సంఖ్యాకాండం 5:1-31

  • అపవిత్రుల్ని దూరంగా ఉంచడం (1-4)

  • తప్పు ఒప్పుకోవడం, పరిహారం చెల్లించడం (5-10)

  • వ్యభిచారం చేసినట్టు అనుమానం వస్తే నీళ్లతో పరీక్ష (11-31)

5  యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు:  “కుష్ఠువ్యాధి ఉన్న ప్రతీ వ్యక్తిని,+ స్రావం ఉన్న ప్రతీ వ్యక్తిని,+ చనిపోయిన వ్యక్తిని* ముట్టు​కోవడం వల్ల అపవిత్రుడైన ప్రతీ వ్యక్తిని+ పాలెంలో నుండి బయటికి పంపించేయమని నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.  అది పురుషుడైనా, స్త్రీ అయినా వాళ్లను బయటికి పంపించేయాలి. నేను ఎవరి మధ్యైతే నివసిస్తున్నానో*+ ఆ ప్రజల పాలెం అంతటినీ వాళ్లు మలినపర్చకుండా ఉండేలా+ వాళ్లను పాలెంలో నుండి బయటికి పంపించేయాలి.”  కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగే చేశారు, వాళ్లను పాలెంలో నుండి బయటికి పంపించేశారు. యెహోవా మోషేకు చెప్పినట్టే ఇశ్రాయేలీయులు చేశారు.  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఒక పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదైనా పాపం చేసి యెహోవా పట్ల నమ్మకద్రోహంగా ప్రవర్తిస్తే, వాళ్లు దోషులు అవుతారు.+  వాళ్లు తాము చేసిన పాపాన్ని ఒప్పుకుని,+ తమ దోషానికి తగిన పూర్తి నష్టపరిహారం చెల్లించాలి; అలాగే దానికి ఐదోవంతు కలిపి ఇవ్వాలి.+ వాళ్లు ఎవరి విషయంలో తప్పు చేశారో వాళ్లకు దాన్ని ఇవ్వాలి.  అయితే ఆ నష్టపరిహారాన్ని తీసుకోవడానికి బాధితులకు దగ్గరి బంధువులు ఎవరూ లేకపోతే, దాన్ని యెహోవాకు తిరిగిచ్చేయాలి; అది యాజకునిది అవుతుంది. వాళ్ల పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి అర్పించే పొట్టేలుతో పాటు అది యాజకునిది అవుతుంది.+  “ ‘ఇశ్రాయేలీయులు యాజకుని దగ్గరికి తీసుకొచ్చే ప్రతీ పవిత్రమైన కానుక+ అతనికే చెందాలి.+ 10  వాళ్లలో ఒక్కొక్కరు కానుకగా ఇచ్చే పవిత్రమైన వస్తువులు అతనికి చెందినవిగానే ఉంటాయి. వాళ్లు యాజకునికి ఇచ్చేదేదైనా అది ఆ యాజకునికే చెందుతుంది.’ ” 11  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 12  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఒక వ్యక్తి భార్య తప్పుదారి పట్టి అతనికి నమ్మకద్రోహం చేసిందనుకోండి, 13  అంటే వేరే పురుషుడు ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు+ అనుకోండి; కానీ ఆ విషయం ఆమె భర్తకు తెలీదు, అది బయటపడలేదు; అలా ఆమె తనను తాను అపవిత్రపర్చుకున్నా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు, ఆమె పట్టుబడలేదు; అలాంటప్పుడు ఇలా చేయాలి: 14  ఆమె తనను తాను అపవిత్రపర్చుకున్నప్పుడు ఆమె భర్త రోషం ​తెచ్చుకొని, ఆమె నమ్మకత్వాన్ని అనుమానిస్తే; లేదా ఆమె తనను తాను అపవిత్రపర్చుకోకపోయినా ఆమె భర్త రోషం తెచ్చుకొని, ఆమె నమ్మకత్వాన్ని అనుమానిస్తే, 15  ఆ వ్యక్తి తన భార్యను యాజకుని దగ్గరికి తీసుకురావాలి, అలాగే ఆమె కోసం అర్పణగా ఈఫాలో పదోవంతు* బార్లీ పిండిని తీసుకురావాలి. అతను దానిమీద నూనె పోయకూడదు, సాంబ్రాణి ​పెట్టకూడదు. ఎందుకంటే అది రోషంతో కూడిన ధాన్యార్పణ, దోషాన్ని గుర్తుచేసే ధాన్యార్పణ. 16  “ ‘యాజకుడు ఆమెను ముందుకు తీసుకొచ్చి యెహోవా ఎదుట నిలబెడతాడు.+ 17  యాజకుడు ఒక మట్టిపాత్రలో పవిత్రమైన నీళ్లు తీసుకొని, గుడారపు నేల నుండి కొంత మట్టి తీసి ఆ నీళ్లలో వేస్తాడు. 18  యాజకుడు ఆ స్త్రీని యెహోవా ముందు నిలబెట్టి, ఆమె తలవెంట్రుకల్ని విప్పి, దోషాన్ని గుర్తుచేసే ధాన్యార్పణను అంటే రోషంతో కూడిన ధాన్యార్పణను+ ఆమె అరచేతుల్లో పెడతాడు; శాపాన్ని తీసుకొచ్చే చేదు నీళ్లను యాజకుడు తన చేతిలో ఉంచు​కుంటాడు.