సంఖ్యాకాండం 36:1-13

  • స్వాస్థ్యం పొందే కూతుళ్ల వివాహం గురించిన నియమం (1-13)

36  యోసేపు కుమారుల కుటుంబాల్లో నుండి గిలాదు వంశస్థుల కుటుంబ పెద్దలు మోషే దగ్గరికి, ప్రధానుల దగ్గరికి, అంటే ఇశ్రాయేలు కుటుంబ పెద్దల దగ్గరికి వచ్చి ​మాట్లాడారు. ఈ గిలాదు మాకీరు కుమారుడు,+ మాకీరు మనష్షే కుమారుడు, మనష్షే యోసేపు కుమారుడు.  వాళ్లు ఇలా అన్నారు: “ఆ దేశాన్ని చీట్లు వేసి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా పంచి ఇవ్వమని యెహోవా మా ప్రభువుకు ఆజ్ఞాపించాడు;+ అలాగే మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యాన్ని అతని కూతుళ్లకు ఇవ్వమని కూడా యెహోవా మా ​ప్రభువుకు ఆజ్ఞాపించాడు.+  ఒకవేళ వాళ్లు ఇశ్రాయేలులోని వేరే గోత్రా​నికి చెందిన పురుషుల్ని పెళ్లిచేసుకుంటే, వాళ్ల స్వాస్థ్యం మా తండ్రుల స్వాస్థ్యం నుండి వేరైపోయి వాళ్లు కొత్తగా ఏ గోత్రానికి చెందుతారో ఆ గోత్రంలో కలుస్తుంది; అలా, చీట్ల ద్వారా మాకు వచ్చిన స్వాస్థ్యం నుండి అది వేరైపోతుంది.  కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు సునాద సంవత్సరం*+ ​వచ్చినప్పుడు, ఆ స్త్రీల స్వాస్థ్యం కూడా వాళ్లు కొత్తగా ఏ గోత్రానికి చెందుతారో ఆ గోత్రంలో కలుస్తుంది; అలా వాళ్ల స్వాస్థ్యం, మా పూర్వీకుల గోత్రానికి చెందిన స్వాస్థ్యం నుండి వేరైపోతుంది.”  అప్పుడు యెహోవా ఆదేశం మేరకు మోషే ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “యోసేపు వంశస్థుల గోత్రంవాళ్లు చెప్తున్నది సరైనదే.  సెలోపెహాదు కూతుళ్ల విషయంలో యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: ‘వాళ్లు తమకు నచ్చినవాళ్లను పెళ్లిచేసుకోవచ్చు. అయితే తమ తండ్రి గోత్రంలోని కుటుంబాలకు చెందిన వ్యక్తుల్నే వాళ్లు పెళ్లిచేసుకోవాలి.  ఇశ్రాయేలులోని ఏ స్వాస్థ్యమూ ఒక గోత్రం నుండి ఇంకో గోత్రానికి మారకూడదు, ఇశ్రాయేలీయులు తమ పూర్వీకుల గోత్రపు స్వాస్థ్యాన్ని తమ దగ్గరే ఉంచుకోవాలి.  ఇశ్రాయేలు గోత్రాల్లో స్వాస్థ్యం పొందిన ప్రతీ కూతురు, తన తండ్రి ​గోత్రానికి చెందినవాళ్లలో ఒకర్ని పెళ్లిచేసుకోవాలి.+ దానివల్ల ఇశ్రాయేలీయులు తమ పూర్వీకుల స్వాస్థ్యాన్ని తమ దగ్గరే ఉంచుకోగలుగుతారు.  ఇశ్రా​యేలులోని ఏ స్వాస్థ్యమూ ఒక గోత్రం నుండి ఇంకో గోత్రానికి మారకూడదు, ఇశ్రాయేలు గోత్రాల వాళ్లు తమ స్వాస్థ్యాన్ని తమ దగ్గరే ​ఉంచుకోవాలి.’ ” 10  సెలోపెహాదు కూతుళ్లు సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే చేశారు.+ 11  సెలోపెహాదు కూతుళ్లయిన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా+ అందరూ తమ తండ్రి సహోదరుల కుమారుల్నే పెళ్లిచేసుకున్నారు. 12  వాళ్లు యోసేపు కుమారుడైన మనష్షే కుటుంబాలకు చెందినవాళ్లను పెళ్లిచేసుకున్నారు. అలా వాళ్ల స్వాస్థ్యం వాళ్ల తండ్రి కుటుంబ గోత్రంలోనే ఉండిపోయింది. 13  యొర్దాను ఇవతల, యెరికో ఎదురుగా, మోయాబు ఎడారి మైదానాల్లో యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, న్యాయనిర్ణయాలు ఇవే.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.