సంఖ్యాకాండం 30:1-16

  • పురుషుల మొక్కుబళ్లు (1, 2)

  • స్త్రీల, కూతుళ్ల మొక్కుబళ్లు (3-16)

30  తర్వాత మోషే ఇశ్రాయేలు గోత్రాల పెద్దలతో+ ఇలా అన్నాడు: “యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు:  ఒక పురుషుడు యెహోవాకు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే+ లేదా ఫలానా వాటికి దూరంగా ఉంటానని ఒట్టేసి ప్రమాణం చేస్తే,+ అతను మాట తప్పకూడదు.+ తాను చేస్తానని మాటిచ్చిన ప్రతీది అతను చేయాలి.+  “ఒకవేళ తన తండ్రి ఇంట్లో ఉంటున్న ఒక యువతి యెహోవాకు ఏదైనా మొక్కుబడి చేసుకుంటే లేదా ఫలానా వాటికి దూరంగా ఉంటానని ఒట్టు పెట్టుకుంటే,  ఆమె తండ్రి ఆమె చేసుకున్న మొక్కుబడి గురించి లేదా ఫలానా వాటికి దూరంగా ఉంటానని తాను పెట్టుకున్న ఒట్టు గురించి విన్నప్పుడు ఆమెకు అడ్డు చెప్పకపోతే, ఆమె చేసుకున్న మొక్కుబడులన్నీ ఆమె తీర్చాలి, ఫలానా వాటికి దూరంగా ఉంటానని తాను పెట్టుకున్న ఒట్టుకు కట్టుబడి ఉండాలి.  ఒకవేళ ఆమె తండ్రి ఆమె చేసుకున్న మొక్కుబడి గురించి లేదా ఫలానా వాటికి దూరంగా ఉంటానని తాను పెట్టుకున్న ఒట్టు గురించి విన్నప్పుడు అతను వాటికి అడ్డు చెప్తే, అవి రద్దు అవుతాయి. ఆమె తండ్రి వాటిని రద్దుచేశాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.+  “అయితే ఆమె తాను చేసుకున్న మొక్కుబడి కింద లేదా అనాలోచితంగా చేసిన ప్రమాణం కింద ఉన్నప్పుడు ఆమెకు పెళ్లయితే,  ఆమె భర్త వాటి గురించి విన్న రోజున వాటికి అడ్డు చెప్పకపోతే, ఆమె తాను చేసుకున్న మొక్కుబడికి, ఫలానా వాటికి దూరంగా ఉంటానని తాను పెట్టుకున్న ఒట్టుకు కట్టుబడి ఉండాలి.  అయితే ఆమె భర్త ఆమె చేసుకున్న మొక్కుబడి గురించి లేదా ఆమె అనాలోచితంగా చేసిన ప్రమాణం గురించి విన్న రోజున అతను వాటిని రద్దు చేయాలనుకుంటే చేయవచ్చు.+ యెహోవా ఆమెను క్షమిస్తాడు.  “అయితే ఒక విధవరాలు గానీ విడాకులైన స్త్రీ గానీ ఏదైనా మొక్కుబడి చేసుకుంటే, ఆమె తాను చేసుకున్న ప్రతీ మొక్కుబడికి కట్టుబడి ఉండాలి. 10  “అయితే ఒక స్త్రీ తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు, ఏదైనా మొక్కుబడి చేసుకుంటే లేదా ఫలానా వాటికి దూరంగా ఉంటానని ఒట్టు పెట్టుకుంటే, 11  ఆమె భర్త వాటి గురించి విన్నప్పుడు ఏమీ అడ్డు చెప్పకపోతే లేదా కాదనకపోతే ఆమె తాను చేసుకున్న మొక్కుబడులన్నీ తీర్చాలి, ఫలానా వాటికి దూరంగా ఉంటానని తాను పెట్టుకున్న ఒట్టుకు కట్టుబడి ఉండాలి. 12  అయితే ఆమె భర్త వాటిని విన్న రోజున, ఆమె చేసుకున్న మొక్కుబడులన్నిటినీ, ఫలానా వాటికి దూరంగా ఉంటానని ఆమె చేసిన ప్రమాణాలన్నిటినీ రద్దుచేస్తే, అవి రద్దు అవుతాయి.+ ఆమె భర్త వాటిని రద్దుచేశాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు. 13  ఆమె చేసుకున్న ఏ మొక్కుబడినైనా, ఫలానా వాటికి దూరంగా ఉంటానని ఆమె చేసిన ఏ ప్రమాణాన్నైనా ఆమె భర్తే స్థిరపర్చాలి, ఆమె భర్తే రద్దుచేయాలి. 14  రోజులు గడుస్తుండగా, ఆమె భర్త ఆమె చేసుకున్న మొక్కుబడికి లేదా ఫలానా వాటికి దూరంగా ఉంటానని ఆమె చేసిన ప్రమాణానికి ఏ అడ్డూ చెప్పకపోతుంటే అతను వాటిని స్థిరపరుస్తున్నట్టే. వాటి గురించి విన్న రోజున అతను వాటికి అడ్డు చెప్పలేదు కాబట్టి అతను వాటిని స్థిరపరుస్తున్నట్టే. 15  అయితే అతను ఆ తర్వాత, అంటే వాటి గురించి విన్న కొన్ని రోజుల తర్వాత వాటిని రద్దుచేస్తే, ఆమె అపరాధానికి అతను శిక్ష అనుభవిస్తాడు.+ 16  “భర్తకు, భార్యకు సంబంధించి; తండ్రికి, అతని ఇంట్లో ఉంటున్న యౌవనస్థురాలైన కూతురికి సంబంధించి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన నియమాలు ఇవి.”

అధస్సూచీలు