.  “ ‘అతను మొక్కుబడి చేసుకొని నాజీ​రుగా ఉన్నన్ని రోజులు మంగలికత్తి అతని తల​మీద పడకూడదు.+ యెహోవాకు ప్రత్యేకంగా ఉండాల్సిన రోజులు పూర్తయ్యే వరకు అతను తన తలవెంట్రుకల్ని పెరగనివ్వాలి, అలా అతను పవిత్రుడిగా ఉండాలి.  యెహోవాకు ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నన్ని రోజులు అతను చనిపోయిన ఏ వ్యక్తి* దగ్గరికీ* వెళ్లకూడదు.  చనిపోయింది అతని తండ్రే గానీ, తల్లే గానీ, సహోదరుడే గానీ, సహోదరే గానీ అతను తనను తాను అపవిత్రపర్చుకోకూడదు.+ ఎందుకంటే, అతను తన దేవునికి నాజీరుగా ఉన్నాడని చూపించే గుర్తు అతని తలమీద ఉంది.  “ ‘అతను నాజీరుగా ఉన్నన్ని రోజులు యెహోవాకు పవిత్రుడిగా ఉంటాడు.  అయితే అకస్మాత్తుగా ఎవరైనా అతని పక్కన చనిపోతే,+ అలా అతను తన దేవునికి ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడనడానికి గుర్తుగా ఉన్న తలవెంట్రుకల్ని అపవిత్రపర్చుకుంటే, అతను శుద్ధీకరించబడే రోజున గుండు గీయించుకోవాలి.+ ఏడో రోజున అతను గుండు గీయించుకోవాలి. 10  ఎనిమిదో రోజున అతను రెండు గువ్వల్ని గానీ, రెండు పావురం పిల్లల్ని గానీ ​తీసుకొని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న యాజకుని దగ్గరికి రావాలి. 11  యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారార్థ బలి కోసం, ఇంకోదాన్ని దహనబలి కోసం సిద్ధంచేసి, చనిపోయిన వ్యక్తిని* తాకడం వల్ల అతను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు.+ తర్వాత అతను, ఆ రోజు తన తలను పవిత్రపర్చుకోవాలి. 12  అతను యెహోవాకు నాజీరుగా ఉండాల్సిన రోజుల్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలి, అలాగే అపరాధ పరిహారార్థ బలి కోసం ఏడాది పొట్టేలును తీసుకురావాలి. అయితే అతను అంతకుముందు నాజీరుగా ఉన్న రోజులు అపవిత్రమయ్యాయి కాబట్టి అవి లెక్కలోకి రావు. 13  “ ‘నాజీరుగా ఉండే వ్యక్తి గురించిన నియమం ఇదే: అతను నాజీరుగా ఉండాల్సిన రోజులు పూర్తయినప్పుడు,+ అతన్ని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరికి తీసుకురావాలి. 14  అతను అక్కడ తన అర్పణను యెహోవాకు సమర్పించాలి: దహనబలిగా అర్పించడానికి ఏ లోపంలేని ఏడాది పొట్టేలును;+ పాపపరిహారార్థ బలిగా అర్పించడానికి ఏ లోపంలేని ఏడాది ఆడ గొర్రెపిల్లను;+ సమాధానబలిగా అర్పించడానికి ఏ లోపంలేని పొట్టేలును;+ 15  ఒక గంప నిండా పులవని మెత్తని పిండిలో నూనె కలిపి చేసిన భక్ష్యాల్ని,* పులవని పిండితో చేసి నూనె పూసిన అప్పడాల్ని; వాటి ధాన్యార్పణను;+ వాటి పానీయార్పణల్ని+ తీసుకురావాలి. 16  యాజకుడు వాటిని యెహోవా ముందుకు తీసుకొచ్చి, అతని పాపపరిహారార్థ బలిని, దహన​బలిని అర్పిస్తాడు. 17  యాజకుడు సమాధానబలిగా పొట్టేలును, అలాగే గంపలో ఉన్న ​పులవని భక్ష్యాల్ని యెహోవాకు అర్పిస్తాడు; అలాగే దాని ధాన్యార్పణను,+ దాని పానీయార్పణను కూడా అర్పిస్తాడు. 18  “ ‘నాజీరుగా ఉన్న వ్యక్తి, కత్తెర వేయని తన తలవెంట్రుకల్ని+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర కత్తిరించుకొని గుండు గీయించుకోవాలి, తర్వాత అతను నాజీరుగా ఉన్న రోజుల్లో పెరిగిన ఆ వెంట్రుకల్ని తీసుకొని సమా​ధానబలి కింద ఉన్న అగ్నిలో వేస్తాడు. 19  తర్వాత యాజకుడు ఒక ఉడికిన+ పొట్టేలు జబ్బను, గంపలో నుండి ఒక పులవని భక్ష్యాన్ని,* ఒక పులవని అప్పడాన్ని తీసుకొని అతని అరచేతుల్లో పెట్టాలి; అతను నాజీరుగా ఉన్నాడనడానికి గుర్తుగా ఉన్న తన తలను గుండు గీయించుకున్న తర్వాతే యాజకుడు అలా పెట్టాలి. 20  యాజకుడు వాటిని అల్లాడించే అర్పణగా యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలించాలి.+ అల్లాడించే అర్పణలోని ఛాతి భాగంతో పాటు, పవిత్ర భాగమైన కాలుతో పాటు అది యాజకునికి పవిత్రమైనదిగా ఉంటుంది.+ తర్వాత, అప్పటివరకు నాజీరుగా ఉన్న ఆ వ్యక్తి ద్రాక్షారసం తాగొచ్చు. 21  “ ‘మొక్కుబడి చేసుకునే నాజీరు+ గురించిన నియమం ఇదే: ఒకవేళ అతను తనకు నియమించబడిన అర్పణలకు అదనంగా, తాను అర్పించగలిగే ఇంకొన్ని అర్పణలు యెహోవాకు ఇస్తానని మొక్కుబడి చేసుకుంటే, తాను నాజీరుగా ఉండడానికి సంబంధించిన నియమం పట్ల గౌరవంతో అతను ఆ మొక్కుబడిని చెల్లించాలి.’ ” 22  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 23  “నువ్వు అహరోనుకు, అతని కుమారులకు ఇలా చెప్పు: ‘మీరు ఇశ్రాయేలీయుల్ని ఈ విధంగా దీవించాలి.+ వాళ్లతో ఇలా అనండి: 24  “యెహోవా మిమ్మల్ని దీవించాలి,+ మిమ్మల్ని కాపాడాలి. 25  యెహోవా తన ముఖకాంతిని మీ మీద ప్రకాశింపజేయాలి,+ ఆయన మీ మీద అనుగ్రహం ​చూపించాలి. 26  యెహోవా మీ వైపు దయతో చూడాలి, ఆయన మీకు శాంతిని ​అనుగ్రహించాలి.” ’+ 27  నేను ఇశ్రాయేలీయుల్ని దీవించేలా,+ యాజకులు వాళ్లను దీవించేటప్పుడు నా పేరు ఉపయోగించాలి.”+

అధస్సూచీలు

హీబ్రూలో నాజీరు అనే మాటకు “వేరుచేయబడిన వ్యక్తి; సమర్పించబడిన వ్యక్తి; ప్రత్యేకించబడిన వ్యక్తి” అని అర్థం.
లేదా “ప్రాణి.” పదకోశం చూడండి.
లేదా “దరిదాపులకు కూడా.”
లేదా “ప్రాణిని.” పదకోశం చూడండి.
వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.
వడ ఆకారంలో ఉన్న రొట్టె.