+ 19  “ ‘తర్వాత యాజకుడు ఇలా అంటూ ఆమెతో ప్రమాణం చేయిస్తాడు: “నువ్వు నీ భర్త అధికారం కింద ఉన్నప్పుడు వేరే ఏ పురుషుడూ నీతో లైంగిక సంబంధాలు పెట్టుకోకపోయుంటే,+ నువ్వు తప్పుదారి పట్టి నిన్ను నువ్వు అపవిత్రం చేసుకోకపోయుంటే, శాపాన్ని ​తీసుకొచ్చే ఈ చేదు నీళ్లు నీకు ఏ హానీ చేయవు. 20  కానీ నువ్వు నీ భర్త అధికారం కింద ఉన్నప్పుడు నిన్ను నువ్వు అపవిత్రపర్చుకుని తప్పుదారి పట్టి ఉంటే, నీ భర్తతో కాకుండా వేరే పురుషునితో లైంగిక సంబంధాలు పెట్టుకొని+ ఉంటే—” 21  తర్వాత యాజకుడు ఆ స్త్రీతో, శాపంతో కూడిన ఒక ఒట్టు వేయించి ప్రమాణం చేయిస్తాడు; యాజకుడు ఆ స్త్రీతో ఇలా అంటాడు: “యెహోవా నీ తొడ* పడిపోయేలా,* నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా చేస్తాడు; ఆ విధంగా నీ ప్రజలు శపించేటప్పుడు, ఒట్టు వేసేటప్పుడు నీ పేరు ఉపయోగించేలా యెహోవా చేస్తాడు. 22  శాపాన్ని తీసుకొచ్చే ఈ నీళ్లు నీ పేగుల్లోకి వెళ్లి నీ పొత్తికడుపు ఉబ్బిపోయేలా, నీ తొడ* పడిపోయేలా* చేస్తాయి.” దానికి ఆ స్త్రీ, “ఆమేన్‌! ఆమేన్‌!”* అనాలి. 23  “ ‘తర్వాత యాజకుడు ఆ శాపాల్ని గ్రంథంలో రాసి, వాటిని చేదు నీళ్లతో తుడి​చేయాలి. 24  తర్వాత అతను శాపాన్ని ​తీసుకొచ్చే ఆ నీళ్లను ఆ స్త్రీతో తాగిస్తాడు, అప్పుడు శాపాన్ని తీసుకొచ్చే ఆ నీళ్లు ఆమె లోపలికి వెళ్లి చేదును పుట్టిస్తాయి. 25  యాజకుడు రోషంతో కూడిన ధాన్యార్పణను+ ఆమె చేతిలో నుండి ​తీసుకొని యెహోవా ఎదుట దాన్ని ముందుకు, వెనుకకు కదిలిస్తాడు; తర్వాత అతను దాన్ని ​బలిపీఠం దగ్గరికి తీసుకొస్తాడు. 26  యాజకుడు ఆ ధాన్యార్పణలో నుండి పిడికెడు పిండిని జ్ఞాపకార్థ* భాగంగా తీసుకొని, బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు;+ తర్వాత అతను ఆ నీళ్లను ఆమెతో తాగిస్తాడు. 27  అతను ఆమెతో ఆ నీళ్లు తాగించినప్పుడు, ​ఒకవేళ ఆమె తనను తాను అపవిత్రపర్చుకుని తన భర్తకు నమ్మకద్రోహం చేసి ఉంటే, శాపాన్ని తీసుకొచ్చే నీళ్లు ఆమె లోపలికి వెళ్లి చేదు అవుతాయి; దానివల్ల ఆమె పొత్తికడుపు ఉబ్బిపోతుంది, ఆమె తొడ* పడిపోతుంది;* ప్రజలు శపించేటప్పుడు ఆమె పేరును ఉపయోగిస్తారు. 28  కానీ ఆ స్త్రీ తనను తాను అపవిత్రపర్చుకోకుండా పవిత్రంగా ఉండివుంటే, ఆ శిక్ష ఆమె మీదికి రాదు; ఆమె గర్భం దాల్చి, పిల్లల్ని కనగలుగుతుంది. 29  “ ‘ఇది రోషాన్ని గురించిన నియమం;+ అంటే, ఒక స్త్రీ తన భర్త అధికారం కింద ఉండగా తప్పుదారి పట్టి తనను తాను అపవిత్రపర్చుకున్నప్పుడు, 30  లేదా ఒక పురుషుడు రోషంతో తన భార్య నమ్మకత్వాన్ని అనుమానించినప్పుడు పాటించాల్సిన నియమం. ఆమె భర్త ఆమెను యెహోవా ముందు నిలబెట్టాలి, అప్పుడు యాజకుడు ఈ నియమంలో ఉన్నదంతా ఆమెకు చేయాలి. 31  భర్త మీద ఏ దోషం ఉండదు, భార్య మాత్రం తన దోషానికి తాను శిక్ష అనుభవిస్తుంది.’ ”

అధస్సూచీలు

లేదా “ప్రాణిని.” పదకోశం చూడండి.
లేదా “గుడారంలోనైతే నివసిస్తున్నానో.”
అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
పునరుత్పత్తి అవయవాల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
లేదా “వ్యర్థమైపోయేలా.” ఇది, పిల్లల్ని కనే సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తుండవచ్చు.
పునరుత్పత్తి అవయవాల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
లేదా “వ్యర్థమైపోయేలా.” ఇది, పిల్లల్ని కనే సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తుండవచ్చు.
లేదా “అలాగే జరగాలి! అలాగే జరగాలి!”
లేదా “ప్రాతినిధ్య.”
పునరుత్పత్తి అవయవాల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
లేదా “వ్యర్థమైపోతుంది.” ఇది, పిల్లల్ని కనే సామర్థ్యం కోల్పోవడాన్ని సూచిస్తుండవచ్చు